Editorials

ఫ్రెంచి కోట బద్ధలవుతోంది

Mallya's French Castle In Very Bad Condition Like Its Boss

భారత వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఫ్రాన్స్‌లోని ఓ ద్వీపంలో కొనుగోలు చేసిన విలాసవంతమైన భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందంట. 17 పడక గదులు, సినిమా థియేటర్‌, హెలిప్యాడ్‌, నైట్‌క్లబ్‌ ఉన్న ఈ సౌధానికి గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఫ్రెంచ్‌ ద్వీపమైన ఇలీ సెయింటీ మార్గరైట్‌లో 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ‘లీ గ్రాండ్‌ జార్డిన్‌’ భవనాన్ని మాల్యా 2008లో కొనుగోలు చేశారు. ఇందుకోసం ఖతార్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎస్‌ఏక్యూకు చెందిన అన్స్‌బాచర్‌ అండ్‌ కో యూనిట్‌ నుంచి మాల్యా 30 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకున్నారు. గిజ్మో ఇన్వెస్ట్‌ కంపెనీ పేరుతో ఈ లోన్‌ తీసుకోగా.. ఆ తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించలేదు. అయితే పరిస్థితుల దృష్ట్యా రుణ గడువు పెంచాలని మాల్యా కోరడంతో బ్యాంక్‌ ఆ సౌధాన్ని తనిఖీ చేసింది. అయితే అప్పటికే భవనం చాలా వరకు దెబ్బతిన్నట్లు ఈ తనిఖీల్లో తేలింది. అంతేగాక, మార్కెట్‌ విలువ కూడా 10 మిలియన్ల మేర పడిపోయిందట. దీంతో మాల్యాపై అన్స్‌బాచర్‌ అండ్‌ కో తాజాగా దావా వేసింది. ఈ రుణం తీసుకునేందుకు మాల్యా ఇంగ్లాండ్‌లోని తన సూపర్‌యాచ్‌ను సెక్యూరిటీగా పెట్టారట. దీంతో ఆ సూపర్‌యాచ్‌ను అమ్మి రుణం చెల్లించేలా ఆదేశాలివ్వాలని అన్స్‌బాచర్‌ సంస్థ లండన్‌లోని న్యాయస్థానాన్ని కోరింది. అయినా కానీ తానిచ్చిన రుణం తీరకపోవడంతో మాల్యా సౌధాన్ని కూడా అమ్మకానికి పెట్టామని తెలిపింది. భారత్‌లోని పలు బ్యాంకులకు రూ. 9వేల కోట్ల మేర రుణాల ఎగ్గొట్టినందుకు గానూ మాల్యాపై ఈడీ కేసు నమోదైంది. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు యూకే న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.