Sports

గంగూలీకి అక్తర్ ప్రశంసలు

Shoaib Akhtar Sends His Wishes To Ganguly

టెస్టుల నిడివిని అయిదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించాలన్న ఐసీసీ ప్రతిపాదనను క్రికెటర్లు, మాజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ తెందుల్కర్‌, రికీ పాంటింగ్, మెక్‌గ్రాత్‌, భారత సారథి విరాట్‌ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌ పైన్, స్పిన్నర్‌ లైయన్‌ సంప్రదాయ క్రికెట్‌లో మార్పులు చేయకూడదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో పాక్‌ దిగ్గజ పేసర్ షోయబ్‌ అక్తర్‌ కూడా చేరిపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ నిడివిని తగ్గించకూడదని, దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చాడు. ‘‘నాలుగు రోజుల టెస్టు అనేది ఓ చెత్త ఆలోచన. దానికి ఎవరూ ఆసక్తి చూపించరు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఎంతో తెలివైనవాడు. అతడు దీన్ని ఎప్పటికీ జరగనివ్వడు. టెస్టు క్రికెట్‌ను బతికిస్తాడు. బీసీసీఐ అంగీకారం లేనిదే ఐసీసీ నాలుగు రోజుల టెస్టును నిర్వహించలేదు. పాకిస్థాన్‌, భారత్, శ్రీలంక నుంచి మరికొంత మంది ముందుకు వచ్చి ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకించాలి. దీనిపై పాక్‌ దిగ్గజ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి’’ అని అక్తర్‌ తెలిపాడు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్తు పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తున్న సంగతి తెలిసిందే.