Movies

డిప్రెషన్‌పై సినిమాలు

Jahnvi Kapoor To Make Movies On Depression And Mental Health

తొలి చిత్రం ‘ధడక్‌’తోనే ఆకట్టుకుంది జాన్వీ కపూర్‌. హీరోయిన్‌ అంటే నాలుగు పాటలు, అందాల ఆరబోత..అనే ఫార్ములాకు భిన్నంగా వెళ్లాలని భావిస్తున్నట్టుంది జాన్వి. రెండో చిత్రమే బయోపిక్‌ ఒప్పుకుంది. తొలి యుద్ధ విమాన పైలెట్‌గా కార్గిల్‌ యుద్ధంలో సేవలందించిన గుంజన్‌ సక్సేనా జీవిత కథతో వస్తోన్న ‘గుంజన్‌ సక్సేనా: కార్గిల్‌ గర్ల్‌’లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు మరో వైవిధ్యమైన కథలో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. ‘‘దేశంలో ఎన్నో సామాజిక సమస్యలు ఉన్నాయి. వాటి నేపథ్యంగా సాగే కథల్లో నటించాలనుంది. మరీ ముఖ్యంగా మానసిక ఆరోగ్యం నేపథ్యంగా సాగే కథలో నటించాలన్నది నా కోరిక. ఆ తరహా చిత్రంలో నటించడం ద్వారా సమాజానికి అవసరమైన విషయాన్ని చర్చించే అవకాశం ఉంటుంది. నటిగా నన్ను నేను నిరూపించుకోవచ్చు కూడా’’ అని చెప్పింది జాన్వి. మెంటల్‌ హెల్త్‌కు సంబంధించిన ఓ కథ జాన్వి వద్దకు వచ్చినట్టు సమాచారం. వెండితెర, బుల్లితెర నటుడు కుషల్‌ పంజాబీ మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ను బాగా కలిచివేసింది. అప్పుడే మానసిక సమస్యలపై ఓ సినిమాని చేయాలని నిర్ణయించుకున్నట్టు ఓ సందర్భంలో చెప్పారు అక్షయ్‌. ఈ నేపథ్యంలోనే అక్షయ్‌కుమార్‌… జాన్వీ కపూర్‌తో ఓ చిత్రం నిర్మించే అవకాశాలు ఉన్నాయంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.