Health

ఋతుక్రమంలో తేడాలను నిర్లక్ష్యం చేయవద్దు

Do Not Neglect Menstrual Cycle Differences-Telugu Women's Health News

మరీ అంత నిర్ధిష్టంగా ఏదీ ఉండదు కదా! రుతుక్రమం తేదీలు అటుఇటుగా మారిపోతే మాత్రం ఏమవుతుంది.? అనుకునే మహిళలే ఎక్కువ. అయితే ఆ తేడాలను అతి సాధారణ విషయాలుగా అనుకోవడం చాలా ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు ‘అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఈ విషయాలే చర్చకు వచ్చాయి. అధ్యయన కారుల అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంగా రుతుక్రమం తేడాలు ఉన్న వారి జీవితకాలం వివిధ కారణాల వల్ల బాగా తగ్గిపోతోంది. వీరిలో కొందరు గుండె జబ్బులతో మరణిస్తే, మరికొందరు కొన్ని ప్రాణాంతక వ్యాధులతో మరణిస్తున్నారు. బహిష్టు క్రమం తప్పడం కేవలం మహిళల లైంగిక రుగ్మతలకు మాత్రమే సంబంధించింది అనుకుంటే పొరపాటే. అది చాలా సార్లు ప్రధాన జీవక్రియలను కుంటుపరిచే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ సమస్యకు మూలం కూడా కావచ్చు. రుతుక్రమ సంబంధమైన ఏ సమస్యలూ లేని వారితో పోలిస్తే, ఈ తేడాలు ఉన్నవారు తరచూ పలు వ్యాధులతో బాధపడుతున్నారని అంతిమంగా ఇవి వారి జీవిత కాలాన్ని తగ్గించి వేస్తున్నాయి. అందువల్ల రుతుక్రమ తేడాలను మహిళలంతా ఎదుర్కొనే అతి సామాన్య విషయం అనుకుంటే అది పొరపాటే, రుతుక్రమంలో వచ్చే ఏ తేడా అయినా, అది మొత్తం శరీర వ్యవస్థకు సబంధించిన లోపాన్ని ఎత్తి చూపుతుంది. ఆ లోపం కొన్ని సార్లు వారి జీవితకాలాన్నే దెబ్బ తీసే విధంగా ఉంటుందని అధ్యయనకారులు గుర్తు చేస్తున్నారు. ఏమైనా, రుతుక్రమం తేడాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆ తేడాలను ఎప్పుటికప్పుడు వైద్య చికిత్సల ద్వారా చక్కదిద్దుకోవాల్సిందే!. ఈ విషయంలో చూపే ఏ నిర్లక్ష్యమైనా వారికి క్షేమకరం కాదని తెలుసుకోవాలి