DailyDose

మండలిని రద్దు చేయరు-తెదేపా జోస్యం-తాజావార్తలు

TDP MLCs Speaks Of No Chances In Cancelling AP MLC

* దేశ రాజధానిలోని ఏపీ భవన్‌ నంది విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డును సిబ్బంది తొలగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అమరావతి పేరుతో ఏపీ భవన్‌ వద్ద బోర్డు ఏర్పాటు చేసింది. గతేడాది సంక్రాంతి సందర్భంగా ‘ఐ లవ్‌ అమరావతి’ సంక్రాంతి సంబరాలు సెల్ఫీ బోర్డులను రూ.లక్షలు వెచ్చించి ఏపీ భవన్‌ అధికారులు ఏర్పాటు చేశారు. అప్పటి రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ వీటిని ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల సెల్ఫీ బోర్డు తీసేసి.. ఐ లవ్‌ అమరావతి బోర్డును అధికారులు కొనసాగించారు.

* రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చేసిన చరిత్ర తెరాస ప్రభుత్వానిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌ అన్నారు. రాజ్యాంగం రాసిన నాయకునికి ఇంత అవమానం జరుగుతున్నా ఏ నాయకుడూ మాట్లాడటం లేదని ఆయన ఆక్షేపించారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూలగొట్టి చెత్తకుప్పలో పారవేశారని.. దీనిపై ప్రశ్నించిన తనపై కేసులు పెట్టారన్నారని చెప్పారు. కూల్చిన చోటే సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే తనను అడ్డుకున్నారన్నారు. దీనిపై ఆమరణ దీక్ష చేస్తానని.. ఫిబ్రవరి 5లోపు ఆ విగ్రహాన్ని తిరిగి ఇవ్వకపోతే ప్రాణాలర్పిస్తానని ఆయన హెచ్చరించారు.

* పదవులు పోతాయనే భయం తెదేపా నేతలకు ఏమాత్రం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డే మండలిని పునరుద్ధరించినపుడు సీఎం జగన్‌ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తెదేపా ఎమ్మెల్సీలు లేకపోతే రాష్ట్రం ఈపాటికి ముక్కలయ్యేదనే భావన ప్రజల్లో ఉందన్నారు. బెదిరింపులు తప్ప మండలిని ఎట్టిపరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం రద్దు చేయదని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఆ పార్టీలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీలు ఇచ్చారు.. బల్ల గుద్ది చెబుతున్నా మండలిని రద్దు చేయరు’’ అని వ్యాఖ్యానించారు.

* సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేస్తూ ఇటీవల శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ బిల్లుపై రెండు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మండలిలో సభ్యత్వం ఉన్న పార్టీలకు షరీఫ్‌ లేఖ రాశారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు పేర్లు ఇవ్వాలని ఆయన కోరారు. సంబంధిత శాఖా మంత్రులే ఛైర్మన్లుగా 9 మందితో ఒక్కో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు.

* చైనాను కరోనా వైరస్‌ కబళిస్తోంది. ఇప్పటి వరకు 56 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి లక్షణాలు కనిపించేవారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 1000 పడకల ఆస్పత్రిని కేవలం 10 రోజుల్లోనే నిర్మించాలని చైనా నిర్ణయించింది. సూపర్‌ మార్కెట్లు, రెస్టారెంట్లు, హోటల్స్‌లో పాములు, కప్పలు, మొసళ్లు లాంటి వన్యప్రాణులను విక్రయిస్తుంటారు. ఇలాంటి జీవుల వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధరించడంతో అక్కడి ప్రభుత్వం ఆ దిశగా నివారణ చర్యలను చేపట్టింది. వన్యప్రాణుల విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. ఆదివారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.

* భారత మొబైల్‌ మార్కెట్లో వివో సంస్థ మంచి అభివృద్ధి సాధించింది. కౌంటర్‌పాయింట్‌ అనే సంస్థ భారత ఫోన్‌ మార్కెట్‌పై చేసిన సర్వే ప్రకారం.. ‘2019 నాలుగో త్రైమాసిక ఫలితాల్లో వివో 21శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుని శాంసంగ్‌ను దాటి రెండో స్థానంలో నిలవగా.. శాంసంగ్‌ 19 శాతం మార్కెట్‌ షేర్‌తో మూడో స్థానంలో ఉంది. మరోవైపు షావోమీ 27శాతం మార్కెట్‌ షేర్‌తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది’ అని వెల్లడించింది.

* న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో తెలిసిందని, ఆక్లాండ్‌ ఫీల్డ్‌ పరిమాణాలను అర్ధం చేసుకున్నామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. కివీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసినా ఆ జట్టు 132 పరుగులకే పరిమితమైంది. అనంతరం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ మరో మంచి ప్రదర్శనతో భారత బౌలర్లు చెలరేగారన్నాడు.

* జేఎన్‌యూ మాజీ విద్యార్థి, సీఏఏకి వ్యతిరేకంగా దిల్లీ షహిన్‌భాగ్‌లో ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన షార్జిల్‌ ఇమామ్‌పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సీపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్‌ 13న జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మతరపరమైన అల్లర్లకు, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కారణమవుతాయన్న కారణంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

* ఆంధ్రా-ఒడిశా (ఏవోబీ) సరిహద్దులోని ఓ గ్రామంలో యువకుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ బ్లాక్‌ పరిధిలో ఉన్న జొడంబో పంచాయతీ జంతురాయి గ్రామానికి శనివారం అర్ధరాత్రి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని వారు తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు, మావోయిస్టుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరడంతో గ్రామస్థులు మావోయిస్టులపై రాళ్లతో దాడికి దిగారు.

* పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో పల్లె ప్రగతి, మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రులు ఆయనకు జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.

* రేపు జరిగే శాసనసభ భేటీకి హాజరయ్యే అంశంలో తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీడీఎల్పీ భేటీలో నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే రేపటి సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కష్టకాలంలో అండగా ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుందని.. అధికార పార్టీ ప్రలోభాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని చంద్రబాబు నేతలతో చెప్పినట్లు సమాచారం.

* తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులతో ఎన్నికలను గెలవచ్చనే కొత్త తరహా విధానాన్ని తెరాస తీసుకొచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వద్ద డబ్బు లేదని.. ప్రజల ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డిలో రెండు మున్సిపాలిటీలు గెలిచిన ఆర్థిక మంత్రి హరీష్‌రావును అభినందిస్తున్నట్లు చెప్పారు. తన భార్య మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కాకపోవడమే మంచిదైందని.. ఓటర్లు తనమీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

* తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై భూ భౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ స్పందించారు. రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూ ప్రకంపనలు వచ్చాయని, భూకంప లేఖినిపై తీవ్రత 4.6గా నమోదైందని తెలిపారు. భూమి కంపించినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావడమే సురక్షితమని, కట్టడాలు పటిష్టంగా ఉన్నాయో లేవో నిర్ధరణ చేసుకోవాలని సూచించారు. గత కొన్ని రోజులుగా పులిచింతల ప్రాంతంలో భూమిలో కదలికలు ఏర్పడ్డాయని, మరి కొద్ది రోజుల వరకు భూమిలో ఇలాంటి కదలికలు వస్తాయని వెల్లడించారు. ప్రకంపనలకు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.

* దేశ రాజధాని దిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టాయి. బతుకమ్మ, వేయిస్తంభాల గుడితో రూపొందించిన తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శకటంపై గుస్సాడీ, లంబాడీల నృత్యాలు తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని చాటాయి. అనంతరం వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ శకటం ఏడుకొండల వేంకన్న సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల మహత్యాన్ని చాటాయి.

* గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. సీఎం కమల్‌నాథ్‌ హాజరు కావడానికి కాసేపు ముందు ఈ ఘర్షణ జరిగింది. ఇండోర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌ కుంజీర్‌, పార్టీ సీనియర్‌ నేత దేవేంద్ర సింగ్‌ యాదవ్‌ ఒకరికొకరు దూషించుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారు, పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

* వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఏటా పద్మశ్రీ పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శనివారం కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. చలనచిత్ర రంగానికిగానూ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌, ఏక్తాకపూర్‌తోపాటు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కూడా పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ అవార్డును మహిళలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కరణ్‌ జోహర్‌ సైతం పద్మశ్రీ పురస్కారం వరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

* న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌(57; 50 బంతుల్లో 3క్ష్4, 2క్ష్6), శ్రేయస్‌ అయ్యర్‌(44; 33 బంతుల్లో 1క్ష్4, 3క్ష్6) మరోసారి బాధ్యతాయుతంగా ఆడారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేసింది. భారత బౌలర్లు చెలరేగడంతో కివీస్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

* ‘వంద మంది అబ్బాయిలకు 93 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన ఏడుగురిలో మేము ముగ్గురుం ఉన్నాం’ అని అంటున్నారు గెటప్‌ శ్రీను. ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ కామెడీ షోతో ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌. బుల్లితెరలో నవ్వులు పూయించిన ఈ ముగ్గురు.. ఇక వెండితెరపై నవ్వుల వర్షం కురిపించేందకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు కీలకపాత్రలో నటించిన చిత్రం ‘3 మంకీస్‌’. అనిల్ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.