Business

ఆదాయపు పన్ను తగ్గించుకునే మార్గాలు ఇవి

How to reduce your income taxes-Telugu business tips

ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గరపడుతోందంటే చాలు సగటు ఉద్యోగి ఆలోచనలన్నీ ఆదాయ పన్ను తగ్గించుకోవడం పైనే! ఈ ఏడాది మార్చి 31తో 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిస్తున్న వేళ సగటు వేతన జీవులంతా పన్ను భారం ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటారు. రూ.5లక్షలకు పైగా వార్షికాదాయం పొందుతున్న వారందరికీ జనవరి, ఫిబ్రవరి మాసాలు ఎంతో కీలకం. తాము పెట్టే పెట్టుబడి పథకాలు, ఖర్చులకు సంబంధించిన బిల్లులను సేకరించి వాటిని యాజమాన్యాలకు సమర్పించడం ద్వారా పన్ను మినహాయింపులు పొందే విషయంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. ఈ నేపథ్యంలో మీ పెట్టుబడి పథకాలు, ఖర్చులను చూపించడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అన్ని వెసులుబాట్లనూ వినియోగించుకున్నారో లేదా ఒకసారి పరిశీలించుకోండి. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 80 సీ కింద ఉన్న పెట్టుబడుల ద్వారా మాత్రమే పన్ను ఆదా చేసుకోవచ్చని చాలా మంది భావిస్తుంటారు. దీని ద్వారా రూ.1.5లక్షలు పన్ను మినహాయింపు పొందేవీలుంది. అయితే, 80 సీతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా అనేక మినహాయింపులు పొందొచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం..
* సెక్షన్‌ 80E ప్రకారం విద్యా రుణంపై చెల్లించిన వడ్డీ ద్వారా కూడా మినహాయింపు ఉంటుంది. ఉద్యోగులెవరైనా తన సొంత లేదా కుటుంబ సభ్యుల విద్యపై తీసుకున్న రుణంపై చెల్లించిన వడ్డీపై ఈ సెక్షన్‌ కింద పన్ను బారి నుంచి ఉపశమనం పొందే వెసులుబాటు ఉంది. రుణాన్ని తిరిగి చెల్లించడం మొదలు పెట్టిన సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ల పాటు చెల్లించిన మొత్తం వడ్డీ పై మినహాయిపు పొందొచ్చు. అసలుపై పన్ను మినహాయింపు వర్తించదు. ఈ మినహాయింపు పొందేందుకు ఏటా రుణం తీసుకున్న సంస్థ నుంచి రుణ చెల్లింపు సర్టిఫికేట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
* సెక్షన్‌ 80 TTA ప్రకారం బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో మీరు చేసే పొదుపు డిపాజిట్ల వడ్డీపైనా పన్ను మినహాయింపులు పొందవచ్చు. వీటిపై రూ.10వేల దాకా మినహాయింపు ఉంది. అయితే, రిటర్నులను సమర్పించేటప్పుడు ఈ వివరాలను తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది.
* సెక్షన్‌ 80 జీజీ ప్రకారం పనిచేసే సంస్థల నుంచి HRA పొందని వారికి పన్ను మినహాయింపులు ఉంటాయి. స్వయం ఉపాధి కలిగిన వాళ్లకు నెలకు రూ.5వేల దాకా మినహాయింపునకు వీలుంది. అయితే, ఫారం 10BA, అద్దెకు సంబంధించిన పత్రాలను జతచేసి సమర్పించాల్సి ఉంటుంది.
* సెక్షన్‌ 80 D కింద ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియాన్ని క్లెయిం చేసుకోవచ్చు. రూ. 25వేల వరకు సొంతానికి, జీవిత భాగస్వామి పేరుమీద తీసుకున్న పాలసీల ప్రీమియానికి వర్తిస్తుంది. తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి అదనంగా రూ.25వేల వరకు మినహాయింపు పొందవచ్చు. సీనియర్‌ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50వేల వరకు ఉంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్య బీమాపై 25 నుంచి 30శాతం వరకు రాయితీ ఉంటుంది.
* సెక్షన్‌ 80సీసీడీ (1బీ) ప్రకారం జాతీయ పింఛను పథకం (NPS)లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మినహాయింపులు పొందొచ్చు. ఇది సెక్షన్‌ 80సీసీడీ (1బీ) కింద రూ.50వేలు అదనపు తగ్గింపు అందిస్తుంది. సాధారణంగా అనేకమంది తమ పిల్లల విద్య, వివాహం వంటి వాటినే దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెడతారు తప్ప తమ పదవీ విరమణ అనంతర జీవితం గురించి ఆలోచించడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఎన్‌పీఎస్‌ అనేది 60 ఏళ్ల తర్వాత వార్షిక లేదా రెగ్యులర్‌ పింఛను అందించే పథకం అని గుర్తుపెట్టుకోవాలి.
* సెక్షన్‌ 24(బి) ప్రకారం గృహ రుణంపై వడ్డీని చెల్లించడం పైనా ఆదాయ పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇంటిని కొనడం ప్రతిఒక్కరి జీవితంలో అతి పెద్ద పెట్టుబడి. ఇంటి కొనుగోలుకు అనేకమంది గృహ రుణాలు తీసుకుంటుంటారు. పన్ను మినహాయింపు విషయంలో గృహ రుణంపై రెండు వేర్వేరు సెక్షన్లు కింద ఉపశమనం కలుగుతుంది. గృహ రుణంపై అసలు, వడ్డీ రెండింటిపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 80సీ కింద గృహ రుణం అసలుపైన, ఇంటి రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్‌ 24(బి) కింద మినహాయింపులు పొందవచ్చు.
* సెక్షన్‌ 80 జీ ప్రకారం స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. విరాళం ఇచ్చే సంస్థల ఆధారంగానూ మినహాయింపు వేర్వేరుగా ఉంటుంది. ప్రధానమంత్రి జాతీయ నిధికి ఇచ్చే విరాళంపై 100శాతం మినహాయింపు ఉండగా.. జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌కు ఇచ్చే విరాళంలో పన్ను మినహాయింపు 50శాతంగా ఉంది.