DailyDose

అమరావతిలో రణరంగం–TNI కధనాలు

TNILIVE Stories On Amaravathi Farmers Protest And Capital Issues

*రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి రైతులు పాదయాత్రగా బయల్దేరారు. నందివెలుగు సమీపంలోకి పాదయాత్ర చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకున్నారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన పోలీసులు పాదయాత్ర నందివెలుగు దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరోసారి అడ్డుకుని ఆలపాటిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీసు జీపులో దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా రైతులు, తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతుల పాదయాత్రతో గుంటూరు-తెనాలి మార్గంలో రాకపోకలకు అంతరాయమేర్పడింది.
* రాజధానికోసం పోరాటం కొనసాగిస్తాం: చంద్రబాబు
శాంతిభద్రతల పేరుతో అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని తెదేపా అధినేతచంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో చంద్రబాబుతో పాటు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రాజధాని కోసం పోరాడుతూ ఇప్పటికే 11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. ఐకాస నేతల బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. సెక్యూరిటీ కోసం బస్సులు ఆపామని కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. నేను కూడా అడ్డుకుని ఉంటే వాళ్లు పాదయాత్రలు చేసేవారా అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజారాజధాని కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
* శ్రమదానంతో రాజధాని నిర్మిస్తాం : రైతులు
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతుల ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచే రైతులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. తుళ్లూరు ధర్నా చౌక్‌లో కొనసాగుతున్న దీక్షలకు సంఘీభావంగా దళిత జేఏసీ నాయకులు ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ‘సేవ్‌ అమరావతి’ అంటూ రైతులు నినదించారు. మందడంలో రైతులు రోడ్డుపైనే టెంటు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మించుకుంటామని స్పష్టం చేశారు.
* అమరావతికి మద్దతుగా ‘మన్‌కీ బాత్‌’కు ఫోన్లు
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని రైతులు, యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి రైతులు ఇవాళ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తమ నిరసనలు ప్రధాని నరేంద్ర మోదీకి వినిపించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన్‌కీ బాత్‌ ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి తమ ఆవేదనను తెలియజేశారు. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి రైతులను ఆదుకోవాలని కోరారు.
అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రధానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రైతులు పేర్కొన్నారు. కార్యక్రమం ద్వారా తమ ఆవేదన తెలుసుకున్న ప్రధాని మోదీ తప్పకుండా సమస్యపై చర్చిస్తారని, రాజధాని అంశంపై కేంద్ర నిర్ణయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.
* రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతుల ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచే రైతులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. తుళ్లూరు ధర్నా చౌక్‌లో కొనసాగుతున్న దీక్షలకు సంఘీభావంగా దళిత జేఏసీ నాయకులు ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ‘సేవ్‌ అమరావతి’ అంటూ రైతులు నినదించారు. మందడంలో రైతులు రోడ్డుపైనే టెంటు వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మించుకుంటామని స్పష్టం చేశారు.
* రాజధాని రైతులను సంతృప్తి పరిచేలా హైపవర్ కమిటీ నిర్ణయం ?
రాజధాని అమరావతి కోసం లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులను సంతృప్తి పరిచేలా ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయం ఉండబోతోందని సమాచారం.రాజధాని అమరావతి కోసం లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులను సంతృప్తి పరిచేలా ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయం ఉండబోతోందని సమాచారం. హైపవర్ కమిటీ రెండోసారి సమావేశం రేపు జరగబోతోంది. ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపిన కమిటీ.. ఈనెల 10న మరోసారి భేటీ కాబోతోంది. మొదటి భేటీలో అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడింది. రెండో భేటీలో ప్రధానంగా అమరావతి రైతుల అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
* అమరావతి రైతులకు ఇస్తున్న కౌలు డబ్బులను ఖర్చు పెడితే మళ్లీ ఆ భూములను సాగుకు అనుకూలంగా చేసి ఇవ్వవచ్చని గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతోపాటు గతంలో తాము అధికారంలోకి వస్తే ఇష్టం లేకుండా అమరావతికి భూములు ఇచ్చిన వారికి వారి భూములు తిరిగి ఇచ్చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ రెండు అంశాలను బేరీజు వేస్తే ప్రభుత్వం అలాంటి ప్రతిపాదన ఏదైనా చేసే అవకాశం ఉందా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది