Business

కృష్ణా జిల్లాలో మరో పన్నుల డివిజన్

New Tax Collecting Division In Krishna District

జిల్లా వాణిజ్య పన్నుల(రాష్ట్ర పన్నుల)శాఖలో సమూల మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో పన్నుల వసూళ్లకు రెండు డివిజన్లు ఉండగా.. కొత్తగా మరో డివిజన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ 1, 2 సంయుక్త కమిషనర్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలో ఎనిమిది చొప్పున.. జిల్లా మొత్తం కలిపి 16 సర్కిళ్లు ఉన్నాయి. కొత్తగా కృష్ణా జిల్లా రూరల్ పేరుతో మూడో డివిజన్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలోని 16 సర్కిళ్లను 18కి పెంచి.. మూడు డివిజన్లకూ ఆరు చొప్పున కేటాయించాలనేది తాజా ప్రతిపాదన. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రతిపాదనలు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. విజయవాడ డివిజన్ 1 పరిధిలో పార్కురోడ్డు, సామరంగా చౌక్, భవానీపురం, ఇంద్రకీలాద్రి, నూజివీడు, గుడివాడ, ఇబ్రహీంపట్నం, నందిగామ మొత్తం 8 సర్కిళ్లు ప్రస్తుతం ఉన్నాయి. విజయవాడ డివిజన్ 2 పరిధిలో మచిలీపట్నం, ఉయ్యూరు, పటమట, సీతారాంపురం, సూర్యారావుపేట, ఆటోనగర్, కృష్ణలంక, బెంజిసర్కిల్ ఎనిమిది సర్కిళ్లున్నాయి. ప్రస్తుతం ఈ రెండు డివిజన్ల నుంచి మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, నందిగామ, ఉయ్యూరు ఐదు సర్కిళ్లను తప్పించనున్నారు. వీటితో పాటూ కానూరు సర్కిల్ను కొత్తగా ఏర్పాటు చేసి మొత్తం ఆరు కలిపి రూరల్ డివిజన్గా ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. డివిజన్ 2లో ప్రస్తుతం ఉన్న పటమట సర్కిల్ను పూర్తిగా తొలగించి.. దానిని కానూరు పేరుతో కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. డివిజన్ 2లో ఎం.జి.రోడ్డు పేరుతో కొత్త సర్కిల్ను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. గత ప్రభుత్వ హయాంలోనూ కృష్ణా జిల్లా పరిధిలో మూడో డివిజన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. మరో డివిజన్ ఏర్పాటుతో అదనపు ఆదాయం లేకపోగా.. ఖర్చులు ఎక్కువవుతాయనే ఉద్దేశంతో అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం పన్నుల వసూళ్లను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా రూరల్ డివిజన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.