Politics

అమరావతి శక్తిపీఠం

Chandrababu Calls Amaravathi A Sakthi Peetham

రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తోంది ధర్మపోరాటమని.. అంతిమ విజయం వారిదేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ పోరాటం మరో కురుక్షేత్రమని చెప్పారు. దీనిలో పాండవులదే విజయమని చెప్పారు. తుళ్లూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. వైకాపా తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతిస్తున్నాయని చెప్పారు. ‘‘ఏపీ అంటే అమరావతి.. పోలవరం. రాష్ట్రానికి అవి రెండు కళ్లు. ఇప్పుడు ఆ రెండింటినీ పోగొడుతున్నారు. రైతులు పోరాటాన్ని ఆపొద్దు.. ధైర్యంగా కొనసాగించాలి. ఆంధ్రుల కలలు సాకారం కావాలంటే రాజధానిగా అమరావతే ఉండాలి. విశాఖ ప్రజలు రాజధాని కావాలని అడగలేదు. విశాఖ నగరానికి ఎన్నో పరిశ్రమలు తెచ్చా.. ఇప్పుడు అవన్నీ వెళ్లిపోయాయి. ఉత్తరాంధ్రకూ పరిశ్రమలు రావాలి.. అక్కడి యువతకీ ఉపాధి లభించాలి. కార్యాలయాలు పెడితే అభివృద్ధి జరగదు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి’’ అని అన్నారు.

మూడు రాజధానులు కాదు, 30 పెడతామని ఓ మంత్రి అన్నారని.. 13 జిల్లాల్లోనూ నెలకొక రాజధాని పెట్టుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అభివృద్ధిని ఆపేసి అరాచకానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ‘‘రాజు మారితే రాజధాని మారుతుందా? సీఆర్డీఏతో అమరావతి రైతులు ఒప్పందం చేసుకున్నారు. ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో రైతులకు అన్ని హక్కులు ఉన్నాయి. అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అమరావతి శక్తిపీఠం.. దీన్ని తరలించే శక్తి ఎవరికీ లేదు. అమరావతి 29 గ్రామాల సమస్య కాదు.. 5 కోట్ల ఆంధ్రులది. ఐదు కోట్ల మంది ప్రజలు కన్నెర్ర చేస్తే వైకాపా ఎమ్మెల్యేలు బయట తిరగలేరు. అగ్గితో చెలగాటమాడితే ఆహుతికాక తప్పదు. మూడు రాజధానుల గురించి ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? రాజధాని మార్పుపై మళ్లీ ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయం తీసుకోండి. ప్రజలు అమరావతిని కాదంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని చంద్రబాబు సవాల్‌ విసిరారు.

అమరావతి కోసం ఇప్పటి వరకు 18 మంది రైతులు చనిపోయారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంగా అమరావతిని అంగీకరించారు. తుళ్లూరుకు చారిత్రక పోరాట నేపథ్యం ఉంది. ప్రతి ఊరు తుళ్లూరు, మందడం కావాలి. ఈ క్రతువులో అందరి భాగస్వామ్యం అవసరం. ఎవరు మాట్లాడినా.. ఏం మాట్లాడినా అమరావతి నినాదం మార్మోగాలి. మన లక్ష్యం పవిత్రమైనది.. సాధించి తీరుదాం’’ అని ఆయన పిలుపునిచ్చారు.