Editorials

HRH బిరుదులకు స్వస్తి

Meghan Harry No Longer Carries HRH Titles

బ్రిటన్‌ రాచరికపు విధుల నుంచి మేఘన్‌ మెర్కెల్‌ తప్పుకోవడంపై ఆమె తండ్రి థామస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ యువరాణి హోదా ప్రతి యువతి కల అని.. అలాంటి గొప్ప స్థాయిని మెర్కెల్‌ కావాలనే కాలదన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ రాజ కుటుంబానికి ఉన్న హోదాను మెర్కెల్‌ దిగజార్చుతున్నారని ఆరోపించారు. వచ్చేవారం ప్రసారం కాబోయే ఓ ప్రముఖ ఛానెల్‌ ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ రాజ కుటుంబాన్ని అనాదిగా వస్తున్న గొప్ప వ్యవస్థగా థామస్‌ అభివర్ణించారు. 2018లో హ్యారీని వివాహం చేసుకుంటున్న సమయంలో రాజకుటుంబ నియమాలకు కట్టుబడి ఉంటానని, కుటుంబ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేస్తానని మెర్కెల్‌ ప్రమాణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హ్యారీ, మెర్కెల్‌ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం ఆమోదనీయం కాదని.. ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఏ లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారో వారికే స్పష్టత లేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కేవలం డబ్బు కోసమే వారు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మెర్కెల్‌, హ్యారీ వివాహం నాటి నుంచి థామస్‌ వారికి దూరంగా ఉంటున్నారు. బ్రిటన్‌ రాచరికపు విధుల నుంచి హ్యారీ, ఆయన భార్య మేఘన్‌ మెర్కెల్‌ తప్పుకోనున్నట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నుంచి వారికి ‘హిస్‌ రాయల్‌ హైనెస్‌’, ‘హర్‌ రాయల్‌ హైనెస్‌’(హెచ్‌ఆర్‌హెచ్‌) అనే బిరుదులు ఉండవు. అలాగే ‘డ్యూక్‌, డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌’ హోదాలు కూడా ఉండవు. ఈ మేరకు ఓ లాంఛనప్రాయమైన అంగీకార ఒప్పందంపై వారు సంతకాలు చేశారు. మరికొన్ని వారాల్లో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఫలితంగా వీరికి ప్రభుత్వ నిధులు అందవు. రాజకుటుంబ సభ్యులుగా నిర్వర్తించాల్సిన విధులేవీ ఉండవు.