Editorials

అమెరికా-ఇరాన్ సిగపట్లు

USA-Iran Fighting Over Everything

అమెరికా భ‌ద్ర‌తా ద‌ళాలు మొత్తం ఉగ్ర‌వాదులే అని ఇరాన్ ప్ర‌క‌టించింది. మిలిట‌రీ టాప్ క‌మాండ‌ర్ ఖాసిమ్ సులేమానీని డ్రోన్ దాడితో అమెరికా హ‌త్య చేసిన నేప‌థ్యంలో ఇరాన్ ఇవాళ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. మేజ‌ర్ జ‌న‌ర‌ల్ సులేమానీ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఇవాళ కీర్మ‌న్ ప‌ట్ట‌ణంలో సులేమానీ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. సులేమానీ సొంత ఊరు కీర్మ‌న్‌. అక్క‌డే ఇవాళ సులేమానీ పార్గీవ‌దేహాన్ని ఖ‌న‌నం చేయ‌నున్నారు. సులేమానీ శవ‌పేటిక‌తో గ‌త మూడు రోజుల నుంచి ప‌లు న‌గ‌రాల్లో ఇరాన్ ప్ర‌జ‌లు అంతిమ‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇరాన్‌పై ల‌క్షిత దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా ఇటీవ‌ల వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 9న జరగాల్సిన ఐక్యారాజ్య సమితి భద్రతా మండలి సమావేశానికి ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావద్‌ జరీఫ్‌ రాకుండా అడ్డుకునేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని వారాల క్రితం జరీఫ్‌ దరఖాస్తు చేసుకున్న వీసాను తిరస్కరించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు ట్రంప్‌ పాలకవర్గం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు ఫోన్‌ ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేసినట్లు వాషింగ్టన్‌ దౌత్యవర్గాలు తెలిపాయి. అయితే ఐరాస సమావేశాలకు విదేశీ ప్రతినిధులను అమెరికా తప్పనిసరిగా అనుమతించాలని 1947 నాటి ‘హెడ్‌క్వార్టర్స్‌ అగ్రిమెంట్‌’ చెబుతోందని విశ్లేషకులు తెలిపారు. తమ దేశ అగ్రశ్రేణి సైనిక జనరల్‌ ఖాసీం సులేమానీ మరణం తర్వాత అంతర్జాతీయ సమాజానికి తమ గళం వినిపించడానికి ఇరాన్‌ ఈ సమావేశాన్ని అవకాశంగా భావించినట్లు సమాచారం. కానీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం, ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.