Editorials

జీవితమంటే….?

What is life? What is its purpose? What does it mean?

జీవితమంటే అర్థమేమిటని తన గురువును ప్రశ్నించాడో శిష్యుడు. ‘జీవితమనే పదానికి నిఘంటుపరంగా జీవనమని అర్థం. జీవితాన్ని జీవించడం ద్వారా దానికొక ప్రయోజనం, విలువను ఇవ్వగలిగితే అది ఓ అర్థాన్ని సంతరించుకుంటుంది. జీవితానికొక సార్థకతను, ఉదాత్తతను చేకూర్చాలి. అలా చేయడానికి మనకొక అవకాశంగా జీవితం వచ్చిందని భావించాలి. జీవన విధానమే మన జీవితాన్ని అర్థవంతం చేసుకుంటున్నామో లేదో నిర్ణయించేది’ అని నిర్వచించారా గురువు.
ఈ సృష్టిలో అనేక ప్రాణులున్నాయి. మనుషులూ ఉన్నారు. పుట్టుక, పెరుగుదల, అంతం… జీవులన్నింటికీ సహజం. పుట్టడానికి, గిట్టడానికి మధ్య సాగే జీవనమే మన మానసిక పరిణతిని తెలిపేది. శారీరకమైన ఎదుగుదల మిగిలిన జీవులకు లాగే మానవులకూ ఉన్నా ఆలోచనా శక్తితో మానవుడు వాటికంటే మిన్న అనిపించుకుంటున్నాడు. తనను బుద్ధిజీవిగా నిరూపించుకుంటున్నాడు.

మాట్లాడగలగడం మనిషికున్న శక్తుల్లోకెల్లా అద్భుతమైనది. అది అతడి భావోద్వేగాలను తెలియజేసే సాధనం. అది అతడి ప్రవర్తనకు, మానసిక స్థితికి అద్దమవుతుంది. వివేకంతో, వినయ విధేయతలతో ఎదుటివారు నొచ్చుకోకుండా సంభాషించడం ఓ మంచి లక్షణం. ఇది అలవరచుకోవడం ద్వారా చక్కని వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

ధార్మిక చింతన, సాధుజీవనం మన జీవితానికి గొప్పతనాన్ని ఇస్తాయి. పేదలకు, అనాథలకు, అన్నార్తులకు చేతనైన సహాయాన్ని చేయాలి. సాయం పొందుతున్నప్పుడు వారి కళ్లలో ప్రతిబింబించే ఆనందం సాయం చేస్తున్నవారికి ఎంతో మానసిక తృప్తినిస్తుంది.

ఆపన్నులను ఆదుకోవడానికి డబ్బే ఉండనక్కరలేదు. వారి బాధలకు మన కళ్ళు చెమర్చాలి. మనసు ద్రవించాలి. వారి కన్నీటిని తుడుస్తూ, ఓదార్పునివ్వాలి. మనోధైర్యాన్నివ్వాలి. రోగులకు సేవ చేయవచ్ఛు ఈ సేవాదృక్పథం వల్ల మనిషిలో ప్రేమ భావన పెంపొందుతుంది.

మంచివారితో స్నేహం, మంచి పుస్తకాలు చదవడం ద్వారా మనలో మంచి భావనలేర్పడతాయి. దీనివల్ల మంచి మార్గంలో పయనించేటందుకే మనసు తహతహలాడుతుంది. చెడు ఆలోచనలకు అడ్డుకట్ట పడుతుంది. ఇది మనకు క్రమశిక్షణ నేర్పుతుంది. నిబద్ధతనిస్తుంది. దీనివల్ల వ్యక్తిగతమైన, సామాజికమైన మేలు చేకూరుతుంది. ఇది జీవితానికొక పరమార్థాన్నిస్తుంది.

మనలో అందరూ మేధావులు ఎలా కాలేరో అలాగే సృజనశీలురూ కాకపోవచ్ఛు కొందరికి సాధారణ తెలివితేటలుండవచ్ఛు పెద్ద ఉద్యోగాన్ని, హోదాను పొందలేకపోవచ్ఛు ఆర్థిక స్థితి అంత గొప్పగా ఉండదు. ఇవన్నీ లేకపోయినా, జీవితాన్ని సారవంతమైనదిగా చేసుకోవడమన్నది మన చేతుల్లోనే ఉంది. ఎలా? మన నడవడిక ద్వారా. నిర్మలమైన మనసుతో, నిష్కపటమైన ఆలోచనలతో జీవించాలి. ఇతరులకు అపకారం చేయకూడదు. వీలైతే మేలు చెయ్యాలి. క్రమశిక్షణతో, ధర్మబద్ధంగా నడుస్తూ జీవనం సాగించాలి. ఇవి సాధారణ అంశాలుగా తోస్తున్నా అసాధారణమైనవి. ఆ స్థితి సాధించడం- ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థాయి, హోదా పొందటం కన్నా గొప్పది.

ఎదుటివారికి కష్టం కలిగినప్పుడు ఓ ఆత్మీయ వచనం పలకడం, చెమ్మగిల్లిన నయనంతో ఊరట ప్రసాదించడం జీవిత సాంద్రతను పెంచేవే. జీవితార్థాన్ని, దానిలోనే ఇమిడి ఉన్న పరమార్థాన్ని తేటపరచేవే.