DailyDose

హ్యుండాయి కోనా సరికొత్త రికార్డు-వాణిజ్యం

Hyundai Kona Creates Guinness Record-Telugu Business News Roundup

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ దేశీయంగా తయారుచేసిన కోనా ఎలక్ట్రిక్‌ కారు సరికొత్త రికార్డు సృష్టించింది. టిబెట్‌లోని సావులా కొండల్లో 5,731 మీటర్ల ఎత్తుకు ప్రయాణించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులో స్థానం సంపాదించింది. ఇప్పటి వరకు అంత ఎత్తు ప్రయాణించిన వాహనాల్లో ఇది దేశీయంగా రూపొందించిన తొలి ఎలక్ట్రిక్‌ వాహనం కావడం విశేషం. గతంలో నియో ఈఎస్‌80 కారు 5,715 మీటర్లు ఎత్తు ప్రయాణించి రికార్డు సృష్టించింది. దీంతో హ్యుందాయ్‌ కోనా.. ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇది ప్రయాణంలో దానితో పాటు అమర్చిన స్టాండర్డ్‌ పోర్టబుల్ ఛార్జర్‌ ద్వారా రీఛార్జి చేసుకుందని సంస్థ పేర్కొంది. కోనా ఎలక్ట్రిక్‌ కారు కష్టతర భూభాగాల్లోనూ ప్రయాణించి దాని సామర్థ్యాన్ని నిరూపించిందని హ్యుందాయ్‌ మోటర్స్‌ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్‌ కిమ్‌ తెలిపారు. ఇది తమ సంస్థ ఎంతో గర్వించదగిన విషయమన్నారు. ఈ కారుకు 39.2 కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. అది ఒక సారి ఛార్జింగ్‌ చేస్తే 452 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది.

* ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్ఎం), ఈ-కామర్స్‌ సంస్థ ఫిఫ్త్‌ గేర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఎఫ్‌జీవీఎల్‌)ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదిరినట్లు శనివారం ఎంఅండ్‌ఎం ప్రకటించింది. దీంతో మహీంద్రా అనుబంధ సంస్థ ‘మహీంద్రా ఫస్ట్‌ గేర్‌ ఛాయిస్‌ వీల్స్‌ లిమిటెడ్‌’(ఎంఎఫ్‌సీడబ్ల్యూఎల్‌)కు ఎఫ్‌జీవీఎల్‌ అనుబంధంగా పనిచేయనుందని తెలిపారు. ఈ కొనుగోలు ప్రక్రియ మార్చి 31, 2020 పూర్తి చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు 2015లో నెలకొల్పిన ఎఫ్‌జీవీఎల్‌.. కార్‌అండ్‌బైక్‌.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాహనాల కొనుగోలు, సమీక్ష, ఇతరరత్రా సేవల్ని అందిస్తోంది. తాజాగా దీన్ని కొనుగోలు చేయడంతో మహీంద్రా డిజిటల్‌ ప్లాట్‌ఫారంపై ముద్ర వేయాలని చూస్తోంది.

* సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా ‘‘గూగుల్‌ ఐటీ ఆటోమేషన్‌ విత్‌ పైథాన్‌ ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌’’ కోర్సును ప్రారంభించింది. ఇది పైథాన్‌, గిట్‌, ఐటీ ఆటోమేషన్‌లో ఉద్యోగాలు పొందేలా ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ ఇవ్వనుంది. ‘‘పైథాన్‌ ప్రస్తుతం అత్యంత డిమాండ్‌ ఉన్న ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌. అమెరికాలో దాదాపు 5.30లక్షల ఉద్యోగులు అవసరం. వీరిలో దాదాపు 75,000 మంది ఎంట్రీ లెవల్లో ఉద్యోగులకు పైథాన్‌పై పట్టు ఉండాల్సింది. మీరు ఈ కోర్సు చేస్తే ఆరునెలల్లో పైథాన్‌, గిట్‌, ఐటీ ఆటోమేషన్‌పై ఆరునెలల్లో పట్టు సాధిస్తారు’’ అని గ్రోవిత్‌ గూగుల్‌ ప్రొడక్ట్‌ లీడ్‌ నటాలీ వాన్‌క్లీఫ్‌ కాన్లీ తెలిపారు. ఈ కోర్సు నేర్చుకొనే వారిలో కొందరికి స్కాలర్‌షిప్‌లు కూడా సమకూర్చే అవకాశం ఉంది. గత అక్టోబర్‌లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, శ్వేతసౌధ సలహాదారు ఇవాంక ట్రంప్‌ కలిసి 2,50,000 మంది అమెరికన్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే అంశాన్ని ప్రకటించారు. అదే సమయంలో సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ గూగుల్‌ ఐటీ ప్రొఫెషన్ల్స్‌ ధ్రువీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని 2020నాటికి దాదాపు అమెరికాలోని 100 కమ్యూనిటీ కాలేజీలకు విస్తరిస్తామని తెలిపారు.

* రాబోయే రెండు నెలలకు జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని పెంచుతూ పన్ను అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రూ. 1.15లక్షల కోట్లు, మార్చి నెలలో రూ. 1.25లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు నెలకు రూ. 1.1లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. తాజాగా దాన్ని రూ. 1.15లక్షల కోట్లకు పెంచారు. అంతేగాక జీఎస్‌టీ రిటర్నుల్లో మోసాలను గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

* ఇప్పటికే పలు సమస్యలతో గ్రౌండ్‌కు పరిమితమైన బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో మరో కొత్త లోపాన్ని గుర్తించినట్లు సంస్థ ప్రకటించింది. అయితే దీన్ని అతిచిన్న లోపంగా పేర్కొన్న బోయింగ్‌ వీలైనంత త్వరగా సరిచేయడానికి కృషి చేస్తామని వెల్లడించింది. తాజా సమస్య వల్ల.. విమానాలను తిరిగి సేవల్లో చేర్చాలని నిర్దేశించుకున్న తేదీపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన తాజా లోపం, దాన్ని సవరించడానికి తీసుకుంటున్న చర్యలపై ఫెడరల్‌ ఏవియేషన్‌కు వివరాలు అందజేశామని పేర్కొంది. ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడమే సంస్థ తొలి ప్రాధాన్యమని చెప్పుకొచ్చింది. గతవారం నిర్వహించిన టెక్నికల్‌ రివ్యూలో తాజా సమస్యను చేర్చలేదని వెల్లడించింది. విమానాన్ని అదుపు చేసే సాఫ్ట్‌వేర్‌, సిమ్యులేటర్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిచేసేందుకు ఇప్పటికే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను సేవల నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గతంలో ఈ రకానికి చెందిన రెండు విమానాలు భారీ ప్రమాదానికి గురికావడంతో బోయింగ్‌ వీటిని నిలిపివేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి లోపాల్ని సవరించేందుకు కసరత్తులు చేస్తోంది.