Food

తమలపాకుతో లాభాలెన్నో

Health benefits of betel leaves

తమలపాకు మనకు తాంబూలంగా తెలుసు. కానీ ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఈ ఆకు నిండా క్రిమినాశక పదార్థాలే. ముక్కు నుండి రక్తం కారడం, కళ్లు ఎరుపెక్కడం, అధిక రక్తస్రావం తదితర సమస్యలకు ఇది మందుగా పనిచేస్తుంది. స్వరం పీలగా ఉన్నవారు దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. శతాబ్దాలుగా దీనికి ఔషధమొక్కగా గుర్తింపు ఉంది. ఇంతకీ దీన్ని ఔషధంగా ఎలా ఉపయోగించాలంటారా…
*దగ్గు మందుగా :
మూడు గ్లాసుల నీటిలో 15 తమలపాకులను వేసి, నీరు సగం అయ్యేవరకూ బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి, తేనె కలిపి తాగాలి.
*బ్రాంకైటిస్‌ చికిత్సలో:
రెండు కప్పుల నీటిలో ఏడు తమలపాకులు, పటికబెల్లం వేసి, కప్పు నీరు అయ్యేవరకూ మరిగించాలి. ఈ పానీయాన్ని ప్రతిరోజూ గ్లాస్‌ చొప్పున మూడుసార్లు తాగాలి.
శరీర దుర్వాసన తొలగించడానికి : రెండు గ్లాసుల నీటిలో ఐదు తమలపాకులను వేసి, గ్లాస్‌ అయ్యే వరకూ మరిగించాలి. ఈ పానీయాన్ని మధ్యాహ్నం తాగాలి.
*కాలిన గాయాలకు :
తమలపాకులను శుభ్రంగా కడిగి, రసాన్ని తీసి, దానికి తేనె కలిపి, కాలిన గాయాల మీద రాయాలి.
*ముక్కు నుండి రక్తం కారే సమస్యకు:
లేత తమలపాకు ఒకటి తీసుకుని మెత్తగా చేసి, ముక్కు వద్ద ఉంచి వాసన పీలిస్తే రక్తం రావటం ఆగిపోతుంది.
*కురుపులకు:
తమలపాకు ఆకులను తీసుకుని, శుభ్రంగా కడిగి, వాటిని ఉడికించి, ఆ ముక్కలను కురుపులు ఉన్న ప్రాంతంలో అద్దాలి. ఈ విధంగా రోజులో రెండుసార్లు చేయాలి.
*దురద/ఎరుపు కన్ను :
గ్లాస్‌లో ఐదు లేత తమలపాకులను వేసి, మరిగించాలి. చల్లబడిన తర్వాత ఆ నీటితో కళ్ళను రోజుకి మూడుసార్లు కడగాలి.
* జననేంద్రియాల వద్ద దురద:
రెండు కప్పుల నీటిలో 20 తమలపాకులను వేసి, బాగా మరిగించాలి. ఈ నీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కురుపులు, దురద ఉన్న ప్రాంతంలో కడగటానికి ఉపయోగించాలి.
*చిగుళ్ళ నుంచి రక్తస్రావం:
రెండు కప్పుల నీటిలో నాలుగు తమలపాకులను వేసి, మరిగించి ఆ నీటితో పుక్కిలించాలి.
*పేగువ్యాధి : రెండు తమలపాకులను తీసుకుని, శుభ్రంగా కడిగి, బాగా నమిలి రసాన్ని మింగి, పిప్పిని ఊసేయాలి.
*నోటి దుర్వాసన తొలగించడానికి :
రెండు తమలపాకులను శుభ్రంగా కడిగి, రసాన్ని పిండి, ఆ రసాన్ని వేడినీటిలో కలిపి పుక్కిలించి ఊయాలి.