Agriculture

సినిమాలో మాదిరి పంటలపై మిడతల దాడి

Pests attacking corn crops in India

మిడతల దండు దాడి చేసిందంటే ఆ పంట పొలం పని నిమిషాల్లో అయిపోయినట్టే. మిడతల దండు పంటలపై విరుచుకు పడుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎడారులకు దగ్గరగా ఉన్న రాజస్థాన్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో పంటలకు మిడతల బెడద ఎక్కువ. అయితే, అప్పుడప్పుడూ తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ మిడతల దండు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు పంటలను నాశనం చేసింది. లక్షలాది మిడతలు ఒక్కుదుటన ముఖ్యంగా మొక్కజొన్న తదితర పంటలను ధ్వంసం చేసింది. నిమిషాల్లోనే కంకులు, ఆకులను నమిలేశాయి. కొన్ని వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పురుగుమందులు పిచికారీ చేసే సమయం కూడా లేకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా, ఉత్తర గుజరాత్, రాజస్థాన్‌లో కనీసం 9 వేల హెక్టార్లలో రబీ పంటలను మిడతల దండు నమిలేసినట్లు అధికారులు తేల్చారు. గోధుమ, ఆవ, ఆముదం, జీలకర్ర తదితర పంటలు సాగు చేసే రైతులకు రూ. 5 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా. మూడింట ఒక వంతు కన్నా ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 7 వేల చొప్పున పరిహారం చెల్లించడానికి గుజరాత్, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. మిడతల దండు బెడద ఉన్నది భారత దేశానికి మాత్రమే కాదు. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలలో 60 దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. 200 ఎం.ఎం. కన్నా తక్కువ వర్షపాతం ఉండే ఎడారి ప్రాంతాల్లో ఈ మిడతల దండు సంతతిని పెంపొందించుకుంటూ దగ్గర్లోని దేశాల్లో పంటలను ఆశిస్తూ ఉంటాయి. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మిడతలు విజృంభిస్తూ గాలులతో పాటు అతి తక్కువ సమయంలోనే దూరప్రాంతాలకు పయనిస్తూ ఉంటాయి. మిడతల దండు గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు సరిహద్దులు దాటి పయనిస్తుంది. మిడతల దండు మెరుపు దాడులను పురుగుమందులతోనే కొంతమేరకు ఎదుర్కోగలమని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఏయే దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ యే నెలల్లో ఏయే దేశాల్లో మిడతలు విజృంభిస్తాయి? అనే సమాచారంతో కూడిన ముందస్తు హెచ్చరికలను ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) ప్రతి నెలా విడుదల చేస్తూ ఉంటుంది. మిడతల దండు బెడదపై పాకిస్తాన్, భారత్‌ ప్రభుత్వాలను ఎఫ్‌.ఎ.ఓ. గత డిసెంబర్‌ మూడో వారంలో అప్రమత్తం చేసింది. మిడతల దండు వల్ల మనుషులకు, పశువులకు హాని లేదు.