Politics

జనసేన OLX పార్టీ

Transportation Minister Perni Nani Slams Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. పూటకో మాట మాట్లాడే వారి మాటలకు విలువ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 2019లో సీట్లు గెలవలేకపోయిన పవన్ కల్యాణ్ 2024లో ఏం గెలుస్తారని ఎద్దేవా చేశారు. భాజపాతో బేషరతుగా కలవడంలో ఆంతర్యం ఏమిటో తెలియజేయాలని పవన్‌ను నాని డిమాండ్ చేశారు. గతంలో ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై ఆయన విమర్శలు చేశారని గుర్తు చేశారు. షరతులతో కాకుండా బేషరతుగా ఒప్పందం పెట్టుకున్నందుకు సిగ్గు అనిపించడం లేదా? అని పవన్‌ను నిలదీశారు. పవన్ కల్యాణ్ తన పార్టీని ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్‌లో విక్రయానికి పెట్టారని పేర్ని నాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై 3,172 కేసులు నమోదు చేశామని పేర్ని నాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 546 బస్సులు సీజ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా 3.19 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు. ప్రైవేటు రవాణా సంస్థలు ఉల్లంఘనలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. కొన్ని రూట్లలో అధిక ధరలు వసూలు చేసినట్లు వాట్సాప్‌ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. 20వ తేదీ వరకు ప్రైవేటు బస్సులపై తనిఖీలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.