Politics

పవన్‌తో దోస్తీ వెనుక భాజపా కులం కార్డు

BJP Playing Caste Card With Janasena In Andhra-Telugu Politics

కొన్ని విషయాలు దీర్ఘకాలం చర్చనీయాంశంగా ఉంటాయి. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కూడా అలాగే మారింది. దీని వల్ల ప్రయోజనం ఉండదని కొందరు అంటున్నా… ఎన్నో రకాల విశ్లేషణలు దీని వెనక కనిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మదర్ థెరిసా జయంతి రోజున… 2008 ఆగస్టు 8న మెగాస్టార్ చిరంజీవి… భారీ ర్యాలీ నిర్వహించి తిరుపతిలో… ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం మనకు తెలుసు. అప్పట్లో ఆ రోజున పార్టీ పేరును ప్రకటించడం… అప్పటికి ఏపీ సమైక్యంగా ఉండటం, మెగాస్టార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, తిరుపతిలో వెంకన్న సాక్షిగా పార్టీని స్థాపించడం అవన్నీ ప్రజారాజ్యానికి కలిసొచ్చిన అంశాలయ్యాయి. మెగాస్టార్‌ను లెజెండరీ నటుడు ఎన్టీ రామారావుతో పోల్చుతూ… పెద్దాయన ఎలాగైతే… ఏపీలో కాంగ్రెస్‌ని చిత్తు చేసి… టీడీపీని అధికారంలోకి తెచ్చాడో… అదేవిధంగా… చిరంజీవి పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి తెరతీస్తుందని అంతా భావించారు. ఆ స్థాయి అంచనాల్ని చేరుకోలేకపోయినా… చిరంజీవి కూడా ఏపీ రాజకీయాల్ని ఎంతో కొంత ప్రభావితం చేశారనడంలో సందేహం అక్కర్లేదు.

కాపులు… ఆంధ్రాలో ముఖ్యంగా కోస్తాంధ్రలో కాపు వర్గం రాజకీయంగా బలమైన శక్తిగా ఉంది. అప్పట్లో కాపులంతా చిరంజీవికి మద్దతుగా నిలిచారు. సీమాంధ్రలో పావు వంతు నేతలు ఆ వర్గం వారే అయ్యారు. చిరంజీవికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్… అప్పట్లో రెడ్డి వర్గం ఆధిపత్యం (వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్వర్యంలో)లో ఉండే కాంగ్రెస్‌ని, కమ్మ వర్గం ఆధిపత్యం (చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో)ని ఎదిరించి… పీఆర్పీ నిలబడేందుకు పునాదిగా మారింది. అలాంటిది… అందరి ఆశల్నీ అలాగే ఉంచేస్తూ… చిరంజీవి… తన పార్టీని… కాంగ్రెస్‌లో కలిపేసి… మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో టూరిజం శాఖ మంత్రిగా మారిపోయారు.

ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్… సొంత పార్టీ పెట్టుకున్నారు. ఏపీలో పాతుకుపోయిన టీడీపీని వేళ్లతో సహా పెకిలించి… తన వైసీపీకి ఎప్పుడూ ఏ పార్టీకీ లేనంత భారీ మెజార్టీ వచ్చేలా చేసుకున్నారు. ఇక కాంగ్రెస్… ఎప్పట్లాగే ఆంధ్రలో అంతర్థానమై ఉంది.

ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ… 2014 నుంచీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ లాగే… జనసేనకు కూడా కాపుల మద్దతు లభించింది. ఇక ఏపీలో బీజేపీ 2014 నుంచీ యాక్టివ్‌గా ఉంటూ… రాష్ట్ర రాజకీయాల్ని ఇప్పటికీ ఎంతో కొంత ప్రభావితం చేస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌తో జట్టు కట్టడం ద్వారా… ఏపీలో బలంగా పాతుకునేందుకు కాస్ట్ కార్డ్‌పై బీజేపీ నమ్మకం పెట్టుకుంటోందని అనుకోవచ్చు. ఇది బీజేపీ సహజ శైలికి భిన్నం అనుకోవచ్చు. సహజంగా మందిర్ మొబిలైజేషన్ (మత పరంగా మద్దతు)పై ఆధారపడే బీజేపీ ఈసారి మాత్రం మండల్ మొబిలైజేషన్ (కాస్ట్ కార్డ్ మద్దతు)పై ఫోకస్ పెట్టిందనుకోవచ్చు.

ఉత్తరప్రదేశ్, బీహార్‌లో బీజేపీ… అంతగా ప్రాధాన్యం లేని బీసీ వర్గాల ఓటర్ల మద్దతుతో బీజేపీ ఆ రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా మారింది. గుజరాత్‌లో బీజేపీకి పటేళ్ల మద్దతు సంపూర్ణంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ అంతే. ఇక మహారాష్ట్రలో మరాఠాలు కానివారంతా బీజేపీకి అండగా ఉన్నారు. దీన్ని బట్టీ చూస్తే.. అగ్ర కులాల మద్దతు లేని చోట… బీజేపీ… వెనకబడిన కులాల సపోర్ట్ సంపాదించుకుంటోంది. 1980, 90ల్లో రామకృష్ణ హెగ్డే… లింగాయత్‌ల మద్దతుతో మూడుసార్లు సీఎం అయ్యారు. ఆ సమయంలో… బీజేపీ అక్కడ విస్తరించేందుకు అవకాశం దక్కింది. కులం పరంగా హెగ్డే బ్రాహ్మణుడు అయినప్పటికీ… లింగాయత్, వొక్కలింగ లకు ఆయన సపోర్ట్ లభించింది. హెగ్డే మరణం తర్వాత బీజేపీ లింగాయత్ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకుంది. ఆ పార్టీకి చెందిన నాయకుల్ని తెరపైకి తెచ్చి నేతలుగా మార్చింది. పదేళ్లలో అదే లింగాయత్‌లకు చెందిన యడియూరప్ప… కర్ణాటక సీఎం అయ్యారు.

కేరళలో బీజేపీ… అతిపెద్ద హిందూ గ్రూపుగా ఉన్న ఎఝావాస్‌ను ఆకర్షిస్తోంది. ఇందుకోసం శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం సంస్థ వారితో కలిసి పనిచేస్తోంది. తమిళనాడులో… దక్షిణాన ఉన్న దేవేంద్రకులం వెల్లార్… కాస్ట్ గ్రూప్‌తో కలిసి బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణ, ఏపీలో మాత్రం… తగిన కాస్ట్ కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఇప్పటివరకూ అలాంటిది లభించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా… ఏపీలో ఆ గ్యాప్ భర్తీ అవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావించి ఉండొచ్చు. ఈ ఫలితాలు 2024 ఎన్నికల్లో కనిపిస్తాయన్న అంచనాల్లో కమలదళం ఉన్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి… తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి తప్పుచేయగా… పవన్ కళ్యాణ్ దాని నుంచీ ఎలాంటి గుణపాఠమూ నేర్చుకోలేదనిపిస్తోంది. జనసేన… ఇప్పుడు బీజేపీతో కలవడం వల్ల… తన అస్థిత్వాన్ని కోల్పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.