DailyDose

ఉమా దీక్ష అయిపోయింది-తాజావార్తలు

Devineni Uma Done With Protest-Telugu Breaking News Roundup Today

* 2019వ సంవత్సరం తమకు బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చిందని.. 2020 కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయంతో శుభారంభం చేస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎంఐఎంతో స్నేహ సంబంధాలు ఉంటాయని.. ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీతో కలిసి పోటీచేసే ప్రసక్తే లేదన్నారు.

* రాయితీలేని వంట గ్యాస్‌ ధరలు మరో సారి పెరిగాయి. సిలిండర్‌పై రూ.19లు పెంచారు. దీంతో సిలిండర్ ధర ఐదు నెలల్లో ఏకంగా రూ. 140కి పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో 14.2 కేజీల రాయితీ సిలిండర్‌ ధర దిల్లీలో రూ.714కి చేరింది.గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి ఏడాదికి 12 సిలిండర్లను రాయితీపై అందజేస్తారు. ఒక వేళ ఆ కోటా దాటితే ఆ సిలిండర్‌పై రాయితీ ధర ఉండదు.

* రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా అమరావతి ప్రాంతంలో పర్యటించిన తెదేపా అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించిన అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజావేదికను కూల్చివేస్తే మీరు మనకెందుకులే అనుకున్నారు. నా ఇల్లు ముంచే ప్రయత్నం చేస్తే అది నా సొంత గొడవ అనుకున్నారు. ఇప్పుడు రాజధాని విషయం వచ్చేసరికి మీలో ఆందోళన మొదలైంది’’ అంటూ నవ్వూతూనే ఈ వ్యాఖ్యలు చేశారు.

* కంటి చూపు సరిగా లేని వారి కోసం కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ఆర్బీఐ సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఎంఏఎన్‌ఐ’(మని) పేరుతో మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. దీన్ని బుధవారం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రారంభించారు. ఈ అప్లికేషన్‌ సాయంతో కంటి చూపు సరిగా లేని వారు సులువుగా నోట్లను గుర్తించేలా దీన్ని తయారు చేశామని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఈ యాప్‌ను ఒకసారి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని తెలిపారు.

* ఛానెళ్ల రేట్ల పెంపుపై టెలికమ్‌ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా సరికొత్త నిబంధన అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. 2019లో న్యూ టారీఫ్‌ ఆర్డర్‌ అమల్లోకి వచ్చాక ఛానెళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో నాణ్యతకు సంబంధించి, ఇంటర్‌ కనెక్షన్‌కు సంబంధించి నియమనిబంధనలను సవరించింది. ఆ నిబంధనల ప్రకారం వినియోగదారుడు తమకు నచ్చిన చానెల్‌ను ఎంపిక చేసుకొని వాటికి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఛానెళ్లు నిర్ణయించిన ఎమ్మార్పీ రేట్లు మాత్రమే చెల్లిస్తారు.

* ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 10 శాతం ప్రజలకూ సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉండదన్నారు. ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ నివేదిక అనంతరం రాజధానిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. శాసనసభను సమావేశపరిచి రాజధానిపై ప్రకటిస్తామన్నారు.

* భారతీయ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఆస్తులను విక్రయించటానికి బ్యాంకులకు అనుమతి లభించింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో ఉన్న ఆయన ఆస్తులను అమ్మి తమ సొమ్మును రాబట్టుకోవటానికి కోర్టు అనుమతించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్‌కు సంబంధించిన నేరాలను విచారించే ముంబయిలోని ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ న్యాయస్థానం ఈ విధంగా ఆదేశించింది.

* ప్రజల కోసం నేతలు చేసే మంచి పనులకు ఓట్లు పడతాయే తప్ప.. మద్యం సీసాలు పంచితే పడవని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలోని తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎన్నికలకు ముందు ఓ రకంగా.. గెలిచిన తర్వాత మరో రకంగా ఉంటారన్నారు. గత ఎన్నికల్లో నా వెంటే ఉండి వెన్నుపోటు పొడిచిందెవరో తనకు తెలుసని ఈటల వ్యాఖ్యానించారు. క్యాంపు రాజకీయాలు తన వల్ల కాదన్నారు.

* 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న అంతరిక్ష కార్యక్రమాలను గురించిన వివరాలను సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ కె శివన్‌ ప్రకటించారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగాలకు తాము రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా గగన్‌యాన్‌ కార్యక్రమంలో అవసరమైన శిక్షణ పొందటానికి నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్టు కూడా ఆయన చెప్పారు.

* వైద్య కళాశాలల్లో ప్రవేశానికి వీలు కలిపించే అర్హత పరీక్ష ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌’కు (నీట్‌ యూజీ 2020) దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీని జనవరి 6 రాత్రి 11:50కు పొడిగించారు. మొదట ఈ గడువు డిసెంబర్‌ 31, 2019గా ఉండేది. వెబ్‌సైట్‌లో ఏర్పడిన రద్దీ కారణంగా అనేక మంది విద్యార్థులు ఆ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. గడువును పొడిగించాలంటూ అనేక విజ్ఞాపనలు అందుకున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

* రక్షణ శాఖ పరిధిలో కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు, త్రిదళాధిపతి(సీడీఎస్‌) పదవితో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రధాని మోదీ చరిత్రాత్మక సంస్కరణలుగా అభివర్ణించారు. సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించని బిపిన్‌ రావత్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సేవలో అత్యంత నిబద్ధతతో పనిచేసిన అధికారిగా రావత్‌ను మోదీ అభివర్ణించారు. దేశ రక్షణలో అమరులైన వీర జవాన్లందరికీ.. సీడీఎస్‌ పదవి వ్యవస్థీకృతమవుతున్న సందర్భంగా మోదీ నివాళులర్పించారు.

* అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఆనాడు ఒప్పుకుని ఇప్పుడెందుకు యూటర్న్‌ తీసుకున్నారని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతులు చేస్తున్న మహాధర్నాకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఒక్కసారి సీఎం కావాలనే జగన్‌ కోరిక తీరింది. ఆయన మళ్లీ రారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న నాతోనే మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. మేమేం తప్పు చేయలేదు.. మాకు భయం లేదు’’ అని చంద్రబాబు అన్నారు.

* ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయని తెలిపిన శివన్‌ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు చంద్రయాన్-2 తరహాలోనే ఉంటుందని తెలిపారు.

* అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. రాజధాని రైతులకు మద్దతుగా తెదేపానేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరారవు గొల్లపూడిలో చేపట్టిన 24 గంటల దీక్షను బుధవారం మధ్యాహ్నం విరమించారు. పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ..రాజధాని అమరావతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు.

* ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ భారత్‌-పాక్‌ పరస్పరం కీలక సమాచారాన్ని పంచుకున్నాయి. ఇరు దేశాల్లోని అణు స్థావరాలు, సంబంధిత వసతులకు సంబంధించిన జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఉభయ దేశాల్లోని అణు స్థావరాలపై పరస్పర దాడిని నిరోధించే క్రమంలో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ మార్పిడి జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దౌత్య మార్గాల ద్వారా బుధవారం ఈ కార్యక్రమం ఏకకాలంలో జరిగినట్లు వెల్లడించింది.

* రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతుల నిరసన దీక్షలు 15వ రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. ఏపీని ప్రథమ స్థానంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నిరంతర కృషి చేశారన్నారు.

* జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఉగ్రమూకల కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో జవాన్ల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇంకా ఉగ్రమూకల ఏరివేత ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

* 2019 సంవత్సరం ఆటోమొబైల్‌ సంస్థలకు చేదు అనుభవాల్ని మిగిల్చినప్పటికీ చివరి నెల మాత్రం కొంత ఊరటనిచ్చింది. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ విక్రయాలు చివర్లో స్వల్పంగా పుంజుకొన్నాయి. ఈ నెలలో 1,33,296 ప్యాసింజర్‌ కార్లను విక్రయించింది. గత డిసెంబర్‌తో పోల్చుకొంటే 2.4శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా వేగనార్‌ వంటి కాంపాక్ట్‌ కార్లకు డిమాండ్‌ పుంజుకొంది. గత ఏడాది ఇదే నెలలో 1,21,479 వాహనాలను దేశీయంగా విక్రయించినట్లు మారుతీ పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగించాయి. 2020 నూతన సంవత్సరం మొదటిరోజున ట్రేడింగ్‌ ఆరంభం నుంచే మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 52 పాయింట్లు లాభపడి 41,306 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 14 పాయింట్లు లాభపడి 12,182 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ.71.32 వద్ద కొనసాగుతోంది.