Devotional

వైభవంగా రధసప్తమి వేడుకలు

1.తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా రధసప్తమి వేడుకలు – ఆద్యాత్మిక వార్తలు – 01/02
అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. ఈ వేడుకలను స్వత్వానంద సరస్వతి ప్రారంభించారు. శనివారం ఉదయం అరసవల్లి స్వామిని మంత్రి కృష్ణ దాస్‌, స్పీకర్‌ తమ్మినేని, ఎంఎల్‌ఎ అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. అరసవల్లి ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులు, ఏర్పాట్లు చేయడంలో అధికారులు, నిర్వాహకులు విఫలమయ్యారంటూ.. యాత్రికులు అసహనాన్ని వ్యక్తపరిచారు. అంతరాలయంలో యాత్రికులు కిక్కిరిసిపోయారు. పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారంటూ.. కొందరు ఆవేదన చెందారు. ఉత్సవాల దాతలు కూడా అసహనాన్ని వ్యక్తపరిచారు. క్యూ లైన్లలో పడిగాపులు పడలేక బైఠాయించి ఆవేదన వ్యక్తపరిచారు.వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు లేకపోవడంతో సాధారణ క్యూ లైన్‌లోనే తోపులాటల మధ్య వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. వికలాంగులకు అధికారులు మొండిచేయి చూపించారని, ఏమి చేయలేని పరిస్థితితో సాధారణ క్యూలైన్లో నిలబడి నానా అవస్థలుపడుతున్నామని వికలాంగులు ఆవేదన చెందారు. భక్తులు మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది భక్తులు తగ్గారని చెప్పారు. ఆకాశంలో మబ్బులు పట్టడంతో ఆదిత్యుడు కనిపించలేదని అన్నారు. మరోవైపు వర్షం కురుస్తుందని, ఏర్పాట్లు ఏవీ సరిగ్గా లేవని అన్నారు. విఐపి లకు, పోలీసుల కుటుంబాలకు మాత్రమే దర్శనాలు ఇస్తున్నారని, దాతలకు, సామాన్య భక్తులకు పడిగాపులు తప్పడం లేదని ఆవేదన చెందారు.
2. రథసప్తమికి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
రథస్తమి పర్వదినం సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయ.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారికి నిర్వహించిన సప్తవాహన సేవలలోను, తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో నిర్వహించిన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవల ముందు ఏర్పాటు చేసిన కళాబృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. తిరుపతి పరిసర ఆలయాలలో దాదాపు 37 గ్రూపులలో 750 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో చెక్కభజనలు, కోలాటాలు, చిడతలు, అడుగుల భజన, వెంకన్న భజనలతో వివిధ కళా ప్రదర్శనలు ఇచ్చారు.
3. భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు
రథసప్తమిని పురస్కరించుకొని టిటిడి అనుబంధ ఆల‌యాలలో వాహన సేవలు వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ శ‌నివారం ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు నిరంత‌రాయంగా శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు. దాదాపు 236 మంది శ్రీవారి సేవకులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం, శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యం, ఇత‌ర అనుబంధ ఆల‌యాల‌లో అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్‌ విభాగాలకు సంబంధించిన వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. శ‌నివారం ఉదయం నుండి మాడ వీధులలో వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. టి.టి.డి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ముద్రించిన రథసప్తమి, గోవిందనామాలు, సుప్రభాతం, లలితాసహస్రనామం, విష్ణు సహస్రనామం పుస్తక ప్రసాదాలను కూడా శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.
4. నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆయంలో ఘ‌నంగా ర‌థ‌స‌ప్త‌మి
సూర్యజయంతిని పురస్కరించుకొని నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో శ‌నివారం ర‌థ‌స‌ప్త‌మిని వైభ‌వంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ర్వ‌హించారు. నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు సూర్యప్రభ, స, తిరుచ్చి, కల్పవృక్ష వాహనం, తిరుచ్చిపై స్వామివారు ఊరేగి భక్తులను క‌టాక్షించారు. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి హ‌రిప్రియ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నంద‌కుమార్‌, శ్రీ ఉద‌య్ కుమార్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు
5. సప్తవాహనాలపై ఊరేగి భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి
సూర్యజయంతిని పురస్కరించుకొని నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాని శ‌నివారం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఉదయం సూర్యుని కిర‌ణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామి, అమ్మ‌వార్ల‌పై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి హ‌రిప్రియ‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
6. టిటిడి స్థానిక ఆలయాలలో వైభ‌వంగా రథసప్తమి
టిటిడి అనుబంధ ఆల‌యాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, న‌గ‌రిలోని శ్రీక‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యం, స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యాల్లో రథసప్తమి పర్వదినాని శ‌నివారం అత్యంత‌ వైభంవ‌గా నిర్వ‌హించారు.
*అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్లు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. కాగాసాయంత్రం 4.00 నుండి 5.00 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌లసేవ‌, సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు ఉత్సవం ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

*కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో….
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉద‌యం 6.30 నుండి 8 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ‌ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కుమార్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
*న‌గ‌రిలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యంలో ……
న‌గ‌రిలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌రియ మాణిక్య‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం వైభ‌వంగా జ‌రిగింది. సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆర్జిత క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు.
*స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో…..
స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సూర్య‌ప్ర‌భ వాహ‌నం ఊరేగి భక్తులను కటాక్షించారు. కాగా సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌ప్‌వభ వాహ‌నం గ్రామోత్స‌వం చేప‌డ‌తారు.
7. ఫిబ్రవరి 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఫిబ్రవరి 2న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 3న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 5న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 6, 7, 8వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
7. భక్తజన గుడారం!
మహాజాతర కోసం మేడారం ముస్తాబయ్యింది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ముందస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మలు వనం వదిలి జనంలోకి అడుగిడే మహాఘట్టాలను తిలకించేందుకోసం అంతా ఆతురుతగా ఉన్నారు. గద్దెలనెక్కిన తల్లులు భక్తకోటిని ఆశీర్వదిస్తున్న వేళ ఉప్పొంగిన భక్తిపారవశ్యంతో మేడారం నలుమూలలు శిగమూగుతాయి. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వస్తున్నా… ప్రధానంగా నాలుగు రోజులపాటు జరిగే జాతరలో క్షణక్షణం భక్తిమయమై రోజుకో మహాఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఆ అడవిపల్లె భక్త్తిశిఖరంపై దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ‘అసలు జాతరలో ఆ నాలుగు రోజులు ఏం జరుగుతుంది’ అనే ఆసక్తి సహజంగానే చాలామందికి ఉంటుంది. మేడారంలో నాలుగురోజుల మహాఘట్టం ఎలా ఉంటుందంటే…
*తొలి రోజు (ఫిబ్రవరి 5)
కన్నెపల్లి వెన్నెల సారలమ్మ గద్దెలకు వచ్చే రోజిది. ఇదే రోజున పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలకు వస్తారు. కన్నెపల్లిలోని ఆలయం నుంచి సారలమ్మ ప్రతిరూపాన్ని ప్రధాన పూజారి కాక సారయ్య గద్దెకు చేర్చుతాడు. ఉదయం నుంచే అటు కన్నెపల్లిలో, ఇటు మేడారంలో సందడి నెలకొంటుంది. ప్రతీ గడపా అలుకుపూతలు, మామిడి తోరణాలతో సారలమ్మకు స్వాగతం పలుకుతుంది.సాయంత్రం సూర్యాస్తమయం జరుగుతుండగా సారలమ్మను గద్దెకు తీసుకువచ్చే ఘట్టం ప్రారంభమవుతుంది. ఆలయంలో ప్రత్యేక పూజల సమయంలో తల్లి ఆవహించిన వెంటనే సారయ్యతోపాటు పూజారులు 4 కిలోమీటర్ల దూరంలోని మేడారానికి బయలుదేరుతారు. వీరికి భారీ పోలీసు బందోబస్తు కల్పిస్తారు. తల్లి ఆశీస్సుల కోసం తడిబట్టలతో భక్తులు ఆలయం బయట సాగిలపడుతారు. సంతానం కోసం వరంపడుతారు. వారిపై నుంచి తల్లిరూపాన్ని తీసుకొని పూజారులు మేడారానికి పరుగులు తీస్తారు. తల్లికి కన్నెపల్లిలోని ప్రతీ ఆడబిడ్డ నీళ్లారబోసి పూజలు చేస్తుంది. వడ్డెలు(పూజారులు) జంపన్నవాగును దాటుతూ మేడారానికి చేరుకుంటారు. భక్తులు, శివసత్తులు, కోయ కళాకారులు నృత్యాలు చేస్తూ ముందు నడుస్తారు. సారలమ్మ ప్రతిరూపాన్ని గద్దెపై ప్రతిష్టించడంతో జాతర ప్రారంభమవుతుంది. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలైన పడిగెలు గద్దెలపైకి చేరుకుంటాయి. ఈ ముగ్గురు దైవాలు తల్లి సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తారు.
*రెండో రోజు (ఫిబ్రవరి 6)
మేడారం జాతర మొత్తానికి అపూర్వఘట్టం ఇదే రోజున ఆవిష్కృతమవుతుంది. చిలుకలగట్టుపై ఉన్న సమ్మక్క గద్దెకు వచ్చేది ఈరోజే. ఉదయమే పూజారులు గద్దెను వనంతో(వెదురు) కొలుస్తారు. అడేరాలు, పసిడికుండలు తెచ్చి గద్దెలపై నిలుపుతారు. సాయంత్రం తల్లిరూపమైన కుంకుమభరిణెను తెచ్చేందుకు చిలుకలగట్టుకు బయలుదేరుతారు. గట్టుపైగల రహస్యప్రదేశంలోని నెమలినార చెట్టువద్దగల కుంకుమ భరిణెను తెచ్చేక్రమంలో పూజారులు ప్రత్యేకపూజలు చేస్తారు. ఈ సమయంలో మేడారమంతా సమ్మక్క నామస్మరణే. చిలుకలగట్టు దారి ఇసుకపోస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. అందరిచూపూ తల్లికోసమే తండ్లాడుతుంది.
ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మిగతా పూజారులు సమ్మక్కను తీసుకొని గట్టు దిగుతుండగా జిల్లా ఎస్పీ ఏకే-47 తుపాకీతో గాల్లోకి నాలుగురౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పిస్తారు. అంతే ఈ శబ్ధం వినగానే జై సమ్మక్కా.. అనే నినాదాలతో మేడారం పరిసరాలు మార్మోగుతాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య సమ్మక్క రూపాన్ని పూజారులు గద్దెపై ప్రతిష్టిస్తారు. ఈక్రమంలో పూజారులను తాకితే పాపాలన్నీ హరించుకుతాపోతాయని భావించే భక్తులను నిలువరించడం పోలీసులకు కష్టంగా మారుతుంది. సమ్మక్క వస్తున్న తరుణంలో భక్తులు భారీగా జంతుబలులిస్తారు. ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు.
*మూడో రోజు (ఫిబ్రవరి 7)
మూడో రోజు మొక్కులకు ప్రత్యేకం. తల్లీబిడ్డలిద్దరూ గద్దెలపై ఉన్న ఆరోజున అశేష భక్తులు గద్దెలను దర్శించుకుంటారు. ఎత్తుబెల్లం, పసుపుకుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. కానుకలు చెల్లించి కరుణించమని వేడుకుంటారు. అర్థరాత్రి మొదలైన మొక్కుల జోరు ఆరోజంతా కొనసాగుతాయి. జాతర మొత్తంలో ఈ రోజుకోసం ఎదురుచూసే భక్తులు తల్లులకు మొక్కులు ముట్టజెప్పి తిరుగు ప్రయాణం అవుతారు.
*నాలుగో రోజు (ఫిబ్రవరి 8)
భక్తకోటి పూజలందుకొని ఆశీర్వదించిన దైవాలు మరో రెండేళ్ల నిరీక్షణను మిగుల్చుతూ వనప్రవేశం చేస్తారు. దేవతా రూపాలను పూజారులు సాయంత్రం వేళ వారివారి స్థావరాలకు చేర్చడంతో జాతర ముగుస్తుంది. ‘.పోయొస్తాం సమ్మక్కా.. రెండేళ్లకు మళ్లొస్తాం’.. అంటూ భక్తులు మూటముల్లె సర్దుకొని గుండెలనిండా మధురానుభూతులను నింపుకొని భారంగా ఇంటికి పయనమవుతారు. అప్పటివరకు జనారణ్యమైన మేడారం క్రమంగా పలచబడిపోయి నిర్మాణుష్యంగా మారుతుంది.
8. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు
శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 14వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సరిపడా ప్రసాదాలు అందించేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 30 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు. ఇందుకు అవసరమైన వస్తు సామగ్రిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 9వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలకు లడ్డూ ప్రసాదాల తయారీని ముమ్మరంగా చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికోసం 125 మంది అదనపు సిబ్బంది విజయవాడ ప్రాంతాల నుంచి రానున్నారు. వీరితో పాటు మరో 125 మంది సిబ్బంది విక్రయ కేంద్రాలకు తరలించే విధులు నిర్వర్తించనున్నారు. దేవస్థానం తరఫున 35 మంది లడ్డూలను తయారు చేయనున్నారు. 1035 లడ్డూల తయారీకి 25 కిలోల శనగపిండి, 45 కిలోల చక్కెర, 16 కిలోల నెయ్యి, 1.900 కిలోల జీడిపప్పు, 1.750 కిలోల ద్రాక్ష, 0.190 గ్రాముల యాలకులు, 30 గ్రాముల పచ్చికర్పూరం, 40 గ్రాముల జాజికాయలను వినియోగించనున్నారు. దిట్టం ప్రకారం 30 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేసి భక్తులకు విక్రయించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో పరిమితి లేకుండా భక్తులకు ప్రసాదాలను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు సిబ్బంది చెప్పారు.
9. సర్వమత సమ్మేళనం… సమస్తం భక్తిపారవశ్యం
ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఆయా మతాల పవిత్ర స్థలాల నిర్మాణాలను చేపట్టారు. హిందువులకు దేవాలయాలు, క్రైస్తవులకు సీఎస్ఐ చర్చి, ముస్లిం సోదరులకు ఈద్గాల నిర్మాణాలు చేపట్టారు. దాదాపుగా మూడున్నర ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో బాసర తరువాత ఎక్కడ లేని విధంగా ఇక్కడ సరస్వతి ఆలయ నిర్మాణం చేపట్టారు. సహజ సిద్ధంగా శివకోనేరు, వాటితోపాటి విష్ణుకోనేరు నిర్మాణం చేపట్టారు. సీతారామాలయం, శివపార్వతులు, విఘ్నేశ్వర ఆలయాల నిర్మాణాలతోపాటుగా గ్రామ దేవతలు ముత్యాలమ్మ, మైసమ్మ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ఫిబ్రవరి 1నుంచి 5వరకు ఆలయాల ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు.
**పెద్దతండా టీఎన్జీవోస్కాలనీలో ఉద్యోగ సంఘాలు, హౌసింగ్ సొసైటీ సభ్యులు అందరూ కలిసి కాలనీలో అన్ని మతాలకు అనుగుణంగా ఆలయాల నిర్మాణాలను ప్రారంభించారు. హిందువులకు దేవాలయలు, క్రైస్తవులకు సీఎస్ఐ చర్చి, ముస్లిం సోదరులకు ఈద్గాల నిర్మాణాలను చేపట్టారు. చర్చిని మార్చిలో, ఈద్గాను ఏప్రిల్లో ప్రారంభించనున్నారు. హిందూ దేవాలయాలు మాత్రం నేటి నుంచి అయిదు రోజలపాటు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు.
***ఆలయాలు ఇవీ…
* సీరామలక్ష్మణ ఆలయం. ఎదురుగా హనుమంతుని ఆలయం ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. హనుమంతుడి విగ్రహం(వాయిప్రతిష్ట) ఏర్పాటు చేశారు.
* అమరలింగేశ్వరస్వామి సహిత పార్వతీదేవి గణపతి ఆలయం, ఎదురుగా ధ్వజస్తంభం, నందీశ్వర విగ్రహం ఉంది.
* జ్ఞానప్రసూనాంబ (సరస్వతిదేవీ) ఆలయం, ఎదురుగా ధ్వజస్తంభం, సరస్వతిదేవి (వాయిప్రతిష్ఠ) ఏకశిలా విగ్రహం, పక్కనే దేవతామూర్తుల కల్యాణ మండపం నిర్మాణం చేపట్టారు. సుమారు 4వేల మంది కల్యాణం వీక్షించే విధంగా మండప నిర్మాణం చేపట్టారు. కల్యాణ మండపం పక్కనే విష్ణుకోనేరు నిర్మించారు.
* శశ్విత యాగశాల, యాగశాలకు ఎదురుగా లక్ష్మీనరసింహాస్వామి(వాయిప్రతిష్ఠ) 13అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు.
* ఆలయ సముదాయాల్లో నవగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు.
* ఆలయాల పక్కనే టీఎన్జీవోస్ ఫంక్షన్హాల్ రెండువేల మందికి సరిపోయే విధంగా నిర్మాణం చేపట్టారు.
* ఆలయాలకు ఎదురుగా గోశాల, పూజారుల నివాసాలను నిర్మించారు. శివకోనేరు: సహజసిద్ధంగా లోతట్టు ప్రాంతంలో శివకోనేరు ఏర్పాటు చేశారు. లోతు దాదాపు 60అడుగుల పైనే ఉంటుంది. కోనేరు వద్ద శివుని విగ్రహం తలపై గంగాదేవి నిత్యం గంగతో శివునికి అభిషేకం చేస్తూ ఉంటుంది.
**గ్రామదేవతలు
* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా గ్రామ దేవతలు ముత్యాలమ్మ, మైసమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
* కల్యాణ కట్ట, మరుగుదొడ్లు కూడా ఉన్నాయి.
* ఆలయ సముదాయాలకు నాలుగు వైపుల రహదారులు ఉన్నాయి.
చర్చి: సీఎస్ఐ చర్చి నిర్మాణం చేపడుతున్నారు. రెండంతస్తుల నిర్మాణం చేశారు. మార్చిలో ప్రారంభించనున్నారు.
ఈద్గా: చర్చికి ఎదురుగా ఈద్గా నిర్మాణం చేపడుతున్నారు. ఏప్రిల్లో ప్రారంభించనున్నారు.
10. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనున్న బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌
చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో ఒకటైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ గుడి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న తెరుచుకోనుంది. తెల్లవారుజామున 4:30 గంటలకు వేద మంత్రాల మధ్య ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని బద్రీ–కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెంపుల్‌‌‌‌‌‌‌‌ కమిటీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ తాప్లియాల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. శీతాకాలంలో మంచు కారణంగా ఆలయాన్ని దాదాపు ఆరు నెలల పాటు మూసేస్తారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో మంచు ఎక్కువగా కురవడంతో చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధామ్‌‌‌‌‌‌‌‌ యాత్రలో భాగమైన కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌, బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కూడా మూసేస్తారు.
11. చిన్నశేషవాహనంపై శ్రీనివాసుడు
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా తొలుత సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు 9గంటలకు చిన్న శేషవాహనంపై మాడవీధుల్లో విహరించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
వాహన సేవలను వీక్షించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని భక్తులు ..వాహన సేవలను వీక్షిస్తున్నారు.
12. తిరుచానూరులో కనులపండువగా రథసప్తమి వేడుకలు
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. శనివారం రథసప్తమి సందర్భంగా అమ్మవారు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా పద్మావతీ దేవి ఉదయం సూర్యప్రభ వాహనంపై అధిరోహించి మాడవీధుల్లో విహరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహనం ముందు భజనబృందాల కోలాటాలు, చెక్కభజనలు భక్తులను అలరించాయి. అమ్మవారు నేడు హంసవాహనం, అశ్వ, గరుడ, చిన్నశేష, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తారు. రాత్రికి జరిగే గజ వాహన సేవతో అమ్మవారి వాహన సేవలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
13. మంచి మాటలుశుభోదయం
ఎవరైనా ఒక్కసారి ఏదైనా చెప్పినపుడు…
ఈ చెవిలో చెప్పింది ఆ చెవిలోంచి వదిలేయకుండా…
అవతలి వాళ్ళ మనస్తత్వం ఇలాంటిది అని జీవితాంతం గుర్తుంచకోవాలి.
ఈ ప్రపంచంలో మంచికి దారి తీసే మార్గం కఠోరమైనది…
అమిత ప్రయాసలతో కూడుకున్నది…
మంచి వాళ్లకే పరీక్షలు ఎక్కువ.
చితి… ప్రాణంలేని కట్టెను కాలుస్తుంది…
దిగులు… ప్రాణం ఉన్న మనిషిని నిలువునా కాలుస్తుంది.
మోసగాడ్ని గుర్తించకపోతే ఒక్కసారి మోసపోతావేమో…
కానీ మంచివాడ్ని గుర్తించలేకపోతే జీవితాంతం నష్టపోతావు.
14. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సూర్య జయంతి ఉత్సవాలు మెుదలయ్యాయి.
అర్ధరాత్రి నుంచే అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది.తిరుమల రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యాస్తమయం వరకు 7 వాహనాలపై శ్రీవారు విహరిస్తారు.
15. రథసప్తమి – విశేషాలుఓం ఆదిత్యాయ నమః రథసప్తమి
ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 #తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి
యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||
అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.
సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర
ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి #దేశీ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.ఈ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. చిక్కుడుపందిరి క్రింద చిక్కుడుకాయలతో రథం చేసి, సూర్యభగవానుడిని పూజించి, సూర్యకిరణాల ప్రసరిస్తూ ఉండగా, ఆ చిక్కుడు పందిరిలో పాలు పొంగించి పరమాన్నం వండి, నివేదన చేయాలి.
16. రథసప్తమి
ఈశ్వరుడి సృష్టిలోని నవగ్రహాల్లో ప్రముఖుడైన సూర్యుడు మాఘశుద్ధ సప్తమినాడు జన్మించాడు. అందువల్ల ఈ పర్వదినాన్ని‘సూర్యజయంతి’ అని పిలుస్తారు.ఈ సప్తమినాడు విశాఖ నక్షత్రంలో అదితి కశ్యపులకు సూర్యుడు జన్మించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం ఉంది. ఉత్తరాయణం మకరసంక్రాంతి నుంచి ఆరంభమైనా, ఉత్తరం వైపు సూర్యుడి ప్రయాణం రథసప్తమి నాటినుంచే మొదలైందని చెబుతారు. అనాదిగా మానవజాతికి ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి సూర్యనారాయణుడు. ఓజస్సును, శక్తిని, ఆయుష్షును తనలో కలుపుకొని, తనను ఆరాధించేవారికి ఆయురారోగ్యాలు ప్రసాదించే ఈ ఆర్తత్రాణపరాయణుడికి యాభైకి పైగా పర్యాయ పదాలున్నాయి. భాస్కరుడు లేకపోతే జీవకోటికి అస్తిత్వమేలేదు. నిస్వార్థకర్మకు తిరుగులేని ఉదాహరణ అరుణుడు. పద్నాలుగు వేల సంవత్సరాల క్రితం మయూరుడనే కుష్ఠురోగగ్రస్తుడు ప్రభాకరుణ్ని ప్రశంసిస్తూ ‘సూర్యశతకం’ రాసి సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. సూర్యుడు సకలవిధ కాలుష్య నిర్మూలకుడు. తన కిరణాలతో నీటిని గ్రహించి వర్షరూపంలో ధరణిని సస్యశ్యామలం చేస్తూ, సర్వులకు ఆహారమిస్తున్న అన్నదాత.సూర్యుడికి ‘వివస్వంతుడు’ అనే పేరుంది. వివస్వంతుడి కుమారుడు వైవస్వతుడు ఏడో మనువు. అతడి మన్వంతరానికి రథసప్తమి మొదటి తిథి. పితృదేవతలకు ప్రియకరమైన తిథి. కనుక వారికి తర్పణాదులు ఆ రోజున విడిచే ఆచారం ఉంది. ఒకప్పుడు రథసప్తమిని తెలుగువారు ఉగాదిగా జరుపుకొనేవారట. రోహిణీ నక్షత్రంతో కూడిన రథసప్తమి మహత్తరమైన ఫలితమిస్తుందని చెబుతారు.రథసప్తమినాడు చేసే ‘అచలాసప్తమి’ వ్రతం వల్ల స్త్రీ పుత్రవతి, రూపవతి, సౌభాగ్యవతి అవుతుందని యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. చతుర్వర్ణ చింతామణి, మదనరత్నము, ఆదిత్య పురాణాల్లో ఈ వ్రత ప్రాధాన్యం విస్తృతంగా ఉంది. రుగ్వేదంలో పదిరుక్కుల సూర్యస్తుతి ఉంది. సుప్రసిద్ధ వేదమంత్రం గాయత్రి సూర్యపరమైందే! అగస్త్యుడు శ్రీరాముడికి ‘ఆదిత్య హృద యం’ ఉపదేశించి రావణవధచేసేఆత్మస్థైర్యంకలిగించాడు.రథసప్తమినాడు సూర్యోదయానికి పూర్వమే గ్రహనక్షత్రాల సన్నివేశం సూర్యరథాకారంగా చరిస్తుంది. ఆ బ్రాహ్మీముహూర్తాన జిల్లేడుగాని, రేగుకాని, చిక్కుడు ఆకులనుగాని తలమీద, భుజాలమీద పెట్టుకుని అభ్యంగ స్నానం చేస్తారు. చిక్కుడాకులు పేర్చి వాటిలో పాయసం వడ్డించి, సూర్యదేవుడికి నైవేద్యం పెడతారు. సప్తమి ఉదయాన షష్ఠి తిథి కూడా ఉంటే, ఆ రెండు తిథుల కలయిక మరీ శుభప్రదమంటారు.భానుడు మేరు పర్వతం మీది నుంచి పాకి పశ్చిమాలకు ప్రయాణిస్తూనే యాజ్ఞవల్క్యుడికి, ఆంజనేయుడికి వేద, శాస్త్ర, వ్యాకరణాదులు నేర్పాడని, వనవాసంలో ఉన్న ధర్మరాజుకు అక్షయపాత్ర ఇచ్చి ఆదుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కుంతి సూర్యమంత్ర ప్రభావంవల్లనే కర్ణుణ్ని పుత్రుడిగా పొందిందని, సత్రాజిత్తు సూర్యారాధన చేసి శమంతకమణిని పొందగలిగాడని చెబుతారు. సూర్యుడి కృపకోసం అరుణపారాయణం చేస్తారు. శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబుడి సూర్యోపాసన అనన్య సామాన్యమైంది. శిల్పశాస్త్రంలోనూ సూర్యవర్ణన ఉంది. సూర్యోదయం సమయాన సూర్యుడికిచ్చే ‘అర్ఘ్యం’ అత్యంత ఫలప్రదమైంది. సంజ్ఞ, ఛాయ, పద్మిని, ఉష అని సూర్యుడికి నలుగురు భార్యలు. ప్రపంచమంతటా ఏదో రూపంలో, ఏదో నామంతో ఆదిత్యుణ్ని ఆరాధిస్తున్నారు. సూర్యవంశజులైన రాజులెందరో ప్రఖ్యాతి వహించారు. అతిపుణ్యప్రదమైన గ్రహణకాలాల వేయింటి ఫలం ఒక్క రథ సప్తమికే ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. సృష్టిలోని సకల ఓషధులు సూర్యప్రభావం వల్ల శక్తిమంతమై మనకు ఆరోగ్యం ప్రసాదిస్తున్నాయి.
17. శుభోదయం
ఎవరైనా ఒక్కసారి ఏదైనా చెప్పినపుడు…
ఈ చెవిలో చెప్పింది ఆ చెవిలోంచి వదిలేయకుండా…
అవతలి వాళ్ళ మనస్తత్వం ఇలాంటిది అని జీవితాంతం గుర్తుంచకోవాలి.
ఈ ప్రపంచంలో మంచికి దారి తీసే మార్గం కఠోరమైనది…
అమిత ప్రయాసలతో కూడుకున్నది…
మంచి వాళ్లకే పరీక్షలు ఎక్కువ.
చితి… ప్రాణంలేని కట్టెను కాలుస్తుంది…
దిగులు… ప్రాణం ఉన్న మనిషిని నిలువునా కాలుస్తుంది.
మోసగాడ్ని గుర్తించకపోతే ఒక్కసారి మోసపోతావేమో…
కానీ మంచివాడ్ని గుర్తించలేకపోతే జీవితాంతం నష్టపోతావు.
18. శుభమస్తు _ నేటి పంచాంగం
తేది : 1, ఫిబ్రవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(ఈరోజు పగలు 2 గం॥ 21 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(ఈరోజు సాయంత్రం 5 గం॥ 41 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు పగలు 1 గం॥ 28 ని॥ నుంచి 3 గం॥ 14 ని॥ వరకు) పున: రా.తె.4-06 ని నుండి 5-50 వరకు
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 02 ని॥ నుంచి 11 గం॥ 47 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 13 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 19 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 10 ని॥ లకు
19. చరిత్రలో రోజు*
*01, ఫిబ్రవరి*
*సంఘటనలు*
1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
2003: అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
*జననాలు*
1929: జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)
1933: వెల్చేరు నారాయణరావు, ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు పండితుడు.
1936: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
1945: బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్తగా ప్రసిద్ధుడు.
1956: సుధాకర్, ప్రముఖ తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత.
1956: బ్రహ్మానందం, ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
1961: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
1965: అంథోనీ పీటర్ కిశోర్, అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు.
1971: అజయ్ జడేజా, భారత క్రికెట్ క్రీడాకారుడు.
*మరణాలు*
1998: మార్గా ఫాల్స్టిచ్, ప్రముఖ జర్మన్ శాస్త్రవేత్త (జ.1915)
2003: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
2009: రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
2017: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925)
*పండుగలు మరియు జాతీయ దినాలు*
భారతీయ తపాలా బీమా దినం.
భారత తీర రక్షక దళ దినోత్సవం.
20. రాశిఫలం- 01/02/2020
తిథి:
శుద్ధ షష్టి మ.12.32, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం: రేవతి మ.3.27
వర్జ్యం:
లేదు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12వరకు
రాహు కాలం:
ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుంటాయ. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొ అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ విషయాలపై ఆనాసక్తితో వుంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి వుంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా వుంటాయి.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురగును. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ధనలాభంతో ఆనందంగా వుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తిప్రతిష్ఠలు అధికమవుతాయి.
21. రథసప్తమి – విశేషాలుఓం ఆదిత్యాయ నమః
#రథసప్తమి
ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 #తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరంఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి
యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||
అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.
సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర
ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి #దేశీ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.ఈ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. చిక్కుడుపందిరి క్రింద చిక్కుడుకాయలతో రథం చేసి, సూర్యభగవానుడిని పూజించి, సూర్యకిరణాల ప్రసరిస్తూ ఉండగా, ఆ చిక్కుడు పందిరిలో పాలు పొంగించి పరమాన్నం వండి, నివేదన చేయాలి.
22. మేడారం జాతరకు స్పెషల్ ప్యాకేజీ
తెలంగాణ టూరిజం శాఖ మేడారం జాతరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. టూర్ వివరాలు ఇలా ఉన్నాయి.
*హైదరాబాద్- మేడారం- హైదరాబాద్(వన్ డే ప్యాకేజీ టూర్)
ఉదయం 6 గంటలకు యాత్రినివాస్, సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ ఉదయం 6:15కు సీఆర్ఓబషీర్ బాగ్ నుంచి మొదలై, రాత్రి10.30 హైదరాబాద్ చేరుకుంటారు. మేడారంతోపాటు వేయిస్తంభాలగుడి సందర్శన. వోల్వో కోచ్: పిల్లలకు రూ.1200, పెద్దలకు రూ.1500. ఏసీ హైటెక్ కోచ్: పిలలకు రూ.800, పెద్దలకు 1000.
*రిజర్వేషన్ ఆఫీసులు
హైదరాబాద్ బషీర్ బాగ్: ఫోన్ 04029801039/40, సెల్: 98485 40371 ట్యాంక్ బండ్ రోడ్డు: ఫోన్ 04023450165, సెల్:98481 25720 పర్యాటక భవన్: ఫోన్ 04023414334, సెల్: 98483 06435 శిల్పారామం : ఫోన్ 04023119557, సెల్: 96665 78880 కూకట్ పల్లి: ఫోన్ 040-23052028, సెల్: 98485 40374 దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్ నగర్: సెల్ 98480 07020 సికింద్రాబాద్ యాత్రి నివాస్: ఫోన్ 04027893100 సెల్: 98481 26947 వరంగల్: ఫోన్ 08702562236 నిజామాబాద్: ఫోన్ 08462224403
*మేడారం జాతరలో ముఖ్యమైన రోజులు
05–02–2020: సారలమ్మ దేవత గద్దెకు చేరుట. 06–02–2020: సమ్మక్క దేవత గద్దెకు చేరుట. 07.02.2020: భక్తులు నైవేద్యం/ బంగారం మొక్కులు చెల్లించడం. 08.02.2020: సమ్మక్క-సారలమ్మ జాతర చివరి రోజు. అమ్మవార్లు వన ప్రవేశం.
23. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
ప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌- వరంగల్‌ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటు ఉంటాయని, ఇవి మౌలాలీ, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ, రఘునాథ్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే వివరించింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్- వరంగల్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య మరో 10 రైళ్లు నడవనున్నాయి. ఇవి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, జమ్మికుంట, కొత్తపల్లి, కొలనూర్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.
24. దుర్గగుడిలో అన్యమత ప్రచారం.. ఉద్యోగి తొలగింపు
దుర్గగుడిలో ఉద్యోగం చేస్తూ అన్యమత ప్రచారానికి సహకరిస్తున్న ఒప్పంద ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. ఆలయంలో పారిశుద్ధ్య విభాగాన్ని నిర్వహిస్తున్న కేఎల్ టెక్ సంస్థ సూపర్వైజర్ కిరణ్.. తన ఉద్యోగులను అన్యమత ప్రార్థన మందిరానికి వెళ్లాలని సూచించేవాడు. వారిలో కొందరు మహిళలు విషయాన్ని భాజపా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు దేవస్థానం ఈవో సురేష్బాబుకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఏఈవో వెంకటరెడ్డిని విచారణకు ఆదేశించారు. వచ్చిన నివేదిక ఆధారంగా కిరణ్ను ఉద్యోగం నుంచి తొలగించారు.
25.తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు
తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రూపాల్లో మాడ వీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. శనివారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 7 వాహనాలపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీవారికి చినశేషవాహన సేవ, 11 గంటలకు గరుడ సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.
26.అరసవల్లిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆదిత్యునికి ఘనంగా మహాక్షీరాభిషేక సేవ జరిగింది. ప్రథమార్చన పూజల్లో విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానంద్రేంద్ర సరస్వతీ పాల్గొన్నారు. తొలి పూజలో స్వామి వారిని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణదాస్ తదితరులు దర్శించుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
27.మేడారానికి పర్యాటక బస్సు, హెలికాప్టర్ సేవలు
మేడారం మహాజాతర నేపథ్యంలో తెలంగాణ పర్యాటక సంస్థ శనివారం నుంచి బస్సులను నడపనుంది. పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ఉదయం 8 గంటలకు బస్సుల సేవలను ప్రారంభించనున్నారు. ఆదివారం నుంచి మాత్రం ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్లోని యాత్రీనివాస్, 6.15కి బషీర్బాగ్ సీఆర్వో కార్యాలయం నుంచి మేడారానికి బస్సులు బయల్దేరుతాయి. జాతరకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ సేవలూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. వనదేవతల దర్శనం చేసుకుని తిరిగి గంటల వ్యవధిలో నగరానికి చేరుకోవచ్చన్నారు.
28. విజయకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చ కస్వాములు శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీత్రి దండి శ్రీమన్నారాయణ రా మానుజ చినజీయర్ స్వామి మంగళశాసనాలతో శ్రీ అహో బిల జీయర్స్వామి గరుడ ప టానికి పూజలు నిర్వహించి, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. జీయర్ ఆశ్రమనిర్వాహకులు వెంకటాచార్యులు ఆధ్వర్యంలో వేద విద్యార్థు లు అగ్ని ప్రతిష్ఠ యాగం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేశారు. అనంతరం జరిగిన స్వామి వారి అశ్వవాహన ఊరేగింపు సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి దేవతాహ్వానం, శేషవాహన సేవాకార్యక్రమాలు విశేషంగా జరిగాయి. శ్రీఅహోబిల జీయర్స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేసి, తీర్థగోష్ఠి నిర్వహించారు. వేదపాఠశాల ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు.ఈ కార్య క్రమంలో వెంకటాచార్యులు, అర్చ కులు మధుసూదనాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రఘునాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు.