ScienceAndTech

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలతో అమెజాన్ డెలివరీ

Amazon's Plans To Go All Electric Delivery In India By 2025

భారత్‌లో తమ వస్తువులను సరఫరా చేయటానికి ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించనున్నామని ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. 2025 కల్లా దేశంలో తమ డెలివరీలు 10,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా జరుగుతాయని సంస్థ వివరించింది. ఈ ఎలక్ట్రిక్‌ డెలివరీ విధానం 2020లో దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పుణె, నాగ్‌పూర్‌, కోయంబత్తూర్‌తో సహా 20 భారతీయ నగరాలలో అమలులోకి వస్తుంది. ‘‘సమర్ధ ఇంధన వినియోగంలో ప్రథమ స్థానంలో నిలువటానికి మేము ప్రయత్నిస్తున్నాం. 2025 కల్లా మా ఎలక్ట్రిక్‌ సరఫరా వాహనాల సంఖ్యను 10,000కు పెంచటం మా ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి కానుంది.’’ అని అమెజాన్‌ ఇండియా ఉన్నతాధికారి అఖిల్‌ సక్సేనా తెలిపారు. 2030లోగా ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా డెలివరీలు అనే లక్ష్యానికి ప్రస్తుత లక్ష్యం అదనమని సంస్థ అధికారులు ప్రకటించారు. ఇందుకు అవసరమైన త్రిచక్ర, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్‌ వాహనాల డిజైన్‌, తయారీ భారత్‌లోనే జరగనుందని అమెజాన్‌ తెలిపింది. ఇందుకుగాను భారతీయ పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది. సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణానికి అతి తక్కువ హాని కలిగించే సప్లై చైన్‌ మోడల్‌ తయారీకి కట్టుబడి ఉన్నామని అమెజాన్‌ తెలిపింది. ఇందుకుగాను 2019లో దేశంలోని వివిధ నగరాలలో ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. ఈ విధంగా 2022 కల్లా 10,000 ఇంకా 2030కల్లా ఒక లక్ష ఎలక్ట్రిక్‌ డెలివరీ వాహనాల వినియోగం ద్వారా సాలీనా మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించటం తమ ‘అమెజాన్‌ పర్యావరణ ప్రతిజ్ఞ’లో భాగమని సంస్థ వివరించింది.