Movies

తక్కువ సమయం. ఎక్కువ అభిమానం.

Tamannah Bhatia Confident On Regaining Her Fan Base

నావైపు ప్రేక్షకుల్ని తిప్పుకోవడానికి నాకు కాసింత సమయమే చాలంటోంది తమన్నా. ఈ నాయిక తెరపైకొచ్చి 13 ఏళ్లపైనే అయ్యింది. ఇప్పటికీ కొత్త నాయికలకి గట్టి పోటీఇస్తూ అవకాశాల్ని అందుకొంటోంది. ఒకవైపు ప్రత్యేక గీతాలతో మెరిపిస్తూనే, మరోవైపు బలమైన పాత్రలూ చేస్తోంది. కథానాయికల దృష్టి ఎప్పుడూ ప్రాధాన్యమున్న పాత్రలపైనే ఉంటుంది. కానీ వాళ్లకి ఎక్కువగా ఆడిపాడేందుకు పరిమితమయ్యే పాత్రలే లభిస్తుంటాయి. అందుకే మాకు తగ్గ కథలు, పాత్రల్ని సృష్టించడం లేదని తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తమన్నా మాత్రం తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు చాలా మేలంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ‘‘తొలి నుంచీ పాత్రల పరిధి గురించి నేనెక్కువగా ఆలోచించలేదు. ఉన్నంతలో ప్రేక్షకుల్ని ఎలా ఆకర్షించాలనే కోణంపైనే దృష్టి పెట్టా. వాణిజ్య ప్రధానమైన చిత్రాలతోనే ఎదిగా. ఆడిపాడుతూనే ప్రేక్షకులు నా గురించి మాట్లాడుకునేలా చేశా. అది నేను సాధించిన ఓ గొప్ప లక్ష్యంగా భావిస్తుంటా. ఇప్పుడు మాత్రం బలమైన పాత్రలు దక్కుతున్నాయి. తొలినాళ్లతో పోలిస్తే ఎంత మార్పో. ఈ దశలోనూ చిత్రసీమలో కొనసాగుతుండడం నిజంగా నా అదృష్టం. సినిమా రంగంలోనైనా, బయటైనా మనం కోరుకున్నవి వెంటనే జరిగిపోవు. దేనికైనా ఓ సమయం ఉంటుంది. అప్పటిదాకా మన ముందున్న పనిని చేసుకుంటూనే ఎదురు చూడాలి. నేనదే చేశాన’’ని చెప్పింది తమన్నా.