DailyDose

చమురు ధరలు తగ్గాయి-వాణిజ్యం

Oil Prices Comes Down Again-Telugu Business News Roundup

* వివిధ అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల పెరిగిన ఇంధన ధరలు మెల్లగా దిగివస్తున్నాయి. ఇరాన్‌ కమాండర్‌ సులేమానీపై అమెరికా దాడి ఫలితంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముడి చమురు ధరను విపరీతంగా పెంచేశాయి. కాగా, ప్రస్తుతం పరిస్థితి చల్లబడిన నేపథ్యంలో గత ఐదు రోజులుగా దేశీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా సోమవారం పెట్రోల్‌ ధర 10-12 పైసలు తగ్గగా, డీజిల్‌ ధరలో తగ్గుదల 19-20 పైసలుగా ఉంది. దేశంలోని వివిధ ముఖ్యపట్టణాలలో తాజాగా ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. లీటరు పెట్రోల్‌ ధర దిల్లీలో రూ.74.98, ముంబయిలో రూ.80.58, కోలకతాలో రూ. 77.58, చెన్నైలో రూ.77.89కు చేరింది. ఇక డీజిల్‌ విషయానికి వస్తే… లీటరు డీజిల్‌ ధర దిల్లీలో రూ.68.26 , ముంబయిలో రూ.71.57, కోలకతాలో రూ.70.62, చెన్నైలో రూ.72.13 ఉందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది.

* బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకొంటున్న విజయ్‌ మాల్యా కనీసం ఒక్క పైసా కూడా చెల్లించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నారిమన్‌ పేర్కొన్నారు. మాల్యాకు సంబంధించిన ఓ పిటిషన్‌ విచారణ నుంచి ఆయన తప్పుకొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తుల జప్తును ఆపాల్సిందిగా కోరుతూ మాల్యా వేసిన పిటిషన్‌ విచారణను న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దానికి సంబంధించిన విచారణను ప్రస్తుతం చీఫ్‌ జస్టిస్‌ బోబ్డేకి బదిలీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్‌ నారిమన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

* భారత్‌లోని 63 మంది బిలియనీర్ల సంపద మొత్తం కలిపితే దేశ వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువే ఉంటుందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక పేర్కొంది. అలాగే ఆర్థికంగా దిగువన ఉన్న 95.3 కోట్ల మంది ప్రజల సంపద కంటే కేవలం ఒక శాతం ధనవంతుల వద్ద ఉన్న సంపదే ఎక్కువని స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆక్స్‌ఫామ్‌ పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత దశాబ్దకాలంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపయిందని తెలిపింది. గత ఏడాది కాలంగా వారి మొత్తం సంపదలో తగ్గుదల కనిపించినట్లు వెల్లడించింది. ఆర్థిక అసమానతలు రూపుమాపే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా సీఈవో అమితాబ్‌ బెహర్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా చాలా తక్కువ దేశాలు అడుగులు వేస్తున్నాయని తెలిపారు. లింగ భేదాల వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని నివేదిక వివరించింది.

* బడ్జెట్‌ 2020 ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుకను నేడు నార్త్‌ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ తయారు చేసిన హల్వాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు.

* ప్రారంభ ట్రేడింగ్‌లో గురువారం రికార్డులతో మొదలైన దేశీయ మార్కెట్‌ సూచీలు క్రమంగా కిందకు కుంగాయి. ప్రీట్రేడింగ్‌లో 78 పాయింట్ల లాభంతో 12,430 వద్ద నిఫ్టీ సరికొత్త రికార్డుని నెలకొల్పింది. అదే స్థాయిలో దూసుకెళ్లిన సెన్సెక్స్‌ సైతం క్రమంగా కిందకు దిగజారింది. ఉదయం 9.49 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 14 పాయింట్లు నష్టపోయి 41,930 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 18 పాయింట్లు దిగజారి 12,333 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.92 వద్ద కొనసాగుతోంది. చమురు ధరల పెరుగుదల వల్లే ప్రారంభ ట్రేడింగ్‌లో నమోదు చేసిన లాభాల్ని సూచీలు క్రమంగా కోల్పోయాయని విశ్లేషకులు అభిప్రాయడ్డారు.