Politics

అమరావతిపై ఎందుకు అంత అక్కసు?

Chandrababu Questions YS Jagan Govt

వైకాపా నేతలు, మంత్రులు రోజుకో మాట మాట్లాడి ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఆరోజు.. ఈరోజు ఎప్పుడైనా అమరావతి ప్రజారాజధానే. రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలుగా రాజధానిపై మీన మేషాలు లెక్కించింది. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన వనరులు, ఆదాయం సమకూర్చే రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణానికి రూ.లక్షా తొమ్మిదివేల కోట్లు అవసరమని చెబుతున్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెబుతున్నారు. అమరావతి కోసం మా ప్రభుత్వం రూ.9,165 కోట్లు ఖర్చు చేసింది. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఇప్పటికే అమరావతిలో ఉన్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ అనేది వినూత్నమైన ఆలోచన. అమరావతిలో భూములు ఇచ్చింది ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులే. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 20,490 మంది ఉన్నారు. అమరావతిలో రాజధాని లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*** అమరావతిపై ఎందుకంత అక్కసు?
‘‘రాజధాని మునిగిపోతుందని ప్రచారం చేశారు. కృష్ణా నది వరదలు వచ్చినప్పుడు ముంచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే పరిస్థితి లేదని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీర్పులో స్పష్టంగా చెప్పింది. రాజధాని మార్చే అధికారం మీకెవరిచ్చారు? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజధాని మార్పు ఎప్పుడైనా జరిగిందా. ఒకసారి విభజన జరిగినప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాజధాని ఎంపిక శాస్త్రీయంగా చేశాం. అందరికీ సమాన దూరంలో ఆమోదయోగ్యంగా ఉండేలా అమరావతిని ఎంపిక చేశాం. అమరావతిపై ఎందుకంత అక్కసు.

*** డబ్బులేదనడం నెపం మాత్రమే
హైదరాబాద్‌లాంటి మహానగరం కావాలని యువత కోరుకున్నారు. అమరావతిలో పెరిగిన భూమి విలువతో మహానగరం నిర్మించవచ్చు. అమరావతిలో 5వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చాం. అన్నీ అయ్యాక కూడా ప్రభుత్వం వద్ద 10వేల ఎకరాలు ఉంటుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి పన్నుల రాబడి పెరుగుతుందని అంచనా వేశం. నిన్నటి వరకు ఒకే సామాజిక వర్గం అని మాట్లాడారు. అమరావతిలో 75 శాతం మంది వెనుకబడిన కులాలని చెప్పాం. కానీ ఇప్పుడు మాటమార్చి డబ్బు లేదని మాట్లాడుతున్నారు. డబ్బు లేదంటూనే మళ్లీ ఇవన్నీ ఎలా కడతారు? ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెప్పడం నెపం మాత్రమే.

*** సీబీఐ విచారణకు సిద్ధమా?
విశాఖపట్నంపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారు? విశాఖను ఫిన్‌టెక్‌ హబ్‌గా చేయాలని అనుకున్నాం. విశాఖను పర్యాటక కేంద్రంగా చేసేందుకు ప్రణాళికలు రచించాం. లులు ఎంతో గొప్ప సంస్థ.. దాన్ని ఎందుకు ఆపేశారు. కంపెనీ తేవడం చాలా కష్టం.. దాన్ని వెళ్లగొట్టడం చాలా సులువు. ఏడు నెలల్లో అన్నీ భ్రష్టు పట్టించారు. మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? రాజధాని పేరుతో తల, మొండెం, చేతులు వేరు చేస్తే ఎలా? రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాజధానికి 30వేల ఎకరాలు కావాలని గతంలో జగన్‌ చెప్పారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. పుండుపై కారం చల్లి పైశాచికానందం పొందుతున్నారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తుంటే అర్థం కాదా? ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు పారిపోవడం ఖాయం. శ్మశానం, ఎడారి అంటూనే అమరావతి నుంచి పాలన చేస్తున్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటున్నారు. హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి. విశాఖపట్నంలో గత 7నెలల్లో మీరు చేసిన అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా?’’ అని చంద్రబాబు సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో రాజధాని అమరావతిపై గతంలో జగన్ చేసిన ప్రసంగం వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

*** ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ భయపడం
‘‘మీ వ్యాపారాలు, ఆస్తులు పెంచుకునేందుకు కుట్రలు పన్నొద్దు. నాపై కోపంతోనే ఇదంతా చేస్తున్నారా? రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. అమరావతిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే సీబీఐకి లేఖ రాయండి. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవచ్చు. రైతుల కోసం పోరాడితే మాపై సీబీఐ విచారణ చేస్తారా?. మేం ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ భయపడం. సీబీఐపై గౌరవం ఉంటే ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లట్లేదు. రాజధాని కట్టుకోలేదని ప్రజలను ఎగతాళి చేసేలా చేస్తున్నారు. బోస్టన్‌ కమిటీ, హై పవర్‌కమిటీ పేరుతో ఇష్టానుసార ప్రవర్తిస్తారా?. మీరు చెప్పిందే జీఎన్‌రావు కమిటీ నివేదికలో రాయిస్తారు. సొంతపనుల కోసమే ఎన్‌ఆర్‌సీకి మద్దతిచ్చామని వైకాపా నేతలే చెబుతున్నారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకమని ఇప్పుడంటున్నారు.. ఇది ద్వంద్వ వైఖరి కాదా?. ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం..మా ఎంపీలు ఓటింగ్‌లో కూడా పాల్గొనలేదు. రాజభవనాలు కట్టుకోవడం మీకు అలవాటు. హైదరాబాద్‌, బెంగళూరు, కడప, పులివెందులలో ప్యాలెస్‌లు ఎవరు కట్టుకున్నారు?. అమరావతి.. దేవభూమి, చారిత్రక నగరం. రాజధాని అభివృద్ధి చెందాక రైతులు ఇచ్చిన భూమిలోనే ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా. విశాఖపై వారి కన్నుపడింది, అందుకే ఇలాంటివి చేస్తున్నారు. జగన్‌ ప్రజల మనిషి అంటే అందరినీ భయభ్రాంతులను చేయడమేనా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.