Politics

కాన్వాయి కాకినాడ వెళ్లలేకపోయింది

Kakinada Police Blocks Pawan's Convoy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించబోతున్నారు. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న పవన్ ఇవాళ కాకినాడ పర్యటనకు పయనమయ్యారు. పర్యటనలో భాగంగా వైసీపీ దాడుల్లో గాయపడిన కార్యకర్తలను జనసేనాని పరామర్శించనున్నారు. మరోవైపు.. పవన్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో 144 సెక్షన్‌ విధించారు. పవన్‌ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాకినాడకు బయల్దేరిన పవన్‌‌ను తుని దగ్గర కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. పవన్‌ పర్యటనను అడ్డుకోబోమని, అరెస్ట్‌ కూడా చేయమని ఎస్పీ నయీం హస్మీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో.. కాకినాడలో 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ను పోలీసులు అమలు చేశారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.