DailyDose

₹1.37లక్షలు సంపాదించిన నిర్భయ నిందితులు-తాజావార్తలు

Nirbhaya culprits earned 1.3lakh rupees-Telugu Breaking news

* నిర్భయ దోషులకు ప్రాణభయం పట్టుకుంది. ఈ భయంతోనే నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తన సెల్‌లో విరామం లేకుండా నడుస్తున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అయితే జైల్లో ఉంటున్న దోషులకు రోజువారీ పనులు కేటాయిస్తారు. అవి చేసినందుకు గాను వాళ్లకు వేతనాన్ని చెల్లిస్తారు. అలా ముకేశ్‌ మినహా ముగ్గురు దోషులు చేసిన పనికి గాను వాళ్లు రూ.1.37లక్షలు సంపాదించారు. అక్షయ్‌ జైల్లో పని చేసి రూ.69వేలు సంపాదించగా, పవన్‌ రూ.29వేలు, వినయ్‌ రూ.39వేలు సంపాదించారు.

* రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై భాజపా పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలో భాజపా నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

* దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్‌ చేసేందుకుగానూ భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. బుధవారం దిల్లీలో నిర్వహించిన అమెజాన్‌ ‘సంభవ్‌’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెజోస్‌ మాట్లాడుతూ.. 2025 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువైన ‘మేకిన్‌ ఇండియా’ ఉత్పత్తులను అమెజాన్‌ ఎగుమతి చేసేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నామని వెల్లడించారు.

* నిర్భయ దోషుల ఉరి తేదీని మార్చాల్సిందిగా తీహాడ్‌ జైలు అధికారులు దిల్లీ కోర్టును కోరారు. దోషుల్లో ఒకడైన ముకేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద ఉన్నందున జైలు నిబంధనల ప్రకారం మరణశిక్ష తేదీని మార్చాల్సిందిగా జైలు అధికారులు కోరారు. ఉరి ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే దానికి సంబంధించిన తాజా నివేదికను రేపటి లోగా కోర్టును సమర్పించాలని న్యాయస్థానం తీహాడ్‌ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

* దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడానికి పెద్దమనసుతో ముందుకొచ్చినందుకు పవన్‌ను ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడలో రెండు పార్టీల కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో అవినీతి రహిత అభివృద్ధే లక్ష్యంగా తమ రెండు పార్టీలు కలిశాయని కన్నా చెప్పారు.

* బీసీసీఐ గురువారం భారత జట్టు సీనియర్‌ ఆటగాళ్ల వార్షిక ఆదాయ ఒప్పందాల్ని ప్రకటించింది. ఈ జాబితాను నాలుగు భాగాలుగా విభజించారు. అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. గ్రేడ్‌ ఏ+ ఆటగాళ్లకు రూ.7 కోట్లు ఇవ్వనుండగా, గ్రేడ్‌ ఏ ఆటగాళ్లకి రూ.5 కోట్లు, గ్రేడ్‌ బి వారికి రూ.3 కోట్లు, గ్రేడ్‌ సి వారికి రూ.1 కోటి చొప్పున చెల్లించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ జాబితాలో ధోని పేరు లేకపోవడం గమనార్హం.

* ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ నియమితులయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. దీంతో పాటు గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. కార్యనిర్వాహక అధ్యక్షులుగా తులసిరెడ్డి, మస్తాన్ వలీకి బాధ్యతలు అప్పగించారు.

* రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం ఈ ఆరేళ్ల పాలనలో ఎంత మందికి అందజేసిందో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ మాదిరిగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి.. ఏమేరకు వాటిని నెరవేర్చారో మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

* భారత్‌-చైనా సరిహద్దులను పంచుకుంటుందనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తెలియదట. ఈ విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌కు చెందిన ఇద్దరు పాత్రికేయులు ఫిలిప్‌ రుకర్‌, కరోల్‌ లియోనిగ్‌ రాస్తున్న పుస్తకం ద్వారా బయటకు వచ్చింది. ‘ఏ వెరీ స్టేబుల్‌ జీనియస్‌’ పేరుతో పాత్రికేయులిద్దరూ ట్రంప్‌ గురించి పుస్తకాన్ని రాస్తూ మోదీతో జరిగిన సమావేశంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు అన్నట్లు రాసుకొచ్చారు. మోదీతో ట్రంప్‌ భేటీ అయిన సమయంలో చైనా భారత్‌తో సరిహద్దును పంచుకోవడం లేదు అని అన్నారు.

* ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడన్న ఆరోపణల కింద అరెస్టయిన డీఎస్పీ దవీందర్‌ సింగ్‌కు ఇచ్చిన పతకాన్ని వెనక్కి తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించింది. అతడికి 2018లో ఇచ్చిన కశ్మీర్‌ పోలీసు అత్యున్నత పురస్కారం ‘షేర్‌-ఇ-కశ్మీర్‌’ పతకాన్ని వెనక్కి తీసుకోవాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాదులకు సహకరిస్తూ..తాను నిర్వర్తిస్తున్న విధులకు దవీందర్‌ సింగ్‌ నమ్మక ద్రోహం చేసిన కారణంగా అవార్డును ఉపసంహరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బుధవారం నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంతోనే జోరందుకున్నాయి. ఉదయం 9.46 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ సూచీ 42వేల మార్క్‌ దాటి గరిష్ఠానికి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 59 పాయింట్ల లాభంతో 41,932 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభంతో 12,355 వద్ద ముగిసింది.

* రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇందుకు ఏర్పాట్లు చేశారు. హైపవర్‌ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపవచ్చని మంత్రులు సూచించారు. ఇప్పటి వరకూ 3100 మంది రైతులు తమ అభిప్రాయాలను తెలిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 17 వరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు.

* పండగ రోజున కూడా అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఏకైక డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 30వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతుల మహా ధర్నా, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు నిర్వహిస్తోన్న దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలించక పోవడం దుర్మార్గం అని రైతులు మండిపడ్డారు.

* కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డి 78వ జయంతి వేడుకలను నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్‌ రెడ్డి ఘాట్‌ వద్ద శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జైపాల్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

* ఇటీవల భాజపా అధినాయకత్వం నుంచి పిలుపుతో దిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో జనసేన, భాజపాకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ రకంగా కలిసి ముందుకెళ్లాలనే అంశంపై ఇరు పార్టీల నేతలు నిర్ణయించనున్నారు.

* ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అనుభవరాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ విమర్శించారు. అమరావతి అంశంలో గత ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు అసమర్థులని వారే ఒప్పుకుంటున్నారని చెప్పారు. ‘‘మీకు రాజధాని నిర్మించడం చేతకాకపోతే తప్పుకోండి… మేము కట్టి చూపిస్తాం’’అని కన్నా వ్యాఖ్యానించారు.

* కథానాయిక రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొడుగు జిల్లా విరాజ్‌పేటలోని ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి. రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై, హిట్ అందుకుంది.

* దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్టు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)తో తమ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందని వారు వివరించారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో తాము సమ్మె చేయనున్నామని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బీయు) ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో బ్యాంకులు ఈ విధంగా సమ్మె నిర్వహించటం ఇది రెండవసారి కానుంది.

* ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా 10 నెలల సమయం ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ మరో మూడేళ్ల తర్వాత జరగబోయే 2023 వన్డే ప్రపంచకప్‌పై అప్పుడే కన్నేశారు. ‘ఈ విషయంపై మేమిద్దరం మా జీవిత భాగస్వాములతో చర్చిస్తామని అనుకుంటున్నా. అప్పటికి మాకు 36, 37 ఏళ్లు ఉంటాయి. ఇప్పటికే నాకు ముగ్గురు పిల్లలున్నారు. అదే నా చివరి ప్రపంచకప్‌. ఈ మూడేళ్లలో ఫామ్‌ను కొనసాగిస్తూ, భార్యను, కుటుంబాన్ని చూసుకోవాలి’ అని వార్నర్‌ అన్నాడు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసన ప్రక్రియ అక్కడి పెద్దల సభ సెనేట్‌కు చేరింది.​ అభిశంసన విచారణను సెనేట్‌కు పంపే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జరిగిన ఓటింగ్‌లో 228 మంది సభ్యులకుగానూ 193 మంది ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటేశారు. వచ్చే వారం సెనేట్‌లో జరిగే అభిశంసన విచారణ కోసం స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రత్యేక న్యాయ మండలిని ఏర్పాటు చేశారు.