DailyDose

రిపబ్లిక్ వేడుకలకు ముఖ్యఅతిధి ఈయనే-తాజావార్తలు

Here is the chief guest for 2020 Indian republic day celebrations-Telugu breaking news

* 2020 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా భారత్ విచ్చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారోకి ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు.
* గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఐకాస, తెదేపా శ్రేణులు రిలేదీక్ష చేపట్టాయి. దీక్షా శిబిరంపై వైకాపా కార్యకర్తలు టమాటా, కోడిగుడ్లతో దాడి చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైకాపా కార్యకర్తల దాడిలో తెనాలి తెదేపా పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ ఖుద్దూస్‌కు గాయాలయ్యాయి. దాడి సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. వైకాపా, తెదేపా శ్రేణుల ఘర్షణతో మున్సిపల్‌ కార్యాలయం పరిసరాలు రణరంగంలా మారాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
* తుమ్మలచెర్వు గ్రామంలో రేషన్ షాప్ లో తెచ్చుకున్న రేషన్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి గ్రామస్తులు వాపోతున్నారు. అన్నం వండుకొని కూలికి పోయిన దగ్గర తినడానికి కుర్చోని తినుంటుంటే మెడగటం లేదు రబ్బర్ వాసన వస్తుంది మిగత వారికి చూపిస్తే అన్నాన్ని ముద్ద కట్టి బండకి కొడితే ఎగురుతుంది. కావున ఇవి ప్లాస్టిక్ బియ్యం అనుకుంటున్నాము. వీటిని ఎంక్వరీ చేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము
* కలియుగ భీముడు కోడి రామమూర్తి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈనెల 27వ తేదీన విజయనగరంలో ని మున్సిపల్ పార్కులో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కోడి రామమూర్తి వ్యాయామ సమాజం అధ్యక్షులు పెనుమజ్జి విజయలక్ష్మి తెలిపారు. 27న ఉదయం కోడి రామమూర్తి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహిస్తామని, అనంతరం బాల బాలికలకు తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభినవ భీమ పెద్ది లక్ష్మీనారాయణ చేత స్టార్ట్ చేసిన రెండు కార్లను కదలకుండా ఆపే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
*తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమరావతి రిలే దీక్ష శిబిరంపై వైసీపీ దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు బైక్‌లతో చక్కర్లు కొడుతున్నారు. శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు.
*నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. శనివారం ఉదయం విజయనగరం పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్థానిక కోట వద్ద నుండి ఆనందగజపతి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్‌ సెంటర్‌లో మానవహారం చేపట్టారు.
*రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం నుంచి అనంతవరం వెంకన్న కొండకు రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పాదయాత్ర మందడం, వెలగపూడి, తుళ్లూరు మీదుగా కొనసాగనుంది. అనంతవరం వెంకటేశ్వర స్వామికి రాజధాని గ్రామాల రైతులు మొక్కులు చెల్లించనున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
*నిర్భయ దోషుల తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను దిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్లు వేసుకునేందుకు అవసరమైన పత్రాలను తీహాడ్‌ జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ వాళ్ల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ నిన్న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శనివారం దిల్లీ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి అజయ్‌ కుమార్‌ జైన్‌ విచారణ జరిపారు. వినయ్‌కు సంబంధించిన డైరీ, పెయింటింగ్స్‌ను తీహాడ్‌ జైలు అధికారులు తనకు ఇవ్వలేదని దోషుల తరఫు న్యాయవాది ఆరోపించారు. దిల్లీ పోలీసుల తరఫున వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మాట్లాడుతూ దోషుల తరఫు న్యాయవాదికి అవసరమైన అన్ని పత్రాలను తీహాడ్‌ జైలు అధికారులు అందించినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.
*జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధుల ప్రతిపాదనల్లో తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రసూతి వైద్యం, శిశు సంరక్షణకు రూ.400 కోట్లు కోరుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తంగా రాష్ట్రానికి రూ.1400 కోట్లను ఎన్హెచ్ఎం నిధులు కేటాయించాలని కోరనున్నారు. ఈ నెల 31న దిల్లీలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ నెల 29నే వైద్యాధికారులు దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రాధాన్యాలను వివరిస్తూ నిధుల కేటాయింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ యోగితారాణా నేతృత్వంలో వేర్వేరు ఆరోగ్య పథకాల అధికారులు పలు ప్రతిపాదనలపై కసరత్తు చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చారు
*మత సామరస్యానికి జాన్పహాడ్ దర్గా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డితో కలిసి మంత్రి ఉర్సు ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన గంధం ఊరేగింపును ప్రారంభించారు.
*హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి-44పై కర్నూలు జిల్లా పరిధిలో అమకతాడు వద్ద ఉన్న టోల్ప్లాజా రికార్డు సృష్టించింది. అత్యధిక శాతం వాహనదారులు ఫాస్టాగ్ చెల్లింపులు చేసినందున ఈ కేంద్రం జాతీయ స్థాయి రికార్డును సాధించగలిగింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు దేశవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారులపై 543 టోల్ప్లాజాలున్నాయి.
*ములుగు జిల్లాను పర్యాటక కేంద్రం(టూరిజం హబ్)గా మారుస్తానని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో హరిత హోటల్ ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్ ఎంపీ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆయన హాజరై ప్రారంభించారు.
* శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ను ఎస్వీబీసీకి ఛైర్మన్‌గా నియమించగా.. ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్‌లో అనుచితంగా సంభాషించారన్న ఆరోపణలతో ఆయన ఇటీవల పదవి నుంచి వైదొలిగారు. ఆయన రాజీనామా అనంతరం ఎస్వీబీసీ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారిలో ఒకరిని ఛైర్మన్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఛైర్మన్‌గా పృథ్వీ తీసుకున్న నిర్ణయాలు ఎస్వీబీసీ ఛానల్‌ ప్రతిష్ఠను దిగజార్చాయని భావించి కొత్త ఛైర్మన్‌ ఎంపికను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఎస్వీబీసీ బోర్డు డైరెక్టర్లుగా సినీ దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, జర్నలిస్టు స్వప్న వ్యవహరిస్తుండగా మరో ఇద్దరు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది.
*తమ విద్యార్థి ఏలూరి కేతన్ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హత పొందాడని, మరో విద్యార్థి భార్గవ సాయికుమార్కు అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయం అందించే రూ. కోటి ఉపకారవేతనం లభించిందని ఫిట్జీ విజయవాడ శాఖ మేనేజింగ్ పార్టనర్ పిన్నెపు రమేష్బాబు తెలిపారు. ఎంజీరోడ్డులోని ఫిట్జీ ఇంటర్నేషనల్ స్కూలులో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు.
*ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల సందర్శనకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామాలకు వెళ్లి అక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఎలా సాగుతోంది? ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారా లేదా? వంటి వివరాలను ఆయన పరిశీలించనున్నారు. వీటిలో అలసత్వం ప్రదర్శించినా, ఏవైనా పొరపాట్లు జరిగినా సంబంధిత అధికారులను బాధ్యులను చేయనున్నారు.
*నీటిపారుదల శాఖలో పనిచేస్తూ, ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న ఇద్దరు ఇంజినీర్ల సర్వీసు పొడిగింపునకు దస్త్రం సిద్ధమైంది. ప్రస్తుతం గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ముఖ్య ఇంజినీరుగా విధులు నిర్వర్తిస్తున్న బంగారయ్య గత ఏడాదే ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సర్వీసును ఏడాది పాటు పొడిగించిన ప్రభుత్వం, రెండోసారీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సిద్దిపేట పర్యవేక్షక ఇంజినీరు వేణు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనుండగా, ఆయన సర్వీసును మరో ఏడాది పొడిగించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ రూపొందించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం
*పారిశ్రామిక అవసరాలు తీరేలా తొలిసారిగా విశాఖ విమానాశ్రయం మీదుగా సరకు రవాణా కోసం ప్రత్యేక కార్గో విమాన సౌకర్యం వస్తున్నట్లు ఏపీ ఎయిర్ట్రావెలర్స్ అసోసియేషన్ (అపాటా) అధ్యక్షుడు కె.కుమారరాజా, ఉపాధ్యక్షులు ఒ.నరేష్, డి.ఎస్.వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్పైస్జెట్కు చెందిన బోయింగ్ 737 విమానం ఫిబ్రవరి మధ్య నుంచి సేవలందిస్తుందని వెల్లడించారు. 20 టన్నుల సామర్థ్యంతో ఈ విమానం చెన్నై – విశాఖ – కోల్కతా మధ్య తిరుగుతుందన్నారు.
*ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్, పీజీసెట్, పీఈసెట్లకు ఈ కమిటీలను నియమించారు. అన్ని కమిటీలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తారు. ఆయా ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సిటీల ఉపకులపతులు కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కన్వీనర్లు సభ్యులుగా ఉంటారు.
*రాష్ట్రంలోని 7 మార్కెట్ యార్డులకు ప్రభుత్వం కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం, గొల్లపూడి కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఆత్మకూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరు, విజయనగరం జిల్లాలోని కురుపాం, గుంటూరు జిల్లాలోని గుంటూరు మార్కెట్ యార్డులకు కొత్త కమిటీలను నియమించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీటికి గౌరవ ఛైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఇటీవల వైకాపాతో సన్నిహితంగా మెలుగుతున్న తెదేపా ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, వల్లభనేని వంశీమోహన్లు గుంటూరు, గన్నవరం మార్కెట్ యార్డులకు గౌరవ ఛైర్మన్లుగా నియమితులయ్యారు.
*కొత్తగా నిర్మిస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో ఐదు స్టేషన్ల పేర్లు ఖరారు చేస్తూ రవాణా, రహదారులు భవనాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు జిల్లా పరిధిలోని పిడుగురాళ్ల న్యూ, నెమలిపురి, కుంకలగుంట, రొంపిచర్ల, వేల్పూరు స్టేషన్ల పేర్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మార్గంలో మొత్తం 32 కొత్త రైల్వే స్టేషన్లు సిద్ధం కానున్నాయి.
*హైదరాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ రాకపోకల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్, గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ఈ నెల 27నుంచి దీన్ని సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్గా మార్చనున్నారు. టెర్మినల్ పాయింట్ను హైదరాబాద్కు బదులుగా సికింద్రాబాద్కు మారుస్తున్నట్లు ద.మ.రైల్వే సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ వెల్లడించారు.సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12.20కి బయల్దేరుతుంది
*మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటనకు వెళ్లనున్నట్టు శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రావత్ ప్రకటించారు. మార్చి 7న సీఎం అయోధ్య వెళ్లనున్నట్టు ఆయన పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడీ’ సంకీర్ణ సర్కారు అధికారంలోకి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా థాకరే అయోధ్య రాముడిని దర్శించుకోనున్నట్టు సంజయ్ రావత్ వెల్లడించారు. ‘‘మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అయోధ్య వెళ్లి శ్రీరాముడిని దర్శించుకోనున్నారు…’’ అని రావత్ వెల్లడించారు. మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు చెందిన మంత్రులు కూడా సీఎంతో పాటు అయోధ్య వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.