Editorials

సులేమాని సావు మన కొంప ముంచుతోంది

Telugu International Affairs Editorials-Suleimani Death Pressuring Indian Economy

భారత్‌ జీడీపీ వృద్ధిరేటు ఇప్పటికే 5శాతం కంటే తక్కువకు చేరింది.. దీనికి తోడు ఇప్పటికే ఉల్లిపాయల ధరలు పెరిగి ప్రభుత్వానికి, ప్రజలకు కన్నీరు పెట్టించాయి. మరోపక్క దాదాపు ఆరునెలల నుంచి క్రమంగా పెరుగుతున్న చమురు ధరలు కూడా తోడవుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. వసూళ్లు క్రమంగా తగ్గిపోయాయి. గత నెల కొంత మెరుగ్గా ఉన్నా.. అంతకుముందు నెలల్లో భారీగానే తగ్గుముఖం పట్టింది. ద్రవ్యలోటును కట్టడి చేయడానికి ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం కూడా అనుకున్నంత ముందుకు సాగలేదు. దీంతో ఎయిర్‌ఇండియా మరింతగా అప్పుల సుడిలో చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ద్రవ్యలోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది. బాగ్దాద్‌ విమానాశ్రయంలో ఇరాన్‌ ఖుద్స్‌ఫోర్స్‌ జనరల్‌ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్‌లు దాడి చేయడంతో మధ్యప్రాచ్యం భగ్గుమంది. ఈ దాడిలో సులేమానీతోపాటు మరికొందరు మృతి చెందారు. దీంతో అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీనికి తోడు సులేమానీ మరణానికి ఇరాక్‌ వేదిక కావడంతో ఇప్పుడు ఈ వివాదంలో ఆ దేశం కూడా భాగస్వామిగా మారిపోయింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఇరాక్‌ పరిస్థితి మారిపోయింది. దీంతో ఇప్పుడు ఆ దేశం తప్పనిసరి పరిస్థితుల్లో ఇరాన్‌ పక్షానికి మొగ్గినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు భారత్‌ కోణంలో చూస్తే ఏమాత్రం ఆహ్వానించదగినవి కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. మనకంటే ముందు స్థానాల్లో చైనా, అమెరికా ఉన్నాయి. వీటికి చమురు సరఫరా చేసే మార్గాలు చాలా ఉన్నాయి. అమెరికాలో ‘షెల్‌’ విప్లవం తర్వాత ఇతర దేశాలపై చమురు కోసం ఆధారపడటం గణనీయంగా తగ్గింది. అయినా కానీ దిగుమతులు కొంత కొనసాగుతున్నాయి. ఇక చైనా పరిస్థితి మరికొంత భిన్నంగా ఉంది. ఆ దేశం చమురు అవసరాల కోసం గల్ఫ్‌ దేశాల మీద ఆధారపడినా.. మరోపక్క రష్యా నుంచి కూడా ఇంధనం దిగుమతి చేసుకొంటోంది. రష్యాలోని చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఆ దేశానికి రష్యాతో సరిహద్దులు ఉండటం కలిసొచ్చింది. కానీ భారత్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. దేశీయ అవసరాల్లో 80శాతం చమురును, 40శాతం సహజవాయువును దిగుమతి చేసుకొంటున్నాము. భారత్‌ చుట్టుపక్కల ఎక్కడా చమురు సరఫరా చేసే దేశాలే లేవు.. సమీపంలో ఉన్న ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఇరాక్‌, సౌదీ అరేబియాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. వీటిల్లో ఇరాక్‌లో కూడా ఇప్పుడు సంక్షోభ పరిస్థితి నెలకొంది. ఇక సౌదీ చమురు సరఫరా చేయాలంటే హర్మూజ్‌ జలసంధి ఒక్కటే ఏకైక మార్గం అది దాటాలంటే ఇరాన్‌ను దాటాల్సిందే. దీంతో చమురు రేట్లకు రెక్కలు వచ్చాయి. ప్రపంచ చమురులో మూడోవంతు కేవలం మూడు కిలోమీటర్ల వెడల్పైన హర్మూజ్‌ జలసంధిని దాటి రావాల్సిందే. ఒమన్‌-ఇరాన్‌ను వేరు చేస్తూ 33 కిలోమీటర్ల వెడల్పుతో జలమార్గం ఉంది. ఇందులో కూడా చమురు ట్యాంకర్లు ప్రయాణించడానికి కేవలం 3కిలోమీటర్ల వెడల్పు ఉన్న కొంత ప్రాంతం మాత్రమే అనుకూలం. 2011 లెక్కల ప్రకారం రోజుకు సగటున 14 చమురు ట్యాంకర్లు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2016లో ప్రపంచంలో 30శాతం చమురు ఇక్కడి నుంచే వెళ్లింది. చమురును ఉత్పత్తి చేసే ఒపెక్‌ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌లు దీనికి సమీపంలోనే ఉన్నాయి. వీటి ఉత్పత్తులు ఆసియా, యూరప్‌, ఉత్తర అమెరికాలకు వెళ్లాలంటే హర్మూజ్‌ జలసంధే శరణ్యం. ప్రపంచంలోనే అత్యధిక ఎల్‌ఎన్‌జీని ఉత్పత్తి చేసే ఖతర్‌కు ఈ మార్గమే కీలకం.

‘హర్మూజ్‌ జలసంధిని అయితే అందరూ కలిసి వాడుకోవాలి… లేదంటే ఎవరూ వాడుకోకూడదు’- ఇదీ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్పస్‌ (ఐఆర్‌జీసీ) సాయుధ దళాధిపతి మహమ్మద్‌ అల్‌ జాఫ్రీ ఆ దేశ యువ పాత్రికేయులకు డిసెంబరులో చెప్పిన మాట. హర్మూజ్‌ను మూసివేయడమంటే ఓ రకంగా ఆసియా, పసిఫిక్‌ దేశాలకు ఊపిరాడకుండా చేయడమే. ఇరాన్‌పై రివల్యూషనరీ గార్డ్స్‌కు ఉన్న పట్టు అలాంటిది. ఈ దళానికి ఇరాన్‌ సైన్యం కంటే ఎక్కువగా అధికారాలు దఖలు పడ్డాయి. ఐఆర్‌జీసీకి పదాతి, నావికా, వైమానిక దళ విభాగాలు ఉన్నాయి. బలమైన గూఢచార యంత్రాంగం ఉంది. ఐఆర్‌జీసీ నావికాదళ విభాగమే ఇప్పుడు హర్మూజ్‌ జలసంధి రక్షణ బాధ్యతలను చూస్తోంది. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం తరవాత అధికారం చేజిక్కించుకున్న ఖోమైనీకి వ్యతిరేకంగా మరో తిరుగుబాటు జరగకుండా ఉండేందుకు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్పస్‌ను ఏర్పాటు చేశారు. ఇది సైన్యంలో భాగం కాదు, దానికి సమాంతరంగా ఖోమైనీకి నమ్మకంగా పనిచేసే ప్రభుత్వ సాయుధ బలగం. 2004 నుంచి ఇది దేశభద్రత పేరుతో పలు ప్రభుత్వ రంగ సంస్థలను వశం చేసుకోవడం మొదలుపెట్టింది. 2005లో అహ్మదీ నెజాదీ అధికారం చేపట్టాక అధికారికంగా దేశంలోని బలమైన ఆర్థిక సంస్థల్లో ఐఆర్‌జీసీకి వాటాలు అప్పగించారు. దేశ టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో 51శాతం వాటా వీరి చేతుల్లోనే ఉంది. చమురు, షిప్పింగ్‌, బ్యాంకింగ్‌, గనులు, బీమా వంటి 14 కీలక రంగాలన్నీ ప్రైవేట్‌, ట్రస్ట్‌లు, కార్పొరేట్‌ సంస్థల ముసుగులో ఐఆర్‌జీసీ చేతిలోనే ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌ను కదిలించడం అంటే కందిరీగ తుట్టెపై రాళ్లు వేయడమే. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడేవారికి ఐఆర్‌జీసీ మద్దతు ఇస్తోంది. దీనికోసం ఖుద్స్‌ఫోర్స్‌ పేరిట ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ విభాగ అధిపతి ఖాసీం సులేమానీనే అమెరికా డ్రోన్లతో దాడి చేసి చంపింది. అప్పటికీ ఇప్పటికీ ఇరాన్‌ సాయుధ సంపత్తిలో మార్పులు వచ్చాయి. ఐఆర్‌జీసీ, ఇరాన్‌ సైన్యం నావికా విభాగాలు వ్యూహాత్మకంగా రెండు వేల చిన్న బోట్లను హర్మూజ్‌లో వినియోగిస్తున్నాయి. దీంతోపాటు, మూడు ఎస్‌300 బ్యాటరీలు, దాదాపు 24కు పైగా భూతలం నుంచి ప్రయోగించి నౌకలను ధ్వంసం చేసే క్షిపణి బ్యాటరీలను హర్మూజ్‌ పరిసరాల్లో మోహరించింది. అత్యంత శక్తిమంతమైన మూడు ‘కీలో’ శ్రేణి జలాంతర్గాములు సైతం ఉన్నాయి. వీటిని కీలకమైన బందర్‌ అబ్బాస్‌, బందర్‌ లెగే, ఖషీమ్‌ ద్వీపంలో మోహరించారు. అమెరికా వైపు నుంచి బహ్రెయిన్‌ కేంద్రంగా ఉన్న అయిదో ఫ్లీట్‌ హర్మూజ్‌ బాధ్యతలను చూస్తోంది. ఆ చుట్టుపక్కల దేశాల్లోని ఆరు నావికా స్థావరాల్లో ఆయుధాలను మోహరించింది. భారత్‌ వంటి దేశాల నుంచి గల్ఫ్‌ దేశాలకు నిత్యావసరాలూ ఈ మార్గంలో వెళ్లాల్సిందే. ముఖ్యంగా మన బాస్మతీ వంటి ఎగుమతులకు ఇక్కడి ఉద్రిక్త వాతావరణం ఇబ్బందికరంగా మారుతుంది. హర్మూజ్‌ జలసంధికి సరైన ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి. సౌదీ అరేబియా, యూఏఈలు కూడా దీనికి ప్రత్యామ్నాయాలు వెతికేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరిన్ని పైప్‌లైన్లను నిర్మించడం ద్వారా చమురు సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ, ఇది ఒక్కరోజులో పూర్తయ్యేదికాదు.