Sports

మలేషియా టోర్నీ నుండి నిష్క్రమించిన సింధు

PV Sindhu Returns Home After Losing In Malysian Tournament

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ బ్యాడ్మింటన్ 500 టోర్నీ నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో 16-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది. మొదటి గేమ్‌లో సింధు తొలుత ఆధిక్యం సాధించినా తర్వాత దాన్ని కాపాడుకోలేకపోయింది. 15-15తో స్కోరు సమంగా ఉన్న దశలో తైజు వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో కూడా తైజునే ఆధిపత్యం చెలాయించింది. ఒక దశలో 11-20తో వెనుకంజలో ఉన్న సింధుకి ఘోర పరాభవం తప్పదని భావించారంతా. కానీ తెలుగు తేజం ఆఖర్లో చెలరేగి 16-20తో నిలిచింది. అయితే గేమ్‌ విజయానికి ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ దూరంలోనే ఉండటంతో సింధుకి ఓటమి తప్పలేదు. దీంతో మరో గేమ్‌ మిగిలుండగానే తైజు సెమీస్‌కు చేరింది. ఇప్పటివరకు తైజుతో సింధు 17 మ్యాచుల్లో తలపడగా 5 మ్యాచులే నెగ్గింది. ఒలింపిక్‌ పతక విజేత కరోలినా మారిన్‌తో జరిగిన మరో క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ ఘోర పరాజయం చవిచూసింది. 8-21, 7-21 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మలేసియా మాస్టర్స్‌లో భారత్‌ కథ ముగిసింది.