DailyDose

నేటి అసెంబ్లీ సమావేశంపై TNI కధనాలు

AP Assembly Meeting News Coverage Roundup Today

* మండలి రద్దుకు శాసనసభ ఆమోదం
ఏపీ శాసన మండలి రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మండలి రద్దుపై సీఎం జగన్‌ శాసనసభలో ఈరోజు ఉదయం తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు దానిపై చర్చించారు. చర్చలో పాల్గొన్న సభ్యులంతా మండలి రద్దుకే మొగ్గు చూపారు. చివరిగా సీఎం జగన్‌ చర్చలో పాల్గొని మండలి రద్దు తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే కారణాలను వివరించారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఈ తీర్మానంపై ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్‌ కోరారు. సభ్యులంతా లేచి నిలబడగా శాసనసభ సిబ్బంది లెక్కించి అనుకూలంగా 133 మంది ఉన్నట్లు తేల్చారు. తటస్థంగా, వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు.
*3 రాజధానులు..ప్రజల ఆకాంక్ష: ఆళ్ల నాని
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని దీనిపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని సీఎం జగన్‌ చెప్పారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆయనేనని ఆళ్ల విమర్శించారు. తన స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటు ఏపీ ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆళ్లనాని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్యాలరీలో కూర్చొని మండలిని చంద్రబాబు డిక్టేట్‌ చేశారని విమర్శించారు.
**పైశాచిక ఆనందం కోసమే అడ్డుకున్నారు: పేర్ని
శాసనససభ సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి రద్దుపై సభలో చర్చ జరుగుతోంది. పేదల కోసం ముఖ్యమంత్రి జగన్‌ యజ్ఞం చేస్తుంటే కొందరు విషం చిమ్ముతున్నారని ప్రతిపక్ష తెదేపాపై మంత్రి పేర్నినాని మండిపడ్డారు. మండలి వద్దంటూ 2004లో అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ఆయన వినిపించారు. మండలిపై చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో ఆయన మాటల్లోనే అర్థమైందన్నారు. చంద్రబాబు ప్రతి నిర్ణయంలోనూ యూటర్న్‌ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం, పైశాచిక ఆనందం కోసం మండలిలో తెదేపా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.రాయలసీమలో తెదేపాకు కేవలం మూడే సీట్లు వచ్చాయని పేర్ని నాని అన్నారు. మచిలీపట్నం బందరు పోర్టు గురించి ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదని విమర్శించారు. కానీ వైకాపా ప్రభుత్వం మరో నాలుగు నెలల్లో బందరుపోర్టు పనులను ప్రారంభిస్తుందని సభకు తెలిపారు.
**101 దేశాల్లో పెద్దల సభలు లేవు: ధర్మాన
ప్రజలు తిరస్కరించిన వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనమండలి రద్దుపై అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ 67 దేశాల్లో మాత్రమే ఎగువ సభలు ఉన్నాయని, 101 దేశాల్లో పెద్దల సభలు లేవని అన్నారు. బ్రిటీషర్ల ప్రోత్సాహంతోనే ఈ సభలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పెద్దలను గౌరవిస్తున్నామన్న పేరుతో దేశానికి కన్నంపెట్టే పనిచేశారని విమర్శించారు. బ్రిటీష్‌ వాళ్ల వైఖరిని మహాత్మాగాంధీ తీవ్రంగా తప్పుపట్టారని ధర్మాన చెప్పారు. ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలని ఆనాడే విమర్శలు వచ్చాయని, ఇలాంటి అభివృద్ధి నిరోధక వ్యవస్థ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. శాసనమండలి లేని రాష్ట్రాల్లో కొంపలు మునగడం లేదని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
*అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన
బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పెద్దల సభను ఏర్పాటు చేశారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయాన్ని గమనించి స్వాతంత్ర్యానికి ముందే జాతిపిత మహాత్మా గాంధీ ఈ సభను వ్యతిరేకించారని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదని తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయపరమైన కారణాలతో చట్టాలు ఆలస్యమవుతున్నాయి కాబట్టి మండలి రద్దు సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారి రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిందని.. అటువంటి సభ అవసరం లేదని గతంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని పేర్కొన్నారు.
*ఆయన దేశంలోని 4వ బెస్ట్‌ సీఎం..: రోజా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోని 4వ బెస్ట్‌ సీఎంగా ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. సోమవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ శాసనమండలిలో టీడీపీ అనుసరించిన తీరు అత్యంత హేయమని విమర్శించారు. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో ఉండి ఆదేశించారని, చంద్రబాబు అధికారం కోల్పోయినా అహంకారంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తన దగుల్బాజీ రాజకీయాన్ని ఎక్కడ నిలదీస్తారో అని… చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారన్నారు. మండలి రద్దు కాదని భావించినప్పుడు ఎందుకు పారిపోయారని రోజా ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా? అని అన్నారు. పెద్దల సభకు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను చంద్రబాబు పంపారని విమర్శించారు.
* మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీ శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో కేబినెట్ తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత తీర్మానం ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు. READ ALSO మండల్లి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం ఏపీ శాసనమండలి రద్దు ఆలోచన: మంత్రి బొత్స ఏపీ శాస‌న‌ మండ‌లి-చరిత్ర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1958లో ఆర్థికల్‌-198 కింద జూలై 1న శాసన మండలి ఏర్పాటైంది. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1958 జులై 8 శాసన మండలిని అధికారికంగా ప్రారంభించారు. మండలి ఆవిర్భవించిన 27ఏండ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ 1983లో గెలుపొందిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1985లో శాసన మండలి రద్దు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పుడు మండలిలో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీ కొత్తగా ఆవిర్భవించడంతో మండలిలో టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించే సభ్యుడు ఒక్కరు కూడా లేరు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడం, బిల్లులు ఆమోదం పొందడం ఆలస్యం కావడం, వీటితో పాటు మండలి వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఎన్టీఆర్‌ మండలి రద్దు చేయాలని నిర్ణయించారు. మండలి రద్దుతో చాలామంది రాజకీయ నిరుద్యోగులయ్యారు. అనంత‌రం ఉమ్మడి రాష్ట్రంలో 1989 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మండలి పునరుద్ధరణకు అప్పటి ముఖ్యమంత్ర మర్రి చెన్నారెడ్డి ప్రయత్నాలు మొదలెట్టారు. 1990లో మండలి పునరద్ధరణ కోసం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. అప్పటి నుంచి పలు సాంకేతిక కారణాల వలన మండలి పునరుద్ధరణ ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. 2004లో మండలి పునరుద్ధరణకు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2004 జూలై 8న మండ‌లి పునరుద్ధరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. 2004 డిసెంబ‌ర్ 16న లోక్‌స‌భ‌లో ప్రవేశపెట్టగా 2006 డిసెంబ‌ర్ 15న బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. వెంట‌నే డిసెంబ‌ర్ 20న రాజ్యసభ కూడా బిల్లుకు ఆమోద‌ముద్ర వేసింది. 2007 జ‌న‌వ‌రి 10న రాష్ట్రప‌తి కూడా ఆమోద‌ముద్ర వేయ‌డంతో కొత్తగా శాస‌న‌మండ‌లి 2007 మార్చి 30న అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ రామేశ్వ‌ర్ ఠాకూర్ ప్రారంభించారు. ఉమ్మ‌డి ఏపీలో మండ‌లి సభ్యుల సంఖ్య 90 మంది ఉండ‌గా.. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీలో ఎమ్మెల్సీల సంఖ్య 58గా ఉంది. ఆరు సంవ‌త్స‌రాలు మండ‌లి స‌భ్యుల కాల‌ప‌రిమితి కాగా.. ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మూడ‌వ వంతు స‌భ్యుల కాల ప‌రిమితి ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త స‌భ్యుల‌ను ఎన్నుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ 58 మందిలో 8 మందిని గ‌వ‌ర్న‌ర్ నియ‌మిస్తారు. 40 మంది స‌భ్యుల‌ను శాస‌న‌స‌భ్యులు, స్థానిక సంస్థ‌ల నుంచి ఎన్నుకుంటారు. వీరిలో 10 మంది ఉపాధ్యాయ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎన్నిక‌వుతారు. 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వైసీపీకి ఏపీ శాస‌నమండ‌లిలో మాత్రం 58 స్థానాల‌కుగాను కేవ‌లం 8 మంది మాత్ర‌మే ఉన్నారు. టీడీపీకి 31, పీడిఎఫ్‌కు 3, నామినేటెడ్ 8, బిజేపీ 2, స్వంతంత్రులు ఐదుగురు ఉన్నారు. మ‌రో స్థానం ఖాళీగా ఉంది. మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానం ఆమోదానికి దాదాపు 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. శాసనసభలో మెజార్టీ ఉన్నప్పటికీ..మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినా.. తుది ఆమోదం వచ్చే వరకూ ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియనే కొనసాగించాల్సి ఉంటుంది. మండలిలో ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. కానీ, ఇంకా కమిటీ ఏర్పాటు చేయలేదు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం సభ్యుల పేర్లు ఇవ్వాలని మండలి చైర్మన్ రాసిన లేఖలు ఈ రోజు పార్టీలకు చేరనున్నాయి. మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుండి సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి మూడు నెలల నుండి సాధ్య మైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మండలి రద్దు తీర్మానం ఆమోదించటంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందని..మూడు నెలల నుండి సాధ్యమైంత త్వరగా నివేదిక కమిటీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో మండలి సమావేశాలు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు యధాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో..బిల్లుల సైతం కమిటీ తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి నివేదిక ఇవ్వటంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని టీడీపీ నేత యనమల స్పష్టం చేస్తున్నారు.
* అన్నీ ఆలోచించే మండలి రద్దు నిర్ణయం:జగన్‌
పార్టీగా తమకున్న అవకాశాల కన్నా కూడా ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యమని అందుకే మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలి రద్దుపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘మండలి కచ్చితంగా అవసరం’ అని రాజ్యాంగంలో లేదని చెప్పారు. మండలి అవసరమా? లేదా? అన్నది అసెంబ్లీనే నిర్ణయిస్తుందన్నారు.కేబినెట్‌ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుందని.. మండలి అవసరమైతే కచ్చితంగా ఉంచేలా రాజ్యాంగంలో పెట్టేవారని జగన్‌ వ్యాఖ్యానించారు. మండలి రద్దు అధికారాన్ని అసెంబ్లీకే ఇచ్చారన్నారు. 28 రాష్ట్రాల్లో ఆరు చోట్ల మాత్రమే మండలి ఉందని.. అన్ని అంశాలను ఆలోచించి, ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. అసోం, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలు మండలిని రద్దు చేశాయనని జగన్‌ చెప్పారు. రాజకీయ కోణంతోనే మండలిలో బిల్లులను తెదేపా అడ్డుకుంటోందన్నారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబుపై జగన్‌ విమర్శలు గుప్పించారు. గతంలో పలు సందర్భాల్లో మండలిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సభలో ప్రదర్శించారు.
* అసెంబ్లీ మీడియా పాయింట్ ఎమ్మెల్యే రోజా కామెంట్స్…
పెద్దల సభ సలహా లు ఇచ్చే విధంగా వుండాలి. కానీ వివాదం సృష్టించే విధంగా వుండరాదు. పెద్దల సభ అంటే పెద్దలను సభకు పంపించాలని కానీ దద్దమ్మలను తద్దొజనాలను పంపించరాదు. వ్యవస్థ లోను బ్రస్టు పట్టించడం లో చంద్రబాబు డ్రైవర్ అయితే అయనకు స్టీరింగ్ యనమల రామకృష్ణుడు. చంద్రబాబు నాయుడు శాసన మండలి లో ఎదురుగా ఛైర్మన్ ను కూర్చొని ప్రభావితం చేశాడు. శాసన మండలి ని రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి ని గట్టిగా అడుగుతా. 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపించితే శాసన మండలి లో ఆలస్యం చేయటం సరికాదు. లొకేష్ తీరు చూస్తే బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లు వుంది.కోసి ఉప్పు కారం పూసి కూర వాడుకుంటారు. దమ్నుంటే శాసన మండలి రద్దు చేయమని లొకేష్ అనటం అలాగే వుంటుంది. యనమల రామకృష్ణుడు ప్రపంచ మేధావిని అని ఫీలవుతున్నాడు.