DailyDose

పాస్‌పోర్టులపై TNI కథనాలు

TNI Special Stories On Passports And Types

1.పాస్ పోర్టు ర్యాంకులు.. భారత్ స్థానమెంత?
ప్రపంచ పాస్ పోర్టు ర్యాంకుల్లో భారత్ 84వ స్థానంలో నిలిచింది. ‘ప్రపంచ అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టులు ’ పేరిట హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ 2020 సంవత్సరానికి ఈ ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది. ముందస్తు వీసా లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని ఈ స్కోరు సూచిస్తుంది. గతేడాది పోలిస్తే భారత్ 2 స్థానాలు దిగజారడం గమనార్హం.ఇక ఈ జాబితాలో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్పోర్టుతో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించొచ్చు. అమెరికా, యూకే ఈ జాబితాలో ఎనిమిదో ర్యాంకులో నిలిచాయి. అఫ్గానిస్థాన్ పాస్పోర్టు చిట్టచివరి స్థానంలోనూ.. పాకిస్థాన్ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో సింగపూర్ (190 దేశాల్లో పర్యటించే వీలు).. జర్మనీ, దక్షిణ కొరియా (189), ఫిన్లాండ్, ఇటలీ (188), డెన్మార్క్, లగ్జెంబర్గ్, స్పెయిన్ (187) టాప్-5లో నిలిచాయి.
2.ఒకే రోజులో ‘తత్కాల్‌’ పాస్‌ పోర్టులు
దుబాయ్, నార్తర్న్‌ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. తత్కాల్‌ పాస్‌పోర్టు ఇక ఒక్క రోజులోనే లభించనుంది. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ నిర్వాసితులకు అదే రోజున తత్కాల్‌ కేటగిరీలో పాస్‌పోర్ట్‌ మంజూరు చేస్తామని దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటలలోపు పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదే రోజున తత్కాల్‌ పాస్‌పోర్టు అందిస్తామని కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ తెలిపారు. దుబాయ్‌లోని అల్‌ ఖలీజ్‌ సెంటర్‌లో ఉన్న బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే 24 గంటల్లో తత్కాల్‌ పాస్‌పోర్టులను అందించే సర్వీసు ఉందన్నారు.
3.యూఏఈకి ఐదేళ్ల టూరిస్ట్‌ వీసా
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో పర్యాటకులను ఆకర్షించడానికి అక్కడి ప్రభుత్వం ఐదేళ్ల మల్టీ ఎంట్రీ వీసాల జారీకి శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరం ఆరంభంలో తొలిసారి సమావేశం నిర్వహించిన దుబాయి రూలర్, ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ ఐదేళ్ల టూరిస్ట్‌ వీసా జారీపై ప్రకటన చేశారు. యూఏఈ పరిధిలోని దుబాయి, షార్జా, అబుదాబి తదితర పట్టణాల్లో పర్యటించడానికి 30 రోజులు లేదా 90 రోజుల కాల పరిమితితో కూడిన టూరిస్ట్‌ వీసాలను జారీచేసేవారు. ఈ వీసాలను విజిట్‌ వీసాలు అని కూడా అనేవారు. విజిట్‌ వీసాలపై యూఏఈ వెళ్లిన ఎంతో మంది అక్కడ కల్లివెల్లి కావడం లేదా కంపెనీ వీసాలను తీసుకుని అక్కడే స్థిరపడిపోవడం జరిగేది.అయితే, గతంలో కంటే విజిట్‌ వీసా లేదా టూరిస్ట్‌ వీసాలపై కఠిన తరమైన నిబంధనలను విధించిన యూఏఈ ప్రభుత్వం తాజాగా ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టూరిస్ట్‌ వీసాలను జారీచేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ వీసాలను పొందిన వారు ఐదేళ్ల కాల పరిమితిలో యూఏఈకి చేరిన తరువాత ఆరు నెలల కాలంఉండటానికి అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు తమ సొంత దేశంలో లేదా ఇతర దేశాల్లో నివాసం ఉండాలి. కాగా, యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదేళ్ల టూరిస్ట్‌ మల్టీ వీసాలతో ఎవరికి ప్రయోజనం కలుగుతుంది.. మరెవరికి ఇబ్బంది ఎదురవుతుందనే విషయంపై యూఏఈ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తరువాతనే వెల్లడి కానుంది.
4.ప్రపంచంలో నెంబర్‌ వన్‌ జపాన్‌ పాస్‌పోర్ట్‌
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మరోసారి జపాన్‌ పాస్‌పోర్టు ఎంపికయింది. ‘హెన్లే పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌’లో ఇలా జపాన్‌ పాస్‌పోర్ట్‌ ఎంపికవడం ఇది వరుసగా మూడోసారి. ఇందుకు కారణం ఈ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా ప్రపంచంలో 191 దేశాలు తిరిగి రావచ్చు. ఆ తర్వాత సింగపూర్‌ పాస్‌పోర్ట్‌ రెండో స్థానంలో, ఆ తర్వాత దక్షిణ కొరియా, జర్మనీ దేశాల పాస్‌పోర్టులు మూడో స్థానంలో ఎంపికయ్యాయి. సింగపూర్‌ పాస్‌పోర్టు ద్వారా ప్రపంచంలో వీసీ లేకుండా 190 దేశాలు, దక్షిణ కొరియా, జర్మనీ పాస్‌పోర్టుల ద్వారా 189 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్‌ దేశాలు స్థానాలు క్రమంగా ఇండెక్స్‌లో పడిపోతూ వస్తున్నాయి. ఈ రెండు దేశాలతోపాటు బెల్జియం, గ్రీస్, నార్వే దేశాల పాస్‌పోర్టులు ఎనిమిదవ స్థానంలో ఎంపికయ్యాయి. ఈ ఐదు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 184 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్‌ దేశాలు 2015లో మొదటి స్థానంలో ఉండగా, గతేడాది ఆరవ స్థానంలోకి పడిపోయాయి. వీసా అవసరం లేకుండా 188 దేశాలను తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫిన్‌లాండ్, ఇటలీ దేశాల పాస్‌పోర్ట్‌లు నాలుగో స్థానంలో, 187 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న డెన్మార్క్, లగ్జెమ్‌బర్గ్, స్పెయిన్‌ ఐదో స్థానంలో, 186 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫ్రాన్స్, స్వీడన్‌ ఆరవ స్థానంలో, ఆస్ట్రియా, ఐర్లాండ్, నెదర్లాండ్, పోర్చుగల్, స్విడ్జర్లాండ్‌ పాస్‌పోర్టులు ఏడో స్థానంలో ఎంపికయ్యాయి. ఆస్ట్రేలియా, కెనడా, చెక్‌ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్‌ తొమ్మిదవ స్థానంలో, హంగరి, లిథ్వానియా, స్లొవాకియా పాస్‌పోర్ట్‌లు పదవ స్థానంలో ఎంపికయ్యాయి. వీసా అవసరం లేకుండా 58 దేశాలు మాత్రమే తిరిగొచ్చే అవకాశం ఉన్న భారత పాస్‌పోర్ట్‌ 84వ స్థానంలో ఎంపికయింది. ఇది 2019లో 86వ స్థానంలో ఎంపికకాగా ఈ ఏడాది రెండు స్థానాలు మెరుగుపడింది.
5.అమెరికాలోని భారతీయ యువతకు కొత్త చిక్కులు
అమెరికాలో వీసా నిబంధనలు భారతీయులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. 21ఏళ్లు పైబడిన వయసున్న తమ పిల్లల హక్కుల కోసం అక్కడి భారతీయులు కోర్టును ఆశ్రయించారు. అమెరికాలోని వీసా నిబంధనల ప్రకారం.. హెచ్1 బీ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు అక్కడి ప్రభుత్వం హెచ్ 4 వీసాను జారీ చేస్తుంది. 21 ఏళ్లు దాటిన తర్వాత కూడా చదువుకుంటున్న పిల్లలు ఎఫ్ 1 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చిక్కంతా ఇక్కడే ఉంది. హెచ్1 బీ వీసాలపై పని చేస్తున్న చాలా మంది భారతీయుల పిల్లలకు 21 ఏళ్లు దాటాయి. ఇప్పుడు వారి చదువు వివిధ దశల్లో ఉంది. ఇప్పుడు వారంతా హెచ్ 4 వీసా కిందకురారు. వీళ్లంతా ఎఫ్ 1 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎఫ్ 1 వీసా కోటాలో భాగంగా భారతీయులకు అక్కడి ప్రభుత్వం తక్కువ వీసాలను జారీ చేస్తుంది. దీంతో ఎంతో మంది భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 21 ఏళ్లుపైబడిన వయస్సున్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల హక్కుల కోసం పోరాడుతూ కోర్టును ఆశ్రయించారు.
6.దుబాయిలోని భారతీయులకు శుభవార్త
దుబాయ్ సహా నార్తర్న్ ఎమిరేట్స్ ప్రాంతాల్లో ఉంటున్న భారతీయ వలసదారుల విషయంలో దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ నుంచి తిరిగి రావాలనుకుని.. పాస్పోర్ట్ గడువు ముగిసిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి తాత్కాల్ పద్దతిలో ఒకే రోజులో పాస్పోర్ట్ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అయితే తాత్కాల్ పద్దతిలో పాస్పోర్ట్ను పొందాలంటే సాధారణ రుసుము కంటే అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే వారు సాధారణ పని దినాల్లో మధ్యాహ్నంలోపు బర్ దుబాయ్లోని అల్ ఖలీజ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ కార్యలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి సాయంత్రం 6.30లోపు పాస్పోర్ట్ను అందిస్తామని తెలిపారు. దుబాయ్లో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ కార్యక్రమంలో ఇండియన్ కాన్సులేట్ అధికారి విపుల్ పాల్గొనిపై వ్యాఖ్యలు చేశారు.