Editorials

మోడీనే కోరుతున్నారని ఇండియాటుడే సర్వే

India Today Survey Reveals Modi Is Most Wanted By Indians

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పోలిస్తే తదుపరి ప్రధానిగానూ నరేంద్ర మోదీవైపే అత్యధికులు మొగ్గుచూపినట్టు ఇండియా టుడే గ్రూప్‌-కార్వీ ఇన్‌సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (ఎంఓటీఎన్‌) సర్వేలో వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీల్లో ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారనేదానిపై ప్రజామోదంలో ఇద్దరికి 40 శాతం వ్యత్యాసం ఉండటం గమనార్హం. తదుపరి ప్రధానిగా 53 శాతం మంది నరేంద్ర మోదీని సూచించగా దేశాన్ని ముందుకు నడపడంలో రాహుల్‌ గాంధీయే సరైన నాయకుడని కేవలం 13 శాతం మంది మాత్రమే వెల్లడించారు. ఇక కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తదుపరి ప్రధానిగా ఉండాలని 7 శాతం మంది అభిప్రాయపడ్డారు.హోంమంత్రి అమిత్‌ షా దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టాలని కేవలం 4 శాతం మంది ఆకాంక్షించారు. నరేంద్ర మోదీకి అసలైన ప్రత్యామ్నాయం ప్రియాంక గాంధీయేనని 3 శాతం మంది ఆమె వైపు మొగ్గుచూపారు. మరోవైపు 60 శాతం మంది హిందువులు, 17 శాతం మంది ముస్లింలు నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కోరగా, రాహుల్‌ గాంధీ నాయకత్వానికి 10 శాతం హిందువులు, 32 శాతం మంది ముస్లింలు జైకొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ భారతంలో 66 శాతం మంది అక్కున చేర్చుకోగా, రాహుల్‌ వైపు కేవలం ఆరు శాతం మందే మొగ్గుచూపారు. 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141 మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌ను ఇండియా టుడే గ్రూప్‌- కార్వీ ఇన్‌సైట్స్‌ నిర్వహించాయి.