Politics

నువ్వు ఎవరు అది చెప్పడానికి?

Nirbhaya's Mom Slams Indira Jai Singh Over Mercy Petition

ప్రపంచం మొత్తం నిర్భయ దోషుల మరణశిక్ష అమలు జరిగే క్షణం కోసం ఎదురు చూస్తోంటే.. కొందరి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగటం లేదని నిర్భయ తల్లి అన్నారు. నిర్భయ దోషులను క్షమించాలని.. ఇందుకు సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సలహాను అమె తిరస్కరించారు.

నిర్భయ కేసులో దోషులు వినయ్‌, అక్షయ్‌, పవన్‌, ముఖేశ్‌లకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయాలని దిల్లీ కోర్టు మరో సారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉరిశిక్ష అమలు ఆలస్యం కావడంపై నిర్భయ తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు దీనిపై ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ మాట్లాడుతూ..‘‘నిర్భయ తల్లి ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నళినీని సోనియా గాంధీ క్షమించారు. ఆమెకు ఉరిశిక్ష పడాలని సోనియా కోరుకోలేదు. సోనియాను ఉదాహరణగా తీసుకోవాలని నిర్భయ మాతృమూర్తిని కోరుతున్నాను. ఆమెకు మా మద్దతు ఉంది. మేము మరణశిక్షకు మాత్రమే వ్యతిరేకం’’ అని వ్యాఖ్యానించారు.

అయితే ఇందిరా జైసింగ్‌ వ్యాఖ్యలపై నిర్భయ తల్లి మండిపడ్డారు. ‘‘ఇలాంటి సలహా ఇవ్వటానికి ఇందిరా జైసింగ్‌ ఎవరు? ప్రపంచం మొత్తం ఆ దోషుల ఉరితీత గురించి ఎదురు చూస్తోంది. కానీ ఇలాంటి వ్యక్తుల వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగటం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.