Food

సిద్ధిపేట స్పెషల్ మటన్ పచ్చడి

Siddhipeta Special Mutton Pickle-Telugu Food Recipes

కూలి చేసుకొనే బతికేవారు కొందరైతే.. బీడీలు చుడుతూ బతుకెళ్లదీసేవారు మరికొందరు. దిగుబడులు లేని వ్యవసాయంతో రోజంతా కుస్తీ పడుతూ అప్పులపాలైనవారు ఇంకొందరు. ఇలాంటి మహిళలందరినీ ఒకచోట చేర్చి.. ఆర్థికంగా ఎదిగే ఆలోచన చెప్పారు ఆ గ్రామ సర్పంచ్‌. ఆ ఆలోచన వారిలో పెనుమార్పును తీసుకొచ్చింది. యోచనకు తగ్గ కార్యాచరణ, కష్టం.. ఆ ఊరి మహిళలను రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలిపాయి. ఆ వినూత్న ఆలోచనే పచ్చళ్ల తయారీ. ఆ పచ్చళ్లే.. ఒడుదొడుకుల జీవితాల్లో ఆర్థిక పునాదులు వేసి, ఆ మహిళలను మన ముందు విజేతలుగా నిలబెట్టాయి. అనతి కాలంలోనే అద్భుత ఆదరణ చూరగొన్న ‘సిద్దిపేట మాంసాహార పచ్చళ్ల’పై ‘జిందగీ’ కథనం.
**సిద్దిపేట జిల్లా ఇర్కోడు గ్రామంలో దాదాపు 56 డ్వాక్రా సంఘాలున్నాయి. అందరినీ ఓ చోట సమావేశపర్చి.. మటన్‌ పచ్చళ్లు తయారీ ఆలోచన చెప్పారు ఇర్కోడు సర్పంచ్‌, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి. ఆసక్తి ఉన్నవారిని గ్రూపునకు ఒక్కరి చొప్పున ఆహ్వానించారు. అలా 20 మంది మహిళలు ముందుకొచ్చారు. కొందరు వ్యవసాయం, ఇతర పనుల్లో ఉండడం వల్ల రాలేకపోయారు. ముందుకొచ్చిన 20 మంది మహిళలకు హైదరాబాద్‌లోని జాతీయ మాంసం పరిశోధనా కేంద్రంలో వారంపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో పచ్చళ్లు, నాన్‌వెజ్‌ స్నాక్స్‌, మటన్‌ సూప్స్‌ తయారీ వంటి 12 రకాల ఐటెమ్స్‌ నేర్పించారు. శిక్షణ ముగిసిన తర్వాత మరో 11 మంది మహిళలు వ్యవసాయ పనుల రీత్యా పచ్చళ్ల తయారీకి వెనుకడుగు వేశారు.
**దీంతో 9 మంది మహిళలు మాత్రమే ధైర్యం చేసి.. తమ కార్యాచరణను విజయవంతంగా అమలు చేస్తున్నారు. వీరికి కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందింది. మంత్రి హరీశ్‌రావు ఇర్కోడుపై ప్రత్యేక దృష్టిపెట్టి సెర్ప్‌ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) సాయంతో వాహనాన్ని (మీట్‌ ఆన్‌ వీల్స్‌), సంబంధిత యంత్ర సామగ్రినీ అందించారు. వీరంతా కలిసి ‘ఇర్కోడు మహిళా సమాఖ్య ఫుడ్స్‌’గా ఏర్పడి.. పచ్చళ్లు, స్నాక్స్‌ తయారు చేసి, ‘మీట్‌ ఆన్‌ వీల్స్‌’ వాహనం ద్వారా విక్రయిస్తున్నారు. ఈ వాహనంతో ప్రతి రోజు ఉదయం నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాలలోని అన్ని కాలనీలకు వెళ్లి తాజా మాంసం, చికెన్‌, ఇతర ఉత్పత్తులు విక్రయాలు చేపడుతున్నారు. దీంతో ప్రజలకు నాణ్యమైన మాంసంతో పాటు, స్వచ్ఛమైన పదార్థాలు లభిస్తున్నాయి. తద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభిస్తున్నది. ఇలా ఎన్నో డ్వాక్రా సంఘాలకు ఆదర్శమయ్యారు.
*18 నెలల వయసున్న జీవాలు!
ప్రస్తుతం ఆరోగ్యవంతమైన కోళ్లు, గొర్రెలు, పొట్టేళ్లను మహిళలే కొనుగోలు చేస్తున్నారు. వాటిని హలాల్‌ చేయించి.. మాసం నుంచి బొక్కలను వేరుచేసి, శుద్ధి చేసి పచ్చళ్లకు ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం మరీ ఎక్కువ వయసు.. తక్కువ వయసున్నవి కాకుండా.. మధ్యస్తంగా 18 నెలల వయసున్న వాటినే పచ్చళ్లకు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ వయసు జీవాలు ఆరోగ్యంగా ఉండంతోపాటు వాటి మాంసం రుచిగాను ఉంటుంది. ఒకసారి పెట్టిన పచ్చడి దాదాపు మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. దానిపై మూత తీసినా పచ్చడి చెడిపోకుండా, రుచిలో ఏమాత్రం తేడా లేకుండా ఉండడం సిద్దిపేట పచ్చళ్ల ప్రత్యేకత. పచ్చడి తయారు చేసిన తర్వాత.. కేంద్రంలో నిల్వ ఉంచడానికి ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నారు.
*వారానికి క్వింటాల్‌ పచ్చడి రెడీ..
ఇర్కోడు డ్వాక్రా బృందాల మహిళలు వారానికి దాదాపు క్వింటాల్‌ పచ్చడి పెడుతుంటారు. రెండ్రోజులకు ఒకసారి 30 నుంచి 40 కిలోల మాంసాన్ని పచ్చడిగా పెడుతుంటారు. నాన్‌వెజ్‌ స్నాక్స్‌కు రోజుకు 5 కేజీల మటన్‌, 10 కేజీల చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు. ఇలా వారంలో క్వింటాల్‌ వరకు పచ్చళ్లు/స్నాక్స్‌ తయారవుతున్నాయి. ఆర్డర్లు ఎక్కువగా ఉన్నరోజు.. ఎక్కువ మొత్తంలో మాంసం, చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు. మాంసం నుంచి వేరు చేసిన బొక్కలతో ప్రత్యేకంగా సూప్‌లు తయారు చేయడం కూడా నేర్చుకున్నారు. 9 మంది మహిళ బృందం కచ్చితంగా ఉదయం పది గంటలకు పచ్చళ్ల తయారీ కేంద్రానికి రావాల్సిందే. పచ్చడి తయారీ రోజు.. రాత్రి 10 గంటలైనా పని పెండింగ్‌ లేకుండా.. పూర్తి చేసుకొని వెళ్లడం వీరి నిబద్ధతకు నిదర్శనం.
*పెరుగుతున్న ఆర్డర్లు
ఇర్కోడు మహిళలు పచ్చళ్లతో పాటు నాన్‌వెజ్‌తో స్నాక్స్‌ కూడా తయారు చేస్తున్నారు. ఇవి కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. చాలామంది వీటి రుచి తెలుసుకొని ప్రత్యేకంగా ఆర్డర్లు ఇస్తున్నారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల్లో ఉండే సిద్దిపేట వాసులు కేజీల చొప్పున పచ్చళ్లు, స్నాక్స్‌ ఆర్డర్లు ఇస్తున్నారు. రుచి అమోఘంగా ఉండడంతో వారి బంధువులతో కూడా ఆర్డర్లు చేయిస్తున్నారు. ఇలాంటి డిమాండ్‌ భవిష్యత్‌లో కూడా ఉంటే.. ఆన్‌లైన్‌లో అమ్మే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మహిళలు. ఈ ఏడాదిలో తమ వ్యాపారం మరింత పుంజుకోవాలని ఈ బృందం మహిళలంతా తీవ్రంగా కృషి చేస్తున్నారు. పచ్చడి పెట్టిన తర్వాత కనీసం 15 రోజుల వరకు నిల్వ ఉండాలి. ఈ పచ్చళ్లకు డిమాండ్‌ బాగా ఉండడంతో కొనుగోలుదారులు అంత సమయం లేకుండానే వెంటనే కొనుగోలు చేస్తున్నారు.
*మటన్‌ శుద్ధికి స్లాటర్‌ హౌస్‌
ఇర్కోడు మహిళా సమాఖ్య పచ్చళ్ల తయారీలో మటన్‌ శుద్ధికి ప్రత్యేకంగా ‘స్లాటర్‌ హౌజ్‌’ నిర్మాణం జరుగుతున్నది. మరో ఆరు నెలలలో ఇది ఇర్కోడ్‌ మహిళా సంఘాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా దాదాపు 100 మంది మహిళలకు శాశ్వత ఉపాధి చూపించాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్లాటర్‌ హౌజ్‌ ప్రత్యేకించి మటన్‌, చికెన్‌లను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక పశు వైద్యుడు కూడా ఉంటారు. ఆ వైద్యుడు గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్లను పరీక్షిస్తాడు. దీనివల్ల జబ్బు పడే జీవాలు కాకుండా.. కేవలం ఆరోగ్యంగా ఉన్నవాటిని మాత్రమే పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. ముస్లిం వ్యక్తులు ‘హలాల్‌’ చేసిన తర్వాతే.. పొట్టేళ్లు, మేకపోతులు కోళ్లను క్లాటర్‌ హౌజ్‌కు తరలిస్తారు. దీనివల్ల అనారోగ్య వాతావరణం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.