Sports

గతానికి బదులు చెప్తున్న దాదా?

Sourav Ganguly Recalling The Past When It Comes To Dhoni

90 టెస్టులు. 98 టీ20లు. 350 వన్డేలు. 200 వన్డేలకు సారథ్యం. అన్ని ఫార్మాట్లలో 17,000+ పరుగులు. కీపర్‌గా 634 క్యాచులు. 195 స్టంపౌట్లు. ఐసీసీ నిర్వహించే మూడు టోర్నీలు కైవసం చేసుకున్న ఒకే ఒక్క సారథి. అత్యుత్తమ క్రికెటర్‌ అని చెప్పేందుకు ఇంతకన్నా మెరుగైన గణాంకాలు ఇంకేం కావాలి? ఐతే ఎంత గొప్ప ఆటగాడైనా ఎక్కడో ఓ చోట ఆగిపోవాల్సిందే. ఎంఎస్‌ ధోనీకీ తప్పదిది. మరి బీసీసీఐ అతడికి కాంట్రాక్టు నిరాకరించడం ద్వారా ఏం చెబుతోంది? సుదీర్ఘ ఫార్మాట్‌కు 2014లోనే గుడ్‌బై చెప్పిన ధోనీ గతేడాది గ్రేడ్‌-ఏలో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌ ముందు వరకు అతడిపై ఎన్నో సందేహాలు. మునుపటిలా ఆడలేకపోవడం సమస్యగా మారింది. అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్‌గా పేరుతెచ్చుకున్న అతడే ఒత్తిడికి తట్టుకోలేక బంతులు తింటూ చేయాల్సిన రన్‌రేట్‌ పెంచుతూ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేవాడు. ఒకప్పటిలా హెలికాప్టర్‌ షాట్లు బాదలేకపోయాడు. బౌలర్లు అతడిని పరీక్షించడం మొదలుపెట్టారు. అపార అనుభవం, నాయకత్వ ప్రతిభ దృష్ట్యా సెలక్టర్లు అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అందులోనూ అతడు పెద్దగా రాణించిందేమీ లేదు. వికెట్ల వెనకాల అలెక్స్‌ కేరీ తర్వాతి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో జడేజా అలవోకగా సిక్సర్లు బాదుతోంటే బాగానే స్ట్రైక్‌ ఇచ్చాడు. కానీ చివరి వరకు బంతులు తింటూ ఒత్తిడిలోకి జారుకున్నాడు. ఆఖర్లో రనౌటై అత్యుత్తమ ముగింపు ఇవ్వలేకపోయాడు. నిరాశగా వెనుదిరిగాడు.

నిజానికి ప్రపంచకప్‌లోనే మహీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వచ్చాయి. అలా కాకపోవడం కొందరికి ఆశ్చర్యం మరికొందరికి సంతోషం కలిగించింది. భవిష్యత్తుపై సందేహాలు మాత్రం వీడలేదు. వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, సునిల్‌ గావస్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ వంటి మాజీ క్రికెటర్లు భవితవ్యంపై సెలక్టర్లు అతడితో మాట్లాడాలని బహిరంగంగా సూచించారు. ఇంతలోనే వెస్టిండీస్‌ సిరీస్‌ వచ్చేసింది. ధోనీయే నిరవధిక విరామం తీసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సర్లే.. తర్వాత సిరీస్‌లో మురిపిస్తాడనుకుంటే అసలు ఎంపికే అవ్వలేదు. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు సంధించడంతో ‘భారత క్రికెట్‌కు మహీ ఎంతో సేవ చేశాడు. అతనో గొప్ప ఆటగాడు. నిజానికి సెలక్షన్‌కు అతడే అందుబాటులో లేడు. విహారయాత్రకు వెళ్లాడు. అతడిని దాటి భారత క్రికెట్‌ను చూస్తున్నాం’ అని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే కుండబద్దలు కొట్టారు. ఇంతలోనే సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. ‘విజేతలు అంత త్వరగా నిష్ర్కమించరు. నా హయాంలో ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుంది. మహీ ఈ దేశానికెంతో సేవ చేశాడనండంలో సందేహం లేదు’ అని ఆయన చెప్పారు. ‘మహీతో వ్యక్తిగతంగా మాట్లాడాను. అతడి భవితవ్యంపై స్పష్టత ఉంది. కొన్ని విషయాలు బహిర్గతం చేయలేను. రవి, విరాట్‌, సెలక్టర్లు అతడితో మాట్లాడారు’ అని మరోసారి వెల్లడించారు. ఒకప్పుడు ధోనీ వీడ్కోలు ప్రకటిస్తే ఇంటి ముందు ధర్నా చేస్తానన్న సునిల్‌ గావస్కర్‌ ‘ఇంకా అతడెందుకు జట్టులో కొనసాగుతున్నాడో అర్థమవ్వడం లేదు. నా జట్టులోనైతే అతడికి చోటివ్వను’ అని షాకిచ్చారు. మరికొందరు మాజీలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఝార్ఖండ్‌ అండర్‌-23 జట్టు సభ్యులతో ధోనీ సాధన చేయడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ‘ఐపీఎల్‌ ఆడతాను. జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అనే ధోనీ చెప్పేసరికి ఊహాగానాలు తొలగిపోయాయి. ‘మహీ ఐపీఎల్‌ 2020 ఆడతాడు. అందులో ప్రదర్శనను బట్టే టీ20 ప్రపంచకప్‌ జట్టు పోటీలో ఉంటాడు. అనుభవం, ప్రదర్శన ఆధారంగానే ఎంపిక ఉంటుంది’ అని రవిశాస్త్రి చెప్పడంతో మరింత స్పష్టత వచ్చింది. ‘బహుశా ధోనీ వన్డేలకు వీడ్కోలు పలకొచ్చు’ అని ఆయనే చెప్పడంతో మళ్లీ సందిగ్ధం చోటు చేసుకుంది. వాస్తవంగా సచిన్‌కు తప్ప ధోనీ సారథ్యంలో దాదా, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, కుంబ్లే సహా చాలామందికి కోరుకున్న వీడ్కోలు దక్కలేదని అంటారు. ప్రపంచకప్‌లు అందించిన యువీని కావాలనే పక్కకు తప్పించాడని విమర్శలు వచ్చాయి. యాదృచ్ఛికంగా గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ మహీకి కాంట్రాక్టు నిరాకరించింది. ఇప్పుడిది దాదా దర్శకత్వంలో రూపొందిన ‘శుభం’ సీనా? దానికి ముందు నాటకీయ మలుపుతో కూడిన ప్రి క్లైమాక్సా?? ఐపీఎల్‌లో ధోనీ అదరగొట్టి దీనిని యాంటీ క్లైమాక్స్‌గా మారుస్తాడా???