DailyDose

అత్యున్నత మున్సిపాలిటీగా సిరిసిల్ల-తాజావార్తలు

Telugu Breaking News Roundup-KTR Promises On Sircilla

* అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే వైకాపా ప్రభుత్వ విధానమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈ అంశంలో సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ఎమ్మెల్యేలంతా ఆమోదించారని ఆయన చెప్పారు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖ రాజధానిపై 21 మంది తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికల్లో తెదేపా గెలిస్తే చంద్రబాబు వాదన సరైందేనని ఒప్పుకుంటామన్నారు.

* కేరళలోని శబరిమలలో బుధవారం సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకరజ్యోతిని దర్శించుకున్న లక్షలాది భక్తులు తన్మయంతో పునీతులయ్యారు. తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తుల స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి.

* జమ్ము కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలను దశలవారిగా సవరిస్తూ వస్తున్న కేంద్రం తాజాగా బుధవారంనాడు పాక్షికంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను తెలుసుకొనేందుకు త్వరలో కేంద్ర మంత్రుల బృందం జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

* రష్యా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో రష్యా మంత్రిమండలి రాజీనామా చేసింది. ఈ మేరకు రష్యాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రష్యా ప్రధాని మెడ్వెడెవ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనలు దేశ అధికార సమతుల్యతలో పలు మార్పులను చేస్తాయని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రిమండలి రాజీనామా చేసింది అన్నారు.

* ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డే నుంచి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు విశ్రాంతి ఇచ్చారు. తల అదరడం (కంకషన్‌)తో బాధపడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఆయన టీమిండియాతో రాజ్‌కోట్‌ వెళ్లకుండా ముంబయిలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు. వాంఖడేలో జరిగిన తొలివన్డేలో 44వ ఓవర్లో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ వేసిన బంతి బ్యాటు తగిలి పంత్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. రెండో ఇన్నింగ్స్‌లో అతడు మైదానంలోకి రాలేదు.

* సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది. కోడికత్తి తగిలి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పండగ సందర్భంగా గ్రామానికి సమీపంలోని పామాయిల్‌ తోటల్లో కోడిపందేలు నిర్వహించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో ఓ కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది.

* యాసిడ్‌ అమ్మే వ్యక్తి.. కొనుగోలు చేసే వ్యక్తి గుర్తింపుకార్డు చూడాలి, చిరునామా తీసుకోవాలి.. ఆపై ఫలానా వ్యక్తి యాసిడ్‌ కొన్నాడనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. కానీ ఇవేవీ జరగడం లేదంటున్నారు కథానాయిక దీపికా పదుకొణె. యాసిడ్‌ దాడుల్ని అరికట్టేందుకు ఆమె తాజాగా మరో సరికొత్త ప్రయోగం చేశారు. దుకాణ యజమానులు విచ్చలవిడిగా యాసిడ్‌ అమ్ముతున్నారని, దీనికి ఓ పద్ధతి-ప్రక్రియ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో యాసిడ్‌ కొనడం చాలా సులభమని, తన బృందం ద్వారా 24 యాసిడ్‌ సీసాలను కొన్నట్లు తెలిపారు.

* దేశంలో అత్యున్నత మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణానికి సంబంధించి మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. సిరిసిల్లలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని పనులు కూడా చేశామని చెప్పారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉందని చెప్పారు.

* నదుల అనుసంధానం పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కొట్టేసేందుకు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ భేటీలో చర్చకు వచ్చిన అంశాల విషయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగం మాట్లాడారు.

* దేశ రాజధాని దిల్లీలోని పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఇకపై పూర్తి స్థాయిలో శాకాహారం మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ ఇప్పటివరకు పార్లమెంట్‌ క్యాంటీన్‌ క్యాటరింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది. గత కొద్ది నెలలుగా ఆహార పదార్థాల్లో నాణ్యతాలోపాల దృష్ట్యా ఐఆర్‌సీటీసీని తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని స్థానంలో ప్రముఖ ప్రైవేటు బ్రాండ్స్‌ అయిన హల్దీరామ్స్‌, బికనేర్‌వాలాకు క్యాటరింగ్‌ బాధ్యతలు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

* రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తోంది ధర్మపోరాటమని.. అంతిమ విజయం వారిదేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ పోరాటం మరో కురుక్షేత్రమని చెప్పారు. దీనిలో పాండవులదే విజయమని చెప్పారు. తుళ్లూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. వైకాపా తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతిస్తున్నాయని చెప్పారు. ‘‘ఏపీ అంటే అమరావతి.. పోలవరం. రాష్ట్రానికి అవి రెండు కళ్లు. ఇప్పుడు ఆ రెండింటినీ పోగొడుతున్నారు. రైతులు పోరాటాన్ని ఆపొద్దు.. ధైర్యంగా కొనసాగించాలి. ఆంధ్రుల కలలు సాకారం కావాలంటే రాజధానిగా అమరావతే ఉండాలి’’ అని అన్నారు.

* నిర్భయ కేసులో దోషులకు మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన డెత్‌ వారెంట్‌లో పేర్కొన్నట్లుగా.. జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. క్షమాభిక్ష కోరుతూ ముకేష్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అభ్యర్థన సమర్పించాడు. అలాగే రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ సంగీత ధింగ్రా సెహగల్‌కు దిల్లీ ప్రభుత్వం వివరించింది.

* పండగపూట విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని రావులపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

* అమరావతి ప్రాంతంలో జరుగుతున్న రైతు దీక్షలు 29వ రోజూ కొనసాగుతున్నాయి. మందడంలో రైతుల ఉపవాస దీక్షలకు తెదేపా అధినేత చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘‘ఇది బ్రిటిష్ పరిపాలన కాదు.. రాక్షసుల రాజ్యం. ఈ రాజ్యంలో అందరికీ కష్టాలే. 29 రోజులుగా రైతులు, మహిళలు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. మూర్ఖత్వం ముందు పుట్టి తరువాత జగన్ పుట్టాడు. సీఎం ఫ్యాక్షన్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. అమరావతి రాజధాని కాకపోతే రాష్ట్రం విడిపోయి గ్రేటర్ రాయలసీమ పెట్టాల్సిందే’’ అని జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

* జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్ధు చరిత్రాత్మక నిర్ణయం అని ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. ఇది జమ్ముకశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. దిల్లీలో జరిగిన 72వ ఆర్మీ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నరవణే మాట్లాడుతూ ‘‘ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయం. దీని ద్వారా మనతో పరోక్ష యుద్ధం చేస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌ భంగపాటుకు గురైంది. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు జమ్ముకశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఎంతో సహాయపడుతుంది.’’ అని అన్నారు.

* ఐసీసీ పురస్కారాల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దుమ్మురేపారు. 2019కి గాను ఐసీసీ బుధవారం పురస్కారాలను ప్రకటించింది. ఆ ఏడాదిలో ఆరు శతకాలు బాదిన హిట్‌మ్యాన్‌ను ‘ఈ ఏడాది పురుషుల వన్డే క్రికెటర్‌’గా ఎంపిక చేసింది. ప్రపంచకప్‌లో అతడు 5 శతకాలు బాది సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

* వ్యాపార పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన అమెజాన్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు(సీఈఓ) జెఫ్‌ బెజోస్‌ భారతీయుల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు. వరుస సమావేశాలు, పెట్టుబడులు, ఒప్పందాలపైనే దృష్టి పెట్టే పారిశ్రామికవేత్తలకు భిన్నంగా వ్యవహరించారు. మంగళవారం భారత్‌లో దిగగానే.. దిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. పైగా భారత సంప్రదాయ దుస్తులు ధరించి.. రెండు చేతులు జోడించి బాపూజీకి నమస్కారం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

* మెగా కుటుంబ సభ్యులు సంక్రాంతి పండగను అత్యంత వేడుకగా జరుపుకొంటున్నారు. బుధవారం రామ్‌ చరణ్‌ మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో చిరంజీవి, చెర్రీ, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, కల్యాణ్‌ దేవ్‌, అకీరా కనిపించారు.

* ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలంటూ బిర్రు ప్రతాప్‌రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పిటిషన్లలో పేర్కొన్నారు.

* అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మందడంలో రైతుల చేపట్టిన దీక్షకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దీక్షా శిబిరానికి విచ్చేసి కూర్చొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంలేదు. ఎందుకంటే ఈ ఏడాది కష్టాల సంక్రాంతి. అమరావతి 29 గ్రామాల సమస్య కాదు. రైతులు, రైతు కూలీలు త్యాగాలు చేశారు. భూములు ఇచ్చారు’’ అని చంద్రబాబు అన్నారు.

* మకర సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మధురై జిల్లా అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలను తిలకించడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిని అదుపుచేయడానికి 730 మంది ఔత్సాహికులు నమోదు చేసుకున్నారు. అవనియాపురంలో ఉదయం 8గంటలకే పోటీలు ప్రారంభమయ్యాయి.

* అమరావతి ప్రాంతంలో జరుగుతున్న రైతు దీక్షలు 29వ రోజూ కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులంతా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలో తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు దురదృష్టకరమైన రోజు. కేవలం తుళ్లూరు, మందడం ప్రజలే కాదు.. అందరమూ దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నాం. రాజధాని అంటే ఆయన ఒక్కరి అభిప్రాయం మాత్రమేకాదు. అందరి అభిప్రాయాలతోనే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు’’ అని జేసీ అన్నారు.

* జమ్మూకశ్మీర్​లో ఇంటర్నెట్​ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. జమ్మూలోని ఆస్పత్రులు, హోటళ్లు, రవాణా సంస్థలతో పాటు మరికొన్ని ఇతర ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్​, 2జీ ఇంటర్నెట్​ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జమ్మూ, సాంబా, కతువా, ఉదంపుర్​, రియాసి జిల్లాల్లో అధికారిక వెబ్‌సైట్లను​ అనుమతిస్తూ 2జీ పోస్ట్​పెయిడ్​ సేవలను ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ ​సేవల నిలిపివేతపై సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడి యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది.

* తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌ భవన్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన చిట్ చాట్‌లో ఆమె పాల్గొన్నారు. నెలలో ఒకరోజు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తానని తమిళి సై చెప్పారు. తమిళనాడులో ఉన్న అమ్మ కిట్ ఆదారంగా ఇక్కడ కేసీఆర్ కిట్ అందజేస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ కిట్ అద్భుతమైన పథకమని కొనియాడారు.

* ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై మరోసారి దాడి జరిగింది. అమెరికా సంకీర్ణ దళాలున్న తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు ​పేలినట్లు ఇరాక్ ​మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దాదాపు రెండు రాకెట్లు స్థావరం వైపు దూసుకొచ్చినట్లు చూశామని స్థానికులు తెలిపారు. తాజా దాడికి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహింలేదు.

* మధ్య ఓవర్లలో స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకోవడం టీమిండియా ఓటమికి కారణమని ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. తొలి 10-15 ఓవర్లలో తాము చక్కగా ఆడామని వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో వాఖండే వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఛేదనలో డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ అజేయ శతకాలతో చెలరేగిన సంగతి తెలిసిందే.

* అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో రైతులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున రాజధాని గ్రామాల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన అంబటి శివయ్య (70) అనే రైతు గుండె పోటుతో మరణించారు. రాజధాని తరలిపోతుందన్న మనోవేదనతోనే శివయ్య చనిపోయినట్టు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.