Food

ఉప్పుతో భయంకరమైన మధుమేహం ముప్పు

Human Salt Intake Portions Must Be Regulated Properly

కూర చప్పగా ఉందనో, పెరుగు వేసుకున్నామనో ఉప్పు చల్లుకోవాలని చూస్తున్నారా? అయితే మీ చేతులారా మీరే మధుమేహాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతున్నట్టు తేలింది మరి. నిజానికి మధుమేహం అనగానే మనకు ముందుగా చక్కెరే గుర్తుకొస్తుంది. తీపి పదార్థాలు, తీపి పానీయాలు అతిగా తీసుకోవటం వల్ల బరువు పెరగటం.. దీంతో మధుమేహం ముప్పు ముంచుకురావటం తెలిసిందే. కానీ ఒక్క చక్కెరతోనే కాదు.. ఉప్పుతోనూ మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో స్పష్టంగా బయటపడింది.

ఉప్పు ద్వారా లభించే సోడియాన్ని తక్కువగా తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు 1.25 చెమ్చాలు (సుమారు 2,800 మిల్లీగ్రాములు), అంతకన్నా ఎక్కువగా తీసుకునేవారికి మధుమేహం వచ్చే అవకాశం 72% ఎక్కువగా ఉంటున్నట్టు తేలటం గమనార్హం. ఉప్పు మూలంగా ఇన్సులిన్‌ నిరోధకత (ఇన్సులిన్‌ హార్మోన్‌కు కణాలు అంతగా స్పందించకపోవటం) తలెత్తుతున్నట్టు, ఇది మధుమేహానికి దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉప్పు అధికంగా తినటం వల్ల రక్తపోటు, బరువు కూడా పెరుగుతాయి. ఇవీ మధుమేహానికి దారితీసేవే. అధిక రక్తపోటు మధుమేహం రెండూ జంట శత్రువులు. సాధారణంగా చాలామందిలో ఇవి రెండూ కలిసే కనబడుతుంటాయి. ఇక అధిక బరువు గలవారిలో రక్తంలో గ్లూకోజు స్థాయులు సరిగా నియంత్రణలో ఉండవు. ఇది మధుమేహం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది.

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం..

రోజుకు 1,500 మిల్లీగ్రాముల సోడియం మించకుండా చూసుకోవటం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2,300 మి.గ్రా.లకు మించరాదు. మనం కూరల్లో నేరుగా వేసుకునేదే కాదు.. పచ్చళ్లు, చిరుతిళ్ల వంటి వాటిల్లో ఉండే ఉప్పు కూడా దీనిలో భాగమేననీ గుర్తుంచుకోవాలి. భోజనం చేసేటప్పుడు అదనంగా ఉప్పు చల్లుకోకపోవటం, బయటి తిండికి బదులు ఇంట్లోనే వండుకొని తినటం, రుచి కోసం మిరియాల పొడి వంటివి చల్లుకోవటం ద్వారా ఉప్పును తగ్గించుకోవచ్చు. నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తే మన నాలుక మీది రుచి మొగ్గలు కూడా తక్కువ ఉప్పుకు అలవాటు పడతాయి. ఆహార పదార్థాల అసలు రుచినీ ఆస్వాదించొచ్చు. దీంతో మధుమేహాన్ని మాత్రమే కాదు.. వూబకాయం, అధిక రక్తపోటు ముప్పులనూ దూరం చేసుకోవచ్చు.