Business

ట్రంప్ ఒప్పందంతో బలపడిన అమెరికా మార్కెట్లు

ట్రంప్ ఒప్పందంతో బలపడిన అమెరికా మార్కెట్లు

దాదాపు 18 నెలల వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా-చైనా ముందడుగు వేశాయి. దాదాపు ఏడాది పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ఉపప్రధాని లియూ హీ ఒప్పందంపై సంతకం చేశారు. అయితే చైనా ఎగుమతులపై సుంకాల తగ్గింపును మాత్రం ఒప్పందంలో చేర్చకపోవడం గమనార్హం. మేధో హక్కుల పరిరక్షణ, బలవంతపు సాంకేతిక బదిలీకి ముగింపు, వివాదాల పరిష్కారాలకు సమర్థమైన వ్యవస్థ ఏర్పాటు, కరెన్సీ మార్పులకు ముగింపు తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా చైనాకు అమెరికా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెరుగనున్నాయి. ఈ ఒప్పందాన్ని ట్రంప్‌ చరిత్మాత్మకమైనదిగా అభివర్ణించారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య న్యాయమైన పరస్పర వాణిజ్యానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుంకాల తగ్గింపుపై రెండో దశ ఒప్పందంలో పరిశీలిస్తామని తెలిపారు. తాజా ఒప్పందంతో అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.