Editorials

సామాన్య లోకంలోకి రాచరికం

Meghan And Harry Reach Canada To Lead Normal Life

భుజానేసుకున్న జోలిలో సంటోడు, కుడి వైపున నల్లటి లాబ్రడార్‌ పెంపుడు కుక్క ఓజ్, ఎడమ పక్క మరో జాతికి చెందిన పెంపుడు కుక్క బీగల్‌ గై వెంట నడుస్తుండగా, వెన్నంటి బ్రిటన్‌ రాజ రక్షకులు తోడుగా, ముఖాన చెరగని చిరునవ్వుతో మేఘన్‌ మార్కెల్‌ రీజనల్‌ పార్క్‌లో సామాన్యుల లోకంలోకి ప్రయాణం. ఆమె బ్రిటన్‌ రాచరికపు వ్యవస్థకు శాశ్వతంగా తిలోదకాలిచ్చి సోమవారం ఉదయమే కెనడా, వాంకోవర్‌ దీవిలోని రీజనల్‌ పార్క్‌లోకి అడుగుపెట్టారు. అక్కడికి సమీపంలో ఉన్న దాదాపు 99 కోట్ల రూపాయల విలువైన భవంతి వరకు మాత్రమే బ్రిటన్‌ రాజ రక్షకులు ఆఖరి సారిగా వెంట వచ్చారు. ఆమెను సురక్షితంగా భవంతి వద్ద దింపి ఆమె నుంచి శాశ్వతంగా సెలవు తీసుకొకి వెళ్లిపోయారు.అప్పటి నుంచి మేఘన్‌ మార్కెల్, ఆమె భర్త ప్రిన్స్‌ హ్యారీ రక్షణ బాధ్యతలు కెనడా ప్రభుత్వం స్వీకరించింది. ఇందుకోసం కెనడా ప్రభుత్వం ఏటా మూడు కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రిన్స్‌ హ్యారీ ఆఖరిసారి అధికారిక హోదాలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తోపాటు ఇతర ప్రభుత్వ పెద్దలను కలుసుకొని మంగళవారం వాంకోవర్‌లోని కొత్త భవంతికి చేరుకుని మార్కెల్‌ను కలుసుకున్నారు. వారిద్దరు తమ ఎనిమిది నెలల కుమారుడు ఆర్కీతో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులను అదే భవంతిలో జరపుకున్నారు. రాచరికానికి గుడ్‌బై చెప్పి ఆ దంపతులు శాశ్వతంగా అక్కడే ఉండబోతున్నారు.