Movies

నేను చెప్పను

Rajinikanth Denies To Apologize For His Remakrs On Ramasamy Periyar

సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌ గురించి చేసిన వ్యాఖ్యలకు తాను ఎట్టిపరిస్థితుల్లోను క్షమాపణలు చెప్పనని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తేల్చి చెప్పారు. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్‌ ద్రవిడర్‌ కళగమ్‌ నలుపు రంగు దుస్తులు ధరించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే రజనీ తన ఇంటి బయట మీడియాతో మాట్లాడుతూ పెరియార్‌ వివాదంపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పనన్నారు. ‘1971లో ఏం జరిగిందో నేను చెప్పినదానిపై చర్చ జరుగుతోంది. అప్పుడు ఏం జరిగిందో మ్యాగజైన్‌లో వచ్చిన కథనాలను బట్టే నేను చెప్పాను. కానీ సొంతగా ఊహాజనిత విషయాలేవీ నేను చెప్పలేదు. వాటికి సంబంధించిన క్లిప్లింగ్స్‌ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ ఘటన గురించి నేనేమి చూశానో అదే చెప్పాను. దీనికి నేను క్షమాపణ చెప్పను’ అని రజనీకాంత్‌ అన్నారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్‌ 1971లో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని తెలిపారు. దీంతో పెరియార్‌ గురించి రజనీ తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు.