Kids

వీళ్లు నిజమైన ప్రకృతి ప్రేమికులు

Inspirational Stories For Kids-Mahindra And Nadella On Climate Change

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ ద్వారా నిత్యం సమకాలీన అంశాలపై స్పందించడంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు అభినందనలు తెలిపారు. దీనికో కారణం ఉంది.. తమ సంస్థ స్థాపించిన నాటి నుంచి వెలువరించిన కార్బన్‌ ఉద్గారాలను 2050 నాటికి తొలగిస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రతిజ్ఞ చేసింది. ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ మహీంద్రా ట్విట్టర్‌ వేదికగా సత్య నాదెళ్లకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘శెభాష్‌ (బ్రావో) సత్య నాదెళ్ల, గతంలో 2040 నాటికి తాము వెలువరించిన కార్బన ఉద్గారాలను తొలగిస్తామని మహీంద్రా సంస్థ ప్రతిజ్ఞ చేసింది. ఆ గడువు తర్వాత పదేళ్లకు మీ సంస్థ వెలువరించిన కార్బన ఉద్గారాలను తొలగిస్తామని ప్రతిజ్ఞ చేయడం ఎంతో అభినందనీయం. నాకు తెలిసి ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం’’ అని ట్వట్టర్లో పేర్కొన్నారు. సంస్థ స్థాపించిన నాటి నుంచి వెలువరించిన కార్బన్‌ ఉద్గారాలను 2050 నాటికి తొలగిస్తామని కొద్దిరోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. దాదాపు 45 ఏళ్ల నుంచి వెలువరించిన ఉద్గారాలను ఆ సంస్థ తొలగించనుంది. ‘‘శాస్త్రీయ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచం తీవ్రమైన కార్బన్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వీటిని వాతావరణం నుంచి తొలగించకపోతే.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సైన్స్‌ నివేదికలు చెబుతున్నాయి’’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ 2012 నుంచి కార్బన్‌ ఉద్గారాల తొలగింపునకు చర్యలు తీసుకొంటోంది. దీనితో పాటు గూగుల్, ఆపిల్, అమెజాన్‌ వంటి ప్రముఖ సంస్థలు కూడా 2040 నాటికి తాము వెలువరించిన కార్బన్‌ ఉద్గారాలను తొలగిస్తామని ప్రకటించాయి.