DailyDose

నిర్భయ దోషులకు ఆ అర్హత లేదన్న జస్టిస్.ఎన్.వి.రమణ-తాజావార్తలు

Justice NV Ramana Denies Nirbhaya Culprits Decision

* మరణశిక్ష అమలును సవాల్‌ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్‌, ముఖేశ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఛాంబర్‌లో దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం పిటిషన్లను ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. పిటిషన్ల వాదనకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

* తెలంగాణలోని 120 పురపాలికలు, 9 నగర పాలక సంస్థల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. సాయంత్రం ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఈ నెల 22న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులకు అధికారికంగా బీ-ఫారాలు అందజేసే గడువు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది.

* ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఈ నెల 20న ఉదయం 9 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న మంత్రి మండలి సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక, రాష్ట్రంలో సమతుల అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లులపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

* పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. స్టాఫ్‌ వర్క్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఏమిటో చెప్పాలంటూ ఒడిశాకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. బచావత్‌ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్నిమార్చారని ఒడిశా వాదించింది. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది.

* జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాకినాడ చేరుకున్నారు. తొలుత నగరంలోని గుడారిగంటలో జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి ఆయన చేరుకున్నారు. ఆదివారం జరిగిన దాడి ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ నివాసంలో పవన్‌ పరామర్శించారు. ఘటన జరిగిన తీరును జనసేన కార్యకర్తలు తమ అధినేతకు వివరించారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ నగరంలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్‌యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు.

* ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. కోల్‌కతాలో సోమవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాంటి ఆందోళనలకైనా విపక్షాల ఐక్యత చాలా ముఖ్యం. సరైన ప్రయోజనం కోసం పోరాడుతున్నప్పుడు ఐక్యమత్యమే కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై లేనంత మాత్రాన ఆందోళనలు ఆగాల్సిన అవసరం లేదు’’ అని సేన్‌ అభిప్రాయపడ్డారు.

* జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయాల్సిందిగా దిల్లీ హైకోర్టు యూనివర్సిటీ నిర్వాహకులను ఆదేశించింది. అలాగే జేఎన్‌యూలో దాడికి సంబంధించిన సందేశాలు, వీడియోలను చట్టప్రకారం భద్రపరచాల్సిందిగా వాట్సాప్‌, గూగుల్‌ను ఆదేశించింది. ‘యూనిటీ ఎగనెస్ట్‌ లెఫ్ట్‌’, ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’ వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు సమన్లు పంపించి వారి ఫోన్లను స్వాధీనపరుచుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

* జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్‌ సెక్టార్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో జవాను గల్లంతయ్యాడు. గాయపడిన మరో జవాను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. మరోవైపు సోన్‌మార్గ్‌లో సోమవారం సంభవించిన హిమపాతంతో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

* కూరగాయలు, ఇతర నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో గత నెల టోకు ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. నవంబరులో 0.58శాతంగా ఉన్న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబరులో 2.59శాతానికి చేరింది. రిటైల్‌ ద్రవ్యోల్బణంలో గణనీయ పెరుగుదల, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటడంతో టోకు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో నవంబరులో 11శాతంగా ఉన్న ఆహార పదార్థాల ధరల పెరుగుదల రేటు 13.12శాతానికి చేరింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ.. ఊగిసలాటలోనే మార్కెట్లు కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్లు లాభపడి.. 41,952 వద్ద ముగించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 12,362 వద్ద ముగించింది. మరో రెండు రోజుల్లో అమెరికా చైనా మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందం ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు.

* అమరావతికి ఘన చరిత్ర ఉందని.. దాని చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేశారని.. పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని తెలిపారు. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరై మాట్లాడారు.

* పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొంత మందిపై కేసులు ఉన్నట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి గుర్తించింది. మొత్తం 300 మందికి నేర చరిత్ర ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించారు. వీరిలో దాదాపు 100 మంది అభ్యర్థులు తమపై ఉన్న కేసుల విషయాన్ని దాచి పెట్టారు. ఎంపికైన అభ్యర్థుల్లో పలువురిపై పోక్సో, హత్య కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం కానున్న తరుణంలో కేసులున్న వాళ్లకు సంబంధించి ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి విశాఖ చేరుకోనున్న ఆయన.. నేరుగా మధ్యాహ్నం 3గంటల సమయంలో రహదారి మార్గంలో కాకినాడకు వెళ్తారు. ఆదివారం వైకాపా కార్యకర్తలతో దాడిలో గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు.

* తెరాస బి-ఫారం ఇవ్వలేదని ఓ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. మేడ్చల్‌లో 14వ వార్డుకు విజయ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేశాడు. అయితే తనకు తెరాస బి-ఫారం ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. అయితే చివరికి వేరే అభ్యర్థికి బి-ఫారం ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఈ ఉదయం చేరుకొని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

* దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ పినరయి విజయన్‌ ప్రభుత్వం మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21, 25 నిబంధనలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని, అంతేగాక లౌకికవాదం ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించింది.

* నిర్భయ కేసులో మరణ శిక్ష అమలును సవాల్‌ చేస్తూ ఇద్దరు దోషులు వేసిన క్యురేటివ్‌ పిటిషన్‌పై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు. ‘ఉరితీత ప్రక్రియను ఆపేందుకు దోషులు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వారి అభ్యర్థనను న్యాయస్థానం తప్పకుండా కొట్టివేస్తుందనే నమ్మకం నాకుంది. ఈ నెల 22న దోషులను కచ్చితంగా ఉరితీస్తారు. నిర్భయకు న్యాయం జరుగుతుంది’ అని బాధితురాలి తల్లి విశ్వాసం ప్రకటించారు.

* దేశ రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లారెన్స్‌ రోడ్డులోని ఓ చెప్పుల తయారీ యూనిట్‌లో మంగళవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. 26 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

* ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం ఇదే స్థాయిలో పెరుగుతూ.. ప్రజల ఆదాయాలు పడిపోతే యువత, విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో పాటు సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భాజపా హామీ ఇచ్చిన ‘మంచి రోజులు’(అచ్ఛే దిన్‌) ఇవేనా అని ప్రశ్నించారు.

* అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై ఇరువైపుల నుంచి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పర్యటన తేదీలను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో ట్రంప్‌ భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొంది.

* బీసీసీఐ అధ్యక్షుడిగా కంటే క్రికెటర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. స్పోర్ట్స్‌స్టార్‌ ఏసెస్‌ అవార్డుల కార్యక్రమానికి దాదా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఉత్తమ టెస్టు జట్టు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కొత్త ఏడాదికి కూడా ఆల్‌ ది బెస్ట్. 2020లో మెగాటోర్నీలు ఉన్నాయి. అండర్‌ 19 ప్రపంచకప్‌, పరుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌ల్లో రాణిస్తారని ఆశిస్తున్నా’’ అని తెలిపాడు.