Politics

సిరిసిల్ల = పాపికొండలు

KCR Promises To Make Siricilla Another Papikondalu

గోదావరి, మానేరు జలాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ కోసం కన్నకలలు సాకారమవుతున్నాయని చెప్పారు. మిడ్‌మానేరు జలాశయం వద్ద పూజలు చేస్తున్నప్పుడు జీవితంలో గొప్ప సాఫల్యత సాధించినట్లు అనిపించిందన్నారు. కరీంనగర్‌ తీగలగుట్టపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలోని 1230 చెక్‌డ్యాంలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని.. అందులో సింహభాగం కరీంనగర్‌ జిల్లాకే చెందాయన్నారు. ఈ చెక్‌డ్యాంలను జూన్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఏ పార్టీకి లేని చిత్తశుద్ధి తమకు ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ఎక్స్‌రే కళ్లతో చూశామని చెప్పారు. కాళేశ్వరం జలాలతో మొట్టమొదటి ప్రయోజనం కరీంనగర్‌ జిల్లాకే కలుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సిరిసిల్ల ప్రాంతం పాపికొండలుగా మారబోతోందని కేసీఆర్‌ చెప్పారు. కరీంనగర్ కూడా థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న లండన్‌లా మారుతుందన్నారు. తాను గతంలో ఈ మాట చెబితే అర్థంకాక కొంతమంది వెకిలి నవ్వునవ్వారని.. జూన్ తర్వాత వాళ్లకు ఆ విషయం తెలుస్తుందన్నారు.