DailyDose

తెదేపా ఎమ్మెల్సీ రాజీనామా-రాజకీయ

TDP MLC Resigns To His Post-Telugu Political News Roundup

* రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. చంద్రబాబు, లోకేశ్‌ తనపై చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాణిక్యవరప్రసాద్‌.. ఈరోజు మండలి సమావేశాలకు కూడా హాజరుకాలేదు.
*అమ్మఒడి’ ఓ విప్లవాత్మకం:వల్లభనేని వంశీ
వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి కార్యక్రమం ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాల్సిన అవసరముందన్నారు. అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద విద్యార్థులను సరిగా పట్టించుకోలేదని, దూరదృష్టితో సీఎం జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వంశీ కొనియాడారు. అమ్మఒడి పథకం వల్ల సంక్రాంతికి ముందే.. అందరు తల్లిదండ్రుల ముఖాల్లో పండగ వాతావరణం కనిపించిందని చెప్పారు. అమ్మఒడి వల్ల దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న చాలా కుటుంబాలు లబ్ధిపొందుతాయని, సీఎం జగన్‌ ఉన్నారన్న భరోసాతో వారి పిల్లలను పాఠశాలలకు పంపిస్తారని ఆయన అన్నారు
* జగన్‌ నిర్ణయం హాస్యాస్పదం: వీహెచ్‌
ఏపీలో 3 రాజధానులపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 3 రాజధానుల విధానాన్ని ఎక్కడా వినలేదని, దేశంలోనూ 3 రాజధానుల విధానం లేదని చెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చేసేందుకే నిధులు లేవంటే ఇప్పడు మూడు రాజధానుల కోసం నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. ఏపీ రాజధాని రగడపై భాజపా సర్కార్‌ స్పందించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సలహా మేరకే జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు.
* బాండ్ల’లో బీజేపీ నంబర్ వన్
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో బీజేపీ దాదాపు రూ.1,451 కోట్ల విరాళాలను సమీకరించినట్టు ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) తెలిపింది. అదే ఏడాది కాంగ్రెస్ పార్టీ రూ.918.03 కోట్ల విరాళాలు సేకరించిందని, వీటిలో రూ.383.26 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయని తెలిపింది. ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖల్లోనే కొనుగోలు చేసేందుకు వీలు ఉన్న ఎలక్టోరల్ బాండ్లను ఏ రాజకీయ పార్టీకైనా విరాళంగా ఇవ్వవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఆరు జాతీయ పార్టీలో కేవలం బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తెలిపాయని, ఈ మూడు పార్టీలు సమీకరించిన మొత్తం విరాళాలు రూ.1,931.43 కోట్లని బుధవారం విడుదలచేసిన నివేదికలో ఏడీఆర్ పేర్కొన్నది.‘ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1,450.89 కోట్లు, కాంగ్రెస్ రూ.383.26 కోట్లు, టీఎంసీ రూ.97.28 కోట్ల విరాళాలను సమీకరించాయి’ అని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.192.65 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీఎంసీ, రూ.100.96 కోట్ల ఆదాయం వచ్చినట్టు సీపీఎం, రూ.69.79 కోట్ల ఆదాయం వచ్చినట్టు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రకటించాయన్నది. 2017-18లో రూ.1,027.34 కోట్లుగా ఉన్న బీజేపీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,410.08 కోట్లకు, కాంగ్రెస్ పార్టీ ఆదాయం రూ.199.15 కోట్ల నుంచి రూ.918.03 కోట్లకు పెరిగిందని, ఇందులో ఎన్నికల ప్రచారానికి లేదా సాధారణ ప్రచారానికి బీజేపీ రూ.792.39 కోట్లు, కాంగ్రెస్ పార్టీ రూ.308.96 కోట్లు ఖర్చు చేశాయని ఏడీఆర్ వివరించింది.
* కేజ్రీవాల్‌పై భాజపా అభ్యర్థి ఎవరో తెలుసా..?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పోటీగా భాజపా తరఫున రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు సునీల్‌ యాదవ్‌ను బరిలోకి దింపారు. నేటితో నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగుస్తుండడంతో సోమవారం రాత్రి పది మందితో కూడిన తుది జాబితాను భాజపా విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంతో విభేదిస్తున్న శిరోమణి అకాళీదళ్‌ దిల్లీలో పొత్తు లేదని ప్రకటించడంతో భాజపా తుది జాబితా ఖరారు చేసింది. మరో మూడు సీట్లను మిత్రపక్షాలు జేడీయూ, ఎల్‌జేపీకి కేటాయించింది. 57 మందితో కూడిన తొలి జాబితాను జనవరి 17న విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరిలో 20 మందికిపైగా కొత్తవారు ఉండడం విశేషం. దాదాపు రెండు దశాబ్దాల నుంచి దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉన్న భాజపా.. ఈసారి అధికారపక్షం ఆమ్‌ ఆద్మీ పార్టీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు.గత ఎన్నికల్లో 67 స్థానాలతో జయభేరీ మోగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో మొత్తం 7 నియోజకవర్గాల్లో గెలిచిన భాజపా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఎదురుచూస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న దిల్లీలో ఫిబ్రవరి 8న ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న తుది ఫలితాలు వెల్లడవుతాయి.
*జనసేనతో కలిసి పోరాడతాం: కన్నా
వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరు ప్రశాంతంగా ఉన్నారో సీఎం జగన్‌ చెప్పాలి. ప్రతి పిచ్చి పనికి కేంద్రం సహకారం ఉందని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు చేస్తామని వైకాపా చెప్పలేదు. రాజధాని మార్చేందుకు వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరు. ఖర్చు ఒక్కటే కారణమని నేను అనుకోవట్లేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల తరఫున జనసేనతో కలిసి పోరాటం చేస్తాం’’ అని కన్నా తెలిపారు.
*కాంగ్రెస్, భాజపాలది మేకపోతు గాంభీర్యమే-అన్ని మున్సిపాలిటీల్లో గెలుపు తెరాసదే: హరీశ్రావు
పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉంటుందని ఉత్తమ్కుమార్రెడ్డి, రెండు వేల వార్డుల్లో గెలుస్తామని భాజపా నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చెబుతున్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ పురపాలికలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్కు చివరి స్థానం ఖాయమన్నారు. రెండు వేల స్థానాలు కాదు.. అసలు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటిలో ఏ సీటు గెలుస్తారో భాజపా నాయకులు చెప్పాలని ఎద్దేవా చేశారు.
*నల్గొండ నుంచే తెరాస పతనం మొదలు
నల్గొండ పురపాలికపై కాషాయ జెండా ఎగరేస్తామని.. ఇక్కడి నుంచే తెరాస పతనం మొదలవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒవైసీల జాగీర్ కాదని.. లక్ష మంది ఒవైసీలొచ్చినా భాజపాను అడ్డుకోలేరని స్పష్టంచేశారు. ఒవైసీ సోదరులను కేసీఆర్ రెండు భుజాలపై మోస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా 2023లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నల్గొండలో రోడ్షో నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ‘‘ప్రస్తుతం పురపాలికల్లో పథకాలన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతోనే అమలు చేస్తున్నారు.
*భూ దోపిడీ కోసమే విశాఖకు రాజధాని: కన్నా
భూ దోపిడీ.. భూ కుంభకోణాల కోసమే ఏపీ రాజధానిని విశాఖపట్నం తీసుకుపోతున్నారని భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. దిల్లీలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో తాను చేస్తున్న తుగ్లక్ పాలనకు కేంద్రం అండదండలున్నాయంటూ జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని భాజపా తరఫున ఖండిస్తున్నాం. జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సాగిస్తున్న రాక్షసపాలనను మేం మొదటినుంచీ ఖండిస్తున్నాం. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు జగన్కు ఒక అవకాశం ఇస్తే తొలిరోజు నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధి కుంటుపడేలా ఉన్నాయి.
*పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఏచూరి!
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపించాలని పార్టీ రాష్ట్ర శాఖ యోచిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ సహకారాన్ని తీసుకోనుంది. ఏచూరికి మద్దతు ఇచ్చే విషయంలో తమకెలాంటి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ నేత చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి
*ఎన్నికల ముందు రైతుబంధు జీవోనా: లక్ష్మణ్
రబీ రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని.. అయితే, మున్సిపల్ ఎన్నికలకు ఒక్కరోజు ముందు జీవో విడుదల చేయడం ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఇది సరైందో కాదో తెలంగాణ ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడం ఇది మొదటిసారి కాదని.. మోసాలకు ఆయన పెట్టింది పేరని దుయ్యబట్టారు. ఖరీఫ్లో రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతుబంధు ఇవ్వాలని భాజపా అనేక నెలలుగా డిమాండ్ చేస్తూనే ఉందని పేర్కొన్నారు.
*జగన్ది తుగ్లక్ పాలన: లోకేశ్
అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. సోమవారం తుళ్లూరులో రాజధాని అమరావతికి మద్దతుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న 24 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసి అమరావతి పోలీసు స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న లోకేశ్.. ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, ఇతర నేతలతో కలిసి స్టేషన్కు చేరుకున్నారు. రైతులను పరామర్శించారు. ఎస్సై రవీంద్ర బాబుతో మాట్లాడి వారిని విడుదల చేయించారు. శాసన మండలిలో బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ గల్లా జయదేవ్పై దాడిని ఖండించారు.
*జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు
దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డు’ పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తాజాగా ప్రకటించారు. దేశంలో ప్రజలందరూ ఈ పథకం ద్వార లబ్ధి పొందాలని మంత్రి కోరారు. అంతకు ముందు జనవరి 1వతేదీ నుంచి దేశంలోని 12 రాష్ట్రాల్లో ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డు’పథకాన్ని అమలు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఏ రాష్ట్రంలో నివాసముంటున్నా దుకాణాల నుంచి రేషన్ సరకులు పొందవచ్చని మంత్రి చెప్పారు.
*సున్నా దేనితో కలిసినా ఫలితం లేదు : విజయసాయి
గుండు సున్నా దేనితో కలిసినా.. విడిపోయినా.. ఫలితం సున్నానే అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘సున్నాను తలపైన ఎత్తుకున్నా.. చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదే పదే నిరూపితమవుతూనే ఉంది. అయినా ప్రయోగాలకు సాహసించేవారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయడమే’’ అని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
*తెలంగాణలో ఆందోళనలు లేకుండా జిల్లాల విభజన
ఏపీలో రాజధాని మార్చుతామంటే ఆందోళనలు జరుగుతున్నాయని, తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాలను విభజించామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ చెప్పారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని, కొత్త జిల్లాలు, మండలాలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. అది కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమైందని తెలిపారు. జనసేన అంతర్జాతీయ పార్టీ అయినా తమకు సంబంధం లేదని, పవన్ కల్యాణ్ ఏం చేసినా ఏపీ ప్రజలే చూసుకుంటారని ఓ విలేకరి ప్రశ్నకు సమాధానమిచ్చారు.
*క్రియాశీల కార్యకర్తలతో త్వరలో పవన్కల్యాణ్ సమావేశాలు
భాజపాతో పొత్తు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్రియాశీల కార్యకర్తలతో త్వరలో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్రెడ్డి, అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్లతో పవన్ సమావేశమయ్యారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం కష్టపడే వారి జాబితాలు తయారు చేయాలని పవన్ సూచించారు. ఉద్యోగాలు, వృత్తుల్లో కొనసాగుతూ పార్టీ కోసం కష్టపడే వారి జాబితాలూ తయారు చేయాలని చెప్పారు. భాజపాతో రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించాలన్నారు
*జగన్ బినామీ ద్వారంపూడి-పంచుమర్తి అనురాధ ఆరోపణ
వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సీఎం జగన్ బినామీ అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రొయ్యల రవాణా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ పాపం పంచుకున్నందుకే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు అయ్యారన్నారు. సీబీఐ అధికారులుగా తనకు నచ్చిన వారినే నియమించమని కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నారని, ఒక నిందితుడు సీబీఐ అధికారులను నిర్ణయించడం చూస్తుంటే దేశం ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదని అనురాధ వ్యాఖ్యానించారు.
*భాజపాలో జనసేనను విలీనం చేసేందుకే: మంత్రి అనిల్
జనసేనను భాజపాలో విలీనం చేయడంలో భాగంగానే ఆ పార్టీతో కలసి పనిచేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నెల్లూరులో మాట్లాడారు. సినిమాకో వేషం వేసినట్లు.. నిజ జీవితంలోనూ పవన్ ఆరు నెలలకో వేషం వేస్తున్నారని ధ్వజమెత్తారు
*భాజపా మోసకారి పార్టీ: తులసిరెడ్డి
భాజపా ఒక మోసకారి పార్టీ అని, అది రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. భాజపాతో పొత్తు కోసం జనసేన, వైకాపా, తెదేపాలు పాకులాడటం శోచనీయమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, రాయలసీమ-ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు.
*రాజధాని పోరుకు రాజకీయ ఐకాస
రాజధాని ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే లక్ష్యంతో రాజకీయ ఐకాస ఏర్పాటైంది. వైకాపా మినహా మిగిలిన పక్షాలన్నీ ఇందులో భాగమయ్యాయి. దీని కన్వీనర్గా దోనెపూడి శంకర్ ఎన్నికయ్యారు. రాజధాని రైతుల పోరాటం నెలరోజులు దాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈనెల 20న ‘చలో అసెంబ్లీ’ విజయవాడ ధర్నాచౌక్ వద్ద నుంచి ప్రారంభమవుతుందని, దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజధాని తరలింపు అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని తెదేపా నాయకుడు పట్టాభిరామ్ విమర్శించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే కమిటీ వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప రాజధానిని మార్చడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరావు ప్రశ్నించారు. కార్యక్రమంలో లోక్సత్తా, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
*పాలమూరు ప్రాజెక్టు’కు జైపాల్ పేరు పెట్టాలి-టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి దివంగత జైపాల్రెడ్డి పేరు పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జైపాల్రెడ్డి 78వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆయన స్మారక ప్రదేశం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. జైపాల్రెడ్డి సమాధికి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడారు. క్రమశిక్షణ, విలువలు కలిగిన వ్యక్తిగా ఆయనను కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచి తెలంగాణ ఖ్యాతిని చాటారన్నారు. సోనియా, రాహుల్గాంధీలను ఒప్పించి తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.
*కేటీఆర్.. ఏం సమాధానం చెప్తారు: లక్ష్మణ్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం ఈ ఆరేళ్ల పాలనలో ఎంత మందికి అందజేసిందో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తేనే యువతకు కొలువులు వస్తాయని చెప్పిన తెరాస ఈ ఆరేళ్ల పాలనలో 20 వేలకు మించి ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. వాటిలో 50 శాతానికిపైగా పోలీసు ఉద్యోగాలే ఉన్నాయని.. అవి కూడా అధికార పార్టీ నేతల రక్షణ కోసమే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పురపాలికలకు కేంద్ర ప్రభుత్వం రూ.1030 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకుండా ఏరకమైన అభివృద్ధికి పాటుపడుతుందని ప్రశ్నించారు. జిల్లాల్లోని నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కువ సమయం జిల్లాల్లో గడుపుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటతప్పారని విమర్శించారు.
*2024లో వచ్చేది మా ప్రభుత్వమే: పవన్
రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై భాజపా పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో భాజపా నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. భాజపాతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు.
*పాచిపోయిన లడ్డూల్లో కిస్మిస్ వేశారా?:అంబటి
ఏ ప్రభుత్వమైనా వైఫల్యం చెందిందని ఏడు నెలల్లో నిర్ణయిస్తారా? అని వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ఎవరూ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై భాజపా, జనసేన నేతలు చేసిన విమర్శలపై అంబటి స్పందించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమపై విమర్శలు చేసినందునే సమాధానం ఇవ్వాలని మీడియా ముందుకొచ్చామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వైకాపా భయపడదని చెప్పారు. తమ పోకడ, పద్ధతులే వేరని వ్యాఖ్యానించారు. ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటిచేత్తో 151 సీట్లు గెలుచుకున్నామని.. సీట్ల విషయంలో కూడికలు, తీసివేతలతో తామెప్పుడూ రాజకీయాలు చేయలేదని చెప్పారు.
*త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించింది ఆరెస్సెస్సే-ఎంపీ అసదుద్దీన్
మూడు రంగుల జాతీయ పతాకాన్ని తయారు చేసే సందర్భంలో ఆరెస్సెస్సే మొదట వ్యతిరేకించిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పెద్దపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీల ప్రస్తావన వచ్చాకే ఎంఐఎం కార్యకర్తలు జాతీయ జెండాను పట్టుకుంటున్నారని భాజపా చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని అన్నారు. సీఏఏకు భయపడే త్రివర్ణ పతకాన్ని చేతపట్టుకుంటున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. సీఏఏలో పేర్కొన అంశాలు ఒక్క ముస్లింలకే కాదని, దేశంలోని పేదలు, దళితులందరికీ ఇబ్బందులను కలిగిస్తాయన్నారు. కేసీఆర్తో మాట్లాడి రాష్ట్రంలో ఎన్నార్సీ, ఎన్పీఆర్ నిర్వహించకుండా స్టే తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
*ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శైలజానాథ్
(పీసీసీ) అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీమంత్రి సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా కడప జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఎన్.తులసిరెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీలను నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల విభాగం ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఈ ముగ్గురినీ నియమించినట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
*ఎంపీ అసదుద్దీన్పై ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిషన్ ఛైర్మన్ మర్రి శశిధర్రెడ్డి, కన్వీనర్ జి.నిరంజన్, సమన్వయ కమిటీ సభ్యుడు రాజేశ్ తదితరులు బుధవారం ఎస్ఈసీ కార్యదర్శి అశోక్కుమార్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో అసదుద్దీన్ ప్రసంగం, సామాజిక మాధ్యమంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.
*తెరాసకు ఓట్లు ఎందుకు వేయాలి: రావుల
ఉద్యోగాలు ఇచ్చారా? రెండు పడకగదుల ఇళ్లు నిర్మించారా? ఇంటి పన్ను తగ్గించారా? రోడ్లను బాగు చేశారా? ఏం చేశారని మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు ఓటు వేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మా పనితీరుకు నిదర్శనం ఈ ఎన్నికలు అంటున్న కేటీఆర్.. రాష్ట్రంలో ‘మనీ తీరు తప్ప, పనితీరు’ ఎక్కడుందో చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికలను తెరాస పార్టీ ప్రలోభాలకు పరాకాష్ఠగా మార్చేసిందన్నారు. 18వ తేదీన హైదరాబాద్లో ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి సతీష్కుమార్ చెప్పారు.
*రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయం సేకరించాలి: కాలవ
రాజధాని అమరావతి మార్పుపై ప్రభుత్వం వెంటనే ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని, అది సాధ్యం కాకపోతే అమరావతి అంశంపై ఎన్నికలు నిర్వహించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
*విశాఖలో రాజధాని వద్దని రాజీనామాలు చేయిస్తారా?
మంత్రి అవంతి శ్రీనివాస్
రాజధానిగా విశాఖపట్నం వద్దని ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? అని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెదేపా అధినేత చంద్రబాబును బుధవారం శ్రీశైలంలో ప్రశ్నించారు. 21 మంది తెదేపా ఎమ్మెల్యేలలో.. కనీసం విశాఖలోని నలుగురితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో తలపడేందుకు రావాలని మంత్రి డిమాండు చేశారు. ఉప ఎన్నికల్లో తెదేపా గెలిస్తే చంద్రబాబు వాదనతో తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
*దేశవ్యాప్తంగా అందరిదృష్టికీ తీసుకెళ్తాం: గల్లా జయదేవ్
దిల్లీలో పోరాటం చేయడం ద్వారా రాజధాని ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టికీ తీసుకెళ్తాం. విశాఖపట్టణాన్ని ఆర్థికనగరంగా అభివృద్ధి చేయడానికి మేం వ్యతిరేకం కాదు. ఇక్కడ 29వేలమంది రైతులు భూములు త్యాగం చేశారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.