DailyDose

కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా గుర్తించింది-రాజకీయం-12/27

Kanna Lakshmi Narayana Says Amaravati Must Be Capital-Telugu Politics Roundup Today-12/27

* బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్
ఏపి రాజధాని ని అమరావతి లో ఉంచాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.రైతులతో పాటు ప్రభుత్వ భూములకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది.గత ప్రభుత్వం రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది.గత ప్రభుత్వ సాకుతో జగన్ ప్రభుత్వం ఏకంగా రాజధానిని అమ్మేస్తుంది.ఈ రాష్టాన్ని జగన్ నిట్టనిలువునా ముంచుతాడని ప్రజలు ఊహించలేదు.గత ప్రభుత్వం కొంత మంది తో గాలి మాటలు మాట్లాడుస్తే….వైసిపి అంతకంటే బరితెగించింది.ఏపి రాజధాని అమరావతి గానే కేంద్రం గుర్తించి ప్రపంచ పటంలో పెట్టింది.అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కేంద్రం నిధులు ఇచ్చింది.
* రాష్ట్రపతిని కలిసిన ఎంపీ సుజనాచౌదరి.. అరగంటపాటు చర్చ!
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కలిశారు. ఏపీ రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఏపీ రాజధాని సమస్యలతో పాటు పలు కీలక విషయాలు చర్చించినట్లుగా సమాచారం. ఇవాళ సాయంత్రం ఈ భేటీకి సంబంధించి సుజనా మీడియా మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే. మరోవైపు టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పలు విషయాలను రాష్ట్రపతికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది…
*దేశం బాగుపడాలంటే ఇదొక్కటే మార్గం: రాహుల్
దేశంలోని అన్ని చట్ట సభల్లోనూ కులమతాలకు అతీతంగా గోడు పట్టించుకుంటేనే దేశం ఉపాధి, ఆర్థిక రంగాల్లో ముందుకు వెళ్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ సహా అసెంబ్లీల్లో అన్ని వర్గాల గొంతు విన్నప్పుడే నిరుద్యోగ సమస్య, ఆర్ధిక సంక్షోభానికి పరిష్కారం దొరకుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇవాళ రాహుల్ మాట్లాడుతూ.. ‘‘అన్ని మతాలు, కులాలను కలుపుకొని పోనంత వరకు భారత ఆర్థిక వ్యవస్థను నడిపించడం సాధ్యం కాదు. లోక్‌సభలో, శాసన సభల్లో ప్రతి భారతీయుడి గొంతు విన్నప్పుడే నిరుద్యోగ సమస్య, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడతాయి…’’ అని పేర్కొన్నారు.
*విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర దశ మారబోతుంది: పుష్ప శ్రీవాణి
విశాఖలో పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్ర దశ మారబోతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, చంద్రబాబు వైఖరి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసేలా ఉందని విమర్శించారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో వేర్పాటు ఉద్యమాలు రాకుండా సీఎం జగన్‌ విజన్‌తో ఆలోచించారని, జీఎన్‌ రావు కమిటీ నివేదికను అందరూ ఆహ్వనించాలని సూచించారు.
*రాష్ట్రానికి విశాఖే బెస్ట్‌ : టి. సుబ్బిరామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎంచుకోవడంపై రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి స్పందించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన జీఎన్‌ రావు కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్నా. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడం ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. విభజనకు ముందు హైద్రాబాద్‌ తర్వాత పెద్ద సిటీ విశాఖే. నగరంలో మౌలిక సదుపాయాలతో పాటు విస్తారమైన భూములున్నాయి. పరిశ్రమలున్నాయి. పారిశ్రామికవేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారు. విస్తరణకు మంచి అవకాశముంది. ఆర్థిక సమస్యలున్న దృష్ట్యా ప్రస్తుతానికి రెడీమేడ్‌ సిటీ విశాఖయే మంచి ఆప్షన్‌. మరింత అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అద్భుతమైన రాజధాని అవుతుందని వ్యాఖ్యానించారు.
*బొత్స ఇంటిని ముట్టడించిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌
రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడలోని ఆయన ఇంటిని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ముట్టడించింది. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బ్రహ్మంతోపాటు ఆందోళనకారులను పోలీసులు అడ్డగించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకొని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
* కేసీఆర్‌ తర్వాత కేటీఆరే : శ్రీనివాస్‌గౌడ్
ఐటీ మంత్రి కేటీఆర్‌పై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కేటీఆర్‌ అనే విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..కేటీఆర్‌ ముక్కుసూటి మనిషని, ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటే ఉన్న నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ కుటుంబం ప్రాణాలు సైతం పణంగా పెట్టిందన్నారు. యువనేత కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోతోందని, భవిష్యత్‌లో ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
*చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, జగన్ అమ్మాలని చూస్తున్నారు : రాజధానిపై కన్నా
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష చేశారు. కన్నాతో పాటు బీజేపీ నేతలు, రైతులు దీక్షలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై కన్నా ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
టీడీపీ ప్రభుత్వం రాజధానిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఆరోపించిన కన్నా.. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని అమ్మాలని చూస్తోందన్నారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన రాక్షస పాలనను తలపిస్తోందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వాపోయారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్న కన్నా.. పరిపాలన వికేంద్రీకరణను మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు
*భాగవత్కు రాజ్యాంగంపై అవగాహన లేదు: ఎంపీ అసదుద్దీన్
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్కు భారత రాజ్యాంగంపై అవగాహన లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. సమైక్య భారతదేశంలో ఒకే మతం ఉండాలని కంటున్న కలలు ఎన్నటికీ నెరవేరవన్నారు. ఆరెస్సెస్, భాజపాలు కలిసి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాయని, అంబేడ్కర్ కలలు కన్న నవభారతానికి తూట్లు పొడుస్తున్నాయని చెప్పారు. సెక్యులర్ భారతావనిలో ఇంతవరకు అన్ని కులాలు, మతాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చదివి అవగతం చేసుకోవాల్సిన అవసరం భాగవత్కు ఉందని ఒవైసీ పేర్కొన్నారు.
*మంత్రులే తప్పుదోవ పట్టిస్తున్నారు: తెదేపా
అమరావతిపై మంత్రులు, వైకాపా నేతల వ్యాఖ్యలను తెదేపా నేతలు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్ ఖండించారు. ఇప్పటికిప్పుడు రాజధానిని మార్చాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ‘‘ రాజధాని మార్చే అధికారం మీకెవరిచ్చారు? రూపాయి ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతిలో జరిగే అభివృద్ధికి ఎందుకు అడ్డం పడ్డారు. డబ్బులు లేకపోతే రాజధాని ఎందుకు మారుస్తున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ సజావుగా నడుస్తుంటే ఇప్పుడెందుకీ గందరగోళం తెచ్చారు. వాటిని మార్చడం ద్వారా ఇంకా ఖర్చు పెంచి ప్రజలపై భారం వేయడం ఏమిటి?. మీ మేనిఫెస్టో విడుదల రోజున కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏం చెప్పారు.
*33వేల ఎకరాలు ఏం చేస్తామో చెబుతాం: బొత్స
అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన తమకు లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి బొత్స సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ…. ప్రతి అంశంలోనూ బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. ‘‘ తెదేపా ప్రభుత్వం చేసినట్లు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయబోం. గ్రాఫిక్స్, సినిమాలు మేం చూపించం.. అన్నీ వాస్తవాలే చెబుతాం. అమరావతిలో 50శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తి చేస్తాం. రేపు మంత్రి మండలి సమావేశంలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటాం.
*సీఏఏపై విపక్షాలుతప్పుదోవ పట్టిస్తున్నాయి: షా
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అనవసర ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్నారు. ప్రజలే వారికి బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. దిల్లీలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా మాట్లడడానికి ఇష్టపడని కాంగ్రెస్.. చట్టంగా మారిన తర్వాత అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
*పురపాలక ఎన్నికలకు సమాయత్తం
పురపాలక ఎన్నికలకు వ్యూహరచన కోసం తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు దీన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులను దీనికి ఆహ్వానించారు. వచ్చే నెలలో పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సన్నాహకంగా ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు.
*మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం: లక్ష్మణ్
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టికపై సీఎం కేసీఆర్ తన మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక చేపట్టకూడదని ముస్లిం నేతలు కోరడం సరైంది కాదన్నారు.‘‘కేసీఆర్కు మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుంది. ముస్లిం ఓట్ల కోసం ఒవైసీ సాయం తీసుకుంటున్నారు.
*ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది
రాజధానిని అమరావతి నుంచి తరలించరాదన్న డిమాండ్తో గురువారం అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరవకుండా విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను పోలీసులు గృహనిర్బంధం చేయడంపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ప్రజాప్రతినిధుల్ని అడ్డుకోవడం అప్రజాస్వామికం. రాజధాని గ్రామాల్లో వేలాది పోలీసులను దించి పోలీసు రాజ్యంగా మార్చారు. ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఐదేళ్లుగా సజావుగా సాగుతున్న రాజధానిని వివాదాస్పదం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజలకు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వ ఏకపక్ష వైఖరి, నిరంకుశ విధానాలు, అణచివేత చర్యలకు మూల్యంచెల్లించాల్సి వస్తుంది’అని హెచ్చరించారు.
*30న జనసేన విస్తృతస్థాయి సమావేశం
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు జనసేన అధ్యక్షుని రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతి గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు-ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నిర్ణయించారన్నారు.
*ఆర్టీపీపీని ఎన్టీపీసీకి అప్పగింతకు ప్రయత్నం: సోమిరెడ్డి
రాయలసీమలో ప్రధాన ప్రాజెక్టు అయిన ఆర్టీపీపీని ఎన్టీపీసీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని ఎన్టీఆర్భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా నేలటూరులో ఉన్న ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాన్ని కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు. తక్కువ మానవ శక్తితో ఎక్కువ విద్యుదుత్పత్తిని సాధించే ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ కంటే నేలటూరు ముందుందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును పక్కనే ఉన్న సెంబ్ కార్ప్కో, అదానీ కంపెనీకో దాన్ని అంటగట్టేలా ఉన్నారని ఆరోపించారు. ఆర్టీపీపీ, ఏపీ జెన్కో ప్రాజెక్టులు వ్యాపార సంస్థలు కావని, సేవాదృక్పథంతో పనిచేసేవని వివరించారు.
*బీసీ వేదికపై రాజకీయ ప్రసంగమా?: తెదేపా
దేశరాజధానిలో ఇటీవల నిర్వహించిన జాతీయ బీసీ సమాఖ్య సదస్సులో అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య రాజకీయ ప్రసంగం చేయడం సరికాదని తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపడ సత్యనారాయణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగం ప్రసాదించిన బీసీల హక్కులు హరించుకుపోయాయని ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అనేక పథకాలు రద్దు చేసి బీసీల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. అధికారాలు లేని పదవులు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం బీసీలకు ఎలాంటి ఫలాలు అందించకున్నా.. జస్టిస్ ఈశ్వరయ్య అందజేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని సత్యనారాయణ గురువారమిక్కడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.