Devotional

సప్తవ్యసనాలు అంటారు. అవి ఏమిటి?

The list of 7 sins according to puranas and vedas and holy books

మానసికంగా, శారీరకంగా ఆనందంగా జీవనయానం సాగించడమే సుఖమని భావన చేస్తాడు మనిషి. కష్టాలను, బాధలను భరించడం మాట అటుంచి వాటిని కించిత్తు ఊహించడానికైనా జంకుతాడు. ఆ కారణంగానే మంచి ముహూర్తాల్లో శుభకార్యాలు తలపెడతారు. సుభాషితాలు విని ఆ ప్రకారం నడుచుకునేవారికి, మంచి మార్గంలో ప్రయాణించేవారికి బతుకు నల్లేరు మీద బండి నడక కాకపోయినా, తెగిన గాలిపటంలా అధ్వానంగా మాత్రం ఉండదు. మనిషి  తనకో గురువును, రాజు మంత్రిని కోరుకునేది అందుకే. మనిషి సుఖంగా ఉండటానికి ఏం చేయాలో మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చక్కగా వివరించాడు. అవి ఎప్పటికీ మనిషి ఆచరించదగిన గొప్ప విషయాలు.
వీటితో అప్రమత్తం: ఒకదానితో రెండింటిని నిర్ణయించుకుని, మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకుని, అయిదింటిని జయించి, ఆరింటిని తెలుసుకుని, ఏడింటిని విడిచి సుఖాన్ని పొందమని విదురుడు చెబుతాడు. ఒకదానితో రెండింటిని నిర్ణయించుకోవడమంటే- మన బుద్ధితో ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవడం. మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకోవడమంటే- మిత్రుణ్ని, శత్రువును, తటస్థుణ్ని సామ, దాన, భేద, దండోపాయాలనే నాలుగు ఉపాయాలతో వశపరచుకోవాలని అర్థం. అయిదింటిని జయించడమంటే శ్రవణేంద్రియం (చెవి), స్పర్శేంద్రియం (చర్మం), రూపేంద్రియం (కన్ను), రసేంద్రియం (నాలుక), ఘ్రాణేంద్రియం (ముక్కు) అనే అయిదింటినీ అదుపులో ఉంచుకోవడం. ఈ ఇంద్రియాలు మనసును నిలకడగా ఉండనీయకుండా విషయ లాలసతో ప్రేరేపిస్తుంటాయి. అందుకని వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

ముఖ్య లక్షణమిది: ఆరింటిని తెలుసుకోవడమంటే- సంధి, విగ్రహం, యాన, ఆసన, ద్వైదీభావ, సమాశ్రం అనే ఆరు గుణాలను తెలుసుకోవడం. సంధి అంటే శత్రువును మిత్రుడిగా చేసుకోవడం. విగ్రహం అంటే విజయానికి అనుకూలమైన సమయంలో యుద్ధం చేయడం. యాన అంటే శత్రువు బలహీన స్థితిలో ఉన్నప్పుడు యుద్ధానికి సన్నద్ధం కావడం. ఆసనమంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ద్వైదీభావం అంటే రెండు విధాలు- బలవంతులతో సంధి చేసుకోవడం, బలహీనులతో యుద్ధం చేయడం. సమాశ్రయం అంటే ఆయా విషయాల్లో సమర్థులైనవాళ్లను ఆశ్రయించడం. ఆ ఆరింటినీ పరిపూర్ణంగా తెలుసుకుని, ఆయా సమయాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ప్రవర్తించడం- సుఖపడాలనుకున్న విజ్ఞులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం. 
జీవన వికాసానికి…: ఏడింటిని విడిచిపెట్టడం అంటే- పరస్త్రీ వ్యామోహం, జూదం, జంతువులను వేటాడటం, మద్యాన్ని సేవించడం, మాటల్లో పరుష పదజాలం, కఠినంగా దండించడం, ధనాన్ని దుర్వినియోగపరచడం లాంటి సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం. అది సుఖమయ జీవనానికి నాంది అని తెలుసుకోవాలి. ఆనాటి గురువులు చెప్పిన విషయాలకు విశేష ఖ్యాతి దక్కిందంటే, వారు ఎంతటి జ్ఞాన సముపార్జన అనుభవంతో వాటిని లోకానికి వెల్లడించారో అర్థం చేసుకోవాలి. మన పురాణ వాఙ్మయం కేవలం ఆధ్యాత్మిక చింతాపరులకు మాత్రమే కాదు- ప్రతి వ్యక్తి జీవన వికాసానికీ సుగమ మార్గం.

యువత విదేశీ సాహిత్యానికి బానిసలు కాకుండా, ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లు, ముందు మన రుషులు అందించిన వివిధ విషయాలను పరిపూర్ణంగా గ్రహించి తదనుగుణంగా తమను తాము మలచుకుని, అప్పుడు ఇతర సాహిత్యం వైపు చూపు సారించాలి.మనిషి నడవడిక అతణ్ని లోకానికి పరిచయం చేస్తుంది. నలుగురినీ అతడికి దగ్గర చేస్తుంది. మనిషి కోరుకునే సుఖం అతణ్ని అధోగతి పట్టించకూడదు. మనిషిగా పుట్టడం కాదు. ఈ ప్రపంచంలో అలా మనగలగడం బహు గొప్ప అంటుంది మన పురాణ సంప్రదాయం.