Devotional

ఆ ఆలయంలో బంగారం ప్రసాదం

Telugu Devotional News-This Madhya Pradesh Temple Offers Gold As Prasadam

1. ఆ గుడిలో బంగారమే ప్రసాదం – ఆద్యాత్మిక వార్తలు – 25/01
సాధారణంగా గుళ్లలో ప్రసాదంగా ఏమిస్తారు… కొబ్బరిచిప్పలూ, బెల్లం, పులిహోరా, లడ్డూ, కేసరీ, దద్ధ్యోదనం. ఏ ఆలయానికి వెళ్లినా దాదాపు వీటినే భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. కానీ, ఆ గుడిలో ప్రసాదంగా ఏమిస్తారో తెలుసుకుంటే కళ్లు ‘బంగారం’లా వెలిగిపోతాయి.
**ఎందుకో తెలుసా…
ఆ ఆలయంలో బంగారాన్నీ, వెండినే ప్రసాదంగా అందిస్తారు. ఆ ఆలయం ఎక్కడుందీ, ఒక్కసారి వెళ్లొద్దాం అనుకుంటున్నారా… అయితే చదవండి.దీపావళి వేళ లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అంతా మంచే జరగాలంటూ ఎంతో నిష్ఠతో వ్రతాలు నిర్వహిస్తారు. ఆలయాల్ని దర్శించుకుంటూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పూజల అనంతరం లడ్డూ, పులిహోరా తదితరాల్ని ప్రసాదంగా అందుకుంటారు. అయితే… మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయాన్ని దర్శించుకుంటే విలువైన ప్రసాదాన్ని పొందొచ్చు. అదే… అక్కడి మాళ్వా ప్రాంతం రాత్లాంలో కొలువైన మహాలక్ష్మి ఆలయం. సంపన్న మందిరంగా పేరుగాంచిన ఈ ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంలా అలరారుతోంది. దీపావళి సందర్భంగా ఈ ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారికి పూజారులు ప్రసాదానికి బదులుగా బంగారం, వెండి ఉంగరాల్నీ, నాణేల్నీ అందజేస్తున్నారు. **మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉంటుందని…
కొన్ని దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళిని పురస్కరించుకొని ఆలయంలో మూడురోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. పండుగకు ముందు రోజు ఆలయంలో దంతేరాస్‌(ధనత్రయోదశి) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మహాలక్ష్మిని దర్శించుకుని పూజలు చేసిన భక్తులకు తీర్థప్రసాదాల స్థానంలో బంగారం, వెండి ఉంగరాల్నీ, నాణేల్నీ అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రసాదంగా తీసుకున్న వాటిని భక్తులు ఎవరికీ విక్రయించరూ… వాటితో ఇతర ఆభరణాల్నీ తయారు చేయించుకోరూ. తమ ఇంట్లోని పూజగదిలోనో, బ్యాంక్‌ లాకర్లలోనో భద్రపరచుకుంటారు. ఇలాచేస్తే మహాలక్ష్మి తమ ఇంట్లోనే కొలువై ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.
**ఆలయంలో అలంకరణగా…
దీపావళి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు బంగారం, వెండీ ఆభరణాల్నీ, వస్తువుల్నీ, డబ్బునూ అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తారు. మరికొందరు భక్తులు వీటిని ఆలయంలో మూడు రోజుల పాటు ఉంచి పూజలు చేసి అనంతరం ఇంటికి తీసుకెళ్తారు. తమ పిల్లాపాపల్ని చల్లగా చూడాలనీ, సంపద వృద్ధి చెందే భాగ్యం కల్పించాలనీ మహాలక్ష్మిని వేడుకుంటారు. భక్తులు సమర్పించిన కానుకలతో ఆలయ గర్భగుడినీ, ఆలయం లోపలి భాగాల్నీ అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం వంద కోట్లకుపైగా విలువైన కానుకలు వస్తుంటాయి. ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో తెలియదుగానీ… భక్తుల నమ్మకాన్ని కాదనలేక కొన్ని దశాబ్దాలుగా అలాగే కొనసాగిస్తున్నామని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఆలయంలోని కానుకల్ని కాపాడటానికి సీసీ కెమెరాల మధ్య భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల అనంతరం వీటిని ఆలయ కమిటీ సభ్యులు భద్రపరుస్తారు. భక్తులు ఆలయానికి తీసుకొచ్చే ప్రతీ కానుకనూ రిజిస్టర్లలో నమోదు చేస్తుంటారు.
**ఇలా చేరుకోవచ్చు…
రాత్లాంలోని మహాలక్ష్మి ఆలయానికి రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో వెళ్లొచ్చు. రోడ్డు మార్గమైతే భోపాల్‌, ఉదయ్‌పూర్‌, బన్స్‌వార, నీమచ్‌, ఇండోర్‌, ఉజ్జయిని తదితర పట్టణాల నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. దిల్లీ, ముంబయి, అజ్మీర్‌, ఖాండ్వా తదితర ప్రాంతాల నుంచి రైలు మార్గాల్లో రాత్లాం రైల్వే జంక్షన్‌కి వెళ్లొచ్చు. ఇండోర్‌, ఉదయ్‌పూర్‌ ఎయిర్‌ పోర్ట్‌లకు వెళ్లి అక్కడి నుంచి బస్సులూ, ఇతర వాహనాల్లోనూ ఆలయానికి వెళ్లొచ్చు. ఇండోర్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నూట నలభై కిలోమీటర్లు, ఉదయ్‌పూర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి రెండొందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.
2.జగన్మాత సన్నిధిలో..రికార్డు స్థాయిలో ఆర్జిత సేవలు..!
ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవల్లో భక్తులు రికార్డు స్థాయిలో శుక్రవారం పాల్గొన్నారు. దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున అమావాస్య రావడంతో అత్యధికంగా చండీహోమం పూజా టిక్కెట్లు 150 కొనుగోలు చేశారు. 320 మందికి పైగా పూజలో భక్తులు పాల్గొనడంతో యాగశాల ప్రాంగణం కిక్కిరిసింది. వీటితోపాటు ఖడ్గమాలార్చన 11, లక్ష కుంకుమార్చ 16, శ్రీచక్రనవావరణార్చన 15, శాంతి కల్యాణం 12, త్రికాలార్చన 10, రాహుకేతు పూజ 3, సౌభాగ్యప్రదాయని, నవగ్రహశాంతి హోమం, రుద్రహోమం ఒక్కొక్క టిక్కెట్టు చొప్పున విక్రయించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
*అమ్మవారి దర్శనం: ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు పూజ అనంతరం దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వారికి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
*ఆన్లైన్తో పెరిగిన భక్తులు: దుర్గగుడిలో ఆర్జిత సేవలు టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకు రావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పూజల్లో పాల్గొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
3.మేడారం వీడియోకు అమితాబ్ గాత్రదానం
మేడారం మహా జాతర విశేషాలతో వీడియోను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో విడుదలైన ఈ వీడియోలో ఆంగ్లం, హిందీలకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ తన గాత్రాన్ని అందించారు. రెండేళ్లకోసారి జరిగే జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా అభివర్ణిస్తూ జాతరవిశేషాలను ఇందులో వివరించారు. జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో జాతర విశేషాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారు మోగాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించి ప్రచారం చేస్తున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.
*భక్తులకు వెదురు బొంగులు
మేడారం జాతరకు వచ్చే భక్తులకు వెదురు బొంగులను నామమాత్రపు ధరకు ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందుకోసం వెదురు అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అడవిలో మంటలు చెలరేగకుండా, ఎక్కడ పడితే అక్కడ నిప్పు రాజేయకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ పేర్కొంది. పీసీసీఎఫ్ ఆర్.శోభ, వరంగల్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.జె.అక్బర్ మేడారంలో పర్యటించి జాతరకు అటవీశాఖ తరఫున ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు మొక్కలను పంపిణీ చేయనున్నట్లు అక్బర్ తెలిపారు.
4. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు శనివారం 25-01-2020 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….
శ్రీవారి సర్వ దర్శనానికి 04 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వదర్శనానికి 03 గంటల సమయం పడుతోంది….
ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది….
నిన్న జనవరి 24 వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 61,430 మంది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 4.13 కోట్లు…
5. శుభమస్తు నేటి పంచాంగం
తేది : 25, జనవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు రాత్రి 2 గం॥ 55 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(ఈరోజు రాత్రి 3 గం॥ 26 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : (శేషం ఈరోజు ఉదయం 7 గం॥ 59 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 13 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 16 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 6 ని॥ లకు
6. చరిత్రలో ఈ రోజు జనవరి, 25
సంఘటనలు
1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది
1918: రష్యన్ సామ్రాజ్యం నుండి “సోవియట్ యూనియన్” ఏర్పడింది.
1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు
1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.
2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
జననాలు
1874: సోమర్ సెట్ మామ్,బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.
1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత మరియు వ్యాసకర్త. (మ.1991)
1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
1925: పి. అచ్యుతరాం, ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (మ.1999)
1968: నర్సింగ్ యాదవ్, ప్రముఖ తెలుగు సినీ నటుడు.
1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు మరియు నటీమణి.
మరణాలు
1953: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
1991: పి.ఆదినారాయణరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. (జ.1914)
1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
2016: కల్పనా రంజని, ప్రముఖ మలయాళ సినిమా నటి (జ.1965)
పండుగలు మరియు జాతీయ దినాలు
జాతీయ పర్యాటక దినోత్సవం.
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం.
జాతీయ ఓటర్ల దినోత్సవం.
7. ఎక్కడుంటాడు దేవుడు?
‘భగం’ అనే మాటకు ఐశ్వర్యం, జ్ఞానం, కీర్తి, సౌందర్యం, బలం, వీర్యం, ప్రేమ, కాంతి, తపస్సు, వైరాగ్యం… వంటి ఎన్నో అర్థాలు చెబుతాయి నిఘంటువులు. ఇవన్నీ ఎవరియందుంటాయో- ఆయనే భగవంతుడు. ఏ ప్రతిమలోనో లేదా ఒక వ్యక్తిలోనో ఆ లక్షణాలను భావన చేసేవాడు- భక్తుడు. భక్తుడి విశ్వాసం ఎంత బలమైనదో భగవంతుడు అంతటి బలవంతుడు. భావన ఎంత నిజమైనదో దేవుడు అంత నిజం.మనల్ని ఎవరైనా ‘మీరు దేవుణ్ని చూశారా’ అని ప్రశ్నిస్తే కంగారుపడతాం. లేదని చెప్పేస్తాం. ఏడుకొండలూ ఎక్కి మనం దర్శించింది ఆ దేవాదిదేవుణ్నే అనే భావం మనలో స్థిరపడలేదని దాని అర్థం. అదే ఏ నిజమైన భక్తురాలో అయితే తన బిడ్డను పైకెత్తి భగవంతుణ్ని చూపిస్తూ ‘జేజికి దణ్నం పెట్టుకో నాయనా’ అంటుంది. ఆ శ్రీమూర్తిలో ఆమె భగవంతుణ్ని భావన చేసింది కనుక ఆ మాట అనగలుగుతుంది.‘భగవంతుడు దేనియందున్నాడు?’ అన్న ప్రశ్నకు వేదం మహిమలో అని బదులిచ్చింది. ఆ జవాబులో ఎన్నో అర్థాలున్నాయి. లోకంలో చాలాసార్లు నిజమయ్యే విషయమది. ‘విరివిగా నీ మహిమలు చూపిస్తూఉండు. తద్వారా నీ ఉనికిని కాపాడుకుంటూ ఉండు’ అని కాసుల పురుషోత్తమ కవి నేరుగా భగవంతుణ్నే హెచ్చరించాడు. విశ్వాసం కలవారందరికీ మహిమలు నిజం. లేనివారికి అవి కట్టుకథలు. కాబట్టే ‘భగవంతుడనేది ఒక భావన’ అని చాలామంది అభిప్రాయం.దేవుడొక్కడే అని పురాణాలు చెప్పాయి. ‘ఒక్కడా, ఇద్దరా కాదు… ఉన్నదల్లా దేవుడే’ అని సిద్ధ పురుషులు ప్రకటించారు. ఏ దేవుడి ఆరాధనతో అద్భుతమైన సంతృప్తి కలుగుతుందో, ఆ దేవుడే ఆ భక్తుడికి సత్యం. ఒక్కో భక్తుడికి ఒక్కో దేవుడి మీద గురి ఏర్పడుతోంది కాబట్టే హిందూ మతంలో దేవుళ్ల సంఖ్య అధికంగా ఉంటుంది.వాల్మీకి రామాయణంలో హనుమంతుడు భక్తుడే తప్ప భగవంతుడు కాడు. ఆ మాటకొస్తే శ్రీరామచంద్రుణ్నే భగవంతుడిగా చెప్పలేదు మహర్షి. ‘పురుషోత్తముడు’ అనేసి ఊరుకున్నాడు. అయితే, భగం అనే మాటకు నిఘంటువు చూపిస్తున్న లక్షణాలన్నింటినీ వాల్మీకి మహర్షి శ్రీరాముడిలో నిరూపించాడు. ఆయా సందర్భాల్లో రాముడి ప్రవర్తనలోంచి వాటినన్నింటినీ ప్రదర్శింపజేశాడు. ఆ లక్షణాలు ఉన్నందువల్ల రాముడు మనకు దేవుడయ్యాడు. వాటిని రాముడిలో భావన చేసే వారందరూ రామభక్తులయ్యారు. వాల్మీకి రామాయణంలో వానరుడిగా జన్మించి, భక్తుడిగా పరిచయమై విశ్వసించినవారి గుండెల్లో దైవంగా ఎదిగినవాడు హనుమంతుడు. లోకంలో రాముడి కన్నా ఎక్కువ సంఖ్యలో హనుమకు దేవాలయాలు ఏర్పడటం విశేషం.విగ్రహంలో దేవుణ్ని భావన చేస్తూ భక్తితో కొలవడాన్ని ‘ప్రతిమారాధనం’ అంటారు. ఒక కాలంలో ప్రతిమారాధనం అపహాస్యానికి గురైంది. ఒక రాజాస్థానంలో వివేకానంద స్వామికి ఈ చేదు అనుభవం ఎదురైంది. రాతిబొమ్మలకు హిందువులు పూజలు చేస్తారని స్వామి ఎదుట ఎవరో హేళన చేశారు. వెంటనే వివేకానందుడు ఆ రాజుగారి చిత్రపటాన్ని తెప్పించి ఆయన ముందుంచాడు. దానిమీద కాండ్రించి ఉమ్ము వేయమన్నారు. విమర్శకుడు వెనక్కు తగ్గాడు. ‘అది రాజుగారిది’ అన్నాడు. ‘ఇది బొమ్మకాదని మీరెలా అనుకుంటున్నారో, అలాగే అవి రాతిబొమ్మలు కావని, దైవ స్వరూపాలని మేం భావించి పూజిస్తాం’ అని వివేకానందుడు బదులిచ్చి విమర్శకుడి నోరు మూయించాడు.మనిషి భావనామయ జగత్తే భగవంతుడి రాజధాని. మనిషి హృదయమే భగవంతుడి భవ్యమందిరం. గర్భగుడిలో మూలవిరాట్టును కనుగొనడం కోసం చేసే ప్రయాణమే ఆధ్మాత్మిక సాధన!
8. మాఘ మాసం సంధర్భంగా..
చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము .కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత….అంత ప్రాధాన్యత!ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం “అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం చ్చుకోవాలి.ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి.కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి…శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.