Movies

నాలుగు నెలల గర్భంతో ఫ్లైఓవర్‌పై సాహసం

Actress Sneha's Adi Murai Fight Being 4Months Pregnant

దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం ‘పటాస్‌’. ‘అడిమురై’ అనే వర్మకళ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి అర్ధ భాగం కన్నా ‘అడిమురై’కి సంబంధించి వచ్చిన ఫ్లాష్‌ బ్యాక్‌తో ఉన్న ద్వితీయార్థం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు స్నేహ కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఈ సినిమాలో ‘అడిమురై’ నేర్చుకునే విద్యార్థినిగా, గురువుగా ఆమె నటించారు. దీనికోసం దాదాపు మూడు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఎంతో క్లిష్టమైన ఈ వర్మ కళను ఆమె నేర్చుకుని నటించారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె గర్భం దాల్చారు. అయినప్పటికీ ఇంట్లోనే శిక్షణ తీసుకున్నారు. అంతేకాకుండా కథ ప్రకారం చెన్నైలోని గిండి ఫ్లైఓవర్‌ వద్ద పోరాట సన్నివేశంలో ఆమె అడిమురై కళను ప్రయోగిస్తారు. అప్పుడు ఆమె నాలుగు నెలల గర్భిణి. అయినప్పటికీ వైద్యుల సలహాల మేరకు ఆ సన్నివేశంలో నటించి మెప్పించారు. ఆమె సాహసాన్ని చూసి ఆశ్చర్చపోయింది చిత్ర బృందం. మరోవైపు ఆ సన్నివేశాన్ని తెరకెక్కించే వరకు దర్శకుడి నుంచి టెక్నీషియన్ల వరకు అందరూ భయంతో వణికిపోయారట. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆమె భర్త ప్రసన్న అనుక్షణం తోడుగా ఉంటూ తమకు ఎంతో సహకరించారని దర్శకుడు దురై సెంథిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నటి స్నేహ అడిమురైలో శిక్షణ పొందుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.