Business

వంటనూనె ధరల భగభగ

Cooking Oil Price Super High In India

దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. గత నెలరోజుల్లో దేశంలో ముడి పామాయిల్‌ ధరలు ఇంచుమించు 15 శాతం వరకు పెరిగాయి. డిసెంబర్‌ 10 నాటికి పది కేజీల ముడి పామాయిల్‌ ధర దేశంలో రూ.731.40 ఉండగా జనవరిలో ఈ ధర రూ.839.80గా ఉంది. నిదానంగా పెరుగుతున్న పామాయిల్‌ ధరకు వంతపాడుతూ ఇతర వంటనూనెల ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ ప్రకారం, దిల్లీలో అవనూనె ధర ఒక నెలలో కేజీకి రూ.12 పెరిగింది. ఇక్కడ పామాయిల్‌ ధర రూ.91 నుంచి రూ. 105కి, సోయాబీన్‌ నూనె ధర రూ.106 నుంచి రూ.122కు ఎగబాకాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ విధమైన పరిస్థితే ఉన్నట్టు తెలుస్తోంది.శుక్రవారం నాటికి మలేషియాలో రిఫైన్డ్‌ పామాయిల్‌ ధర టన్ను 800 డాలర్లుగా ఉంది. కాగా డిసెంబర్‌లో ఈ ధర కేవలం 710 డాలర్లు మాత్రమే. దీంతో భారత ప్రభుత్వం మలేషియా నుంచి రిఫైన్డ్‌ పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించింది. మలేషియా రిఫైన్డ్‌ పామాయిల్‌ను నిషేధిత జాబితాలోకి చేర్చింది. అయితే ఈ దేశం నుంచి ముడి పామాయిల్‌ దిగుమతులకు ఈ నిషేధం వర్తించదు.వంటనూనెల ధర భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని.. దేశంలో నిల్వలు తక్కువగా ఉన్నందువల్ల ధరల పెరుగుదల నుంచి త్వరితంగా ఊరట లభిస్తుందని ఆశించలేమని నిపుణులు అంటున్నారు. భారత్‌ ముఖ్యంగా దిగుమతుల పైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వంటనూనె ధరలు తగ్గాలంటే దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంచటం ఒకటే ప్రత్యామ్నాయమని వారు సూచించారు.