Business

737-Maxలో మరో తలకాయ నొప్పి సమస్య

Boeing 737-Max Brand News Problem

ఇప్పటికే పలు సమస్యలతో గ్రౌండ్‌కు పరిమితమైన బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో మరో కొత్త లోపాన్ని గుర్తించినట్లు సంస్థ ప్రకటించింది. అయితే దీన్ని అతిచిన్న లోపంగా పేర్కొన్న బోయింగ్‌ వీలైనంత త్వరగా సరిచేయడానికి కృషి చేస్తామని వెల్లడించింది. తాజా సమస్య వల్ల.. విమానాలను తిరిగి సేవల్లో చేర్చాలని నిర్దేశించుకున్న తేదీపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన తాజా లోపం, దాన్ని సవరించడానికి తీసుకుంటున్న చర్యలపై ఫెడరల్‌ ఏవియేషన్‌కు వివరాలు అందజేశామని పేర్కొంది. ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడమే సంస్థ తొలి ప్రాధాన్యమని చెప్పుకొచ్చింది. గతవారం నిర్వహించిన టెక్నికల్‌ రివ్యూలో తాజా సమస్యను చేర్చలేదని వెల్లడించింది. విమానాన్ని అదుపు చేసే సాఫ్ట్‌వేర్‌, సిమ్యులేటర్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిచేసేందుకు ఇప్పటికే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను సేవల నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గతంలో ఈ రకానికి చెందిన రెండు విమానాలు భారీ ప్రమాదానికి గురికావడంతో బోయింగ్‌ వీటిని నిలిపివేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి లోపాల్ని సవరించేందుకు కసరత్తులు చేస్తోంది.