Politics

జగన్ పిటీషన్లు కొట్టివేత

CBI Court Rejects Jagan's Petitions

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి విచారించాలని గతంలో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ జరపాలని కూడా ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం డిశ్చార్జి పిటిషన్లన్నింటినీ కలిపి వినేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగానే వినాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పెన్నా ఛార్జిషీట్‌లో అనుబంధ అభియోగ పత్రంపై ఈరోజు విచారణ ప్రక్రియను సీబీఐ కోర్టు ప్రారంభించింది. అయితే, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరగా.. ఈరోజు విచారణకు వ్యక్తిగత హాజరునుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసులో మిగతా నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ, కొందరు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అనంతరం అన్ని కేసుల విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.